Home Life Style This Conversation Between A King & His Dead Soldier Shows The Cruelty...

This Conversation Between A King & His Dead Soldier Shows The Cruelty & Also Spirit Of War

0

Written By: Swaroop Thotada

ఆ అర్ధరాత్రి పూట రాజకుమారుడు గుర్రమెక్కి ఎవరికంటా పడకుండా కోట దాటి బయటపడ్డాడు. రోజూ తన కోట గది కిటికీలోంచి దూరంగా జరుగుతున్న యుద్ధాన్ని, యుద్ధం అనంతరం రాత్రి నిశ్శబ్దాన్ని చూస్తూనే ఉన్నాడు. ఆ యుద్ధభూమి పగలంతా గుర్రాల సకిలింపులతో, చేతులు కాళ్ళు తెగిన సైనికుల ఆర్తనాదాలతో, దుమ్ము దూళి కలిసిన రక్తపు జిగటతో విలసిల్లింది. రాత్రి పూట మాత్రం చివరి చివరిశ్వాస శబ్దం కూడా సాయంత్రపు చిరుగాలి విసురులో కలిసిపోయి అంగుళం అంగుళాన్ని జన్మతః సంక్రమించిన ఆస్తిలా చీకటి ఆక్రమించుకుని, అక్కడ పడి ఉన్న శవాల్ని తినడానికొచ్చిన అడవి నక్కల కూత మాత్రమే చీల్చగలిగే దట్టమైన నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. ఆ విధ్వంసం కన్నా ఈ నిమ్మళత్వమే ఎక్కువ భయపెడుతుంది.

కోట పైనుండి చూస్తే పక్కనే ఉన్నట్టు కనబడే యుద్ధభూమి బయలుదేరాక దూరంగా అనిపిస్తుంది. మెల్లగా ఆ దూరపు మృతదేహాల నుండి ఒక నల్లటి పొగలాంటిదేదో ఎదురొచ్చి రాజకుమారుడి మనసులో భయంగా స్థిరపడసాగింది. ఒక్క క్షణం ఊపిరి బిగబట్టి గుర్రం వేగం పెంచాడు. రాజావస్త్రాలతో వెళితే ప్రమాదమని తెలిసి నల్లటి గొంగళి కప్పుకుని మారువేషంలో బయలుదేరాడు. ఈ ఎముకలు కోరికే చలి నుండి అదే అతన్ని రక్షిస్తుంది. పక్షం రోజులుగా అతి భీకరంగా జరుగుతున్న యుద్ధం ఇక చాలించమన్నట్టు ఈ రోజు సాయంత్రమే యుద్ధాన్ని ఆటంకపరుస్తూ కుంభ వర్షం కురిసింది. దాని అవశేషాలు ఇంకా గాలిలో తేమాలా తెలుస్తూనే ఉన్నాయి. నేల బురదయింది. యుద్ధభూమిలోకి చాలా దూరం వచ్చేసానని వెనక్కి తిరిగి చూసినప్పుడు కానీ అర్ధం కాలేదు రాజకుమారుడికి. చంద్రుడి వెన్నెల ఆ శవాల మీద పడ్డప్పుడు పట్టరాని బాధను ఇంకా మిగుల్చుకున్న ఆ మృతదేహాల ముఖాలు ఇంకా వికృతంగా కనబడసాగాయి. రాజకుమారుడిలో భయం తారాస్థాయికి చేరాక అక్కడ పడి ఉన్న ఒక శత్రు సైనికుడి శవంలోంచి చీకటి మాట్లాడసాగింది.

1 King“అయ్యో రాకుమారా… వెచ్చని నీ పరుపు మీద ఆదమరిచి నిద్రపోక ఈ చలిలో, ఈ చీకటిలో, మరణపు వాసనలోకి, చీకటి నడిబొడ్డులోకి ఎందుకొచ్చావు? ఇక ఇక్కడినుండి తిరిగి వెళ్ళలేవని తెలుసా నీకు? ” అని అడిగింది.

కొండచిలువ చుట్టుకున్నట్టు ఏదో అతని మీద పాకుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఎలాంటి స్పర్శా లేదు. ఒరలో ఉన్న కత్తి పిడి మీదికి వెళ్ళింది రాజ కుమారుడి చెయ్యి. చీకటి బిగ్గరగా నవ్వింది. ఉన్నపళంగా ఆకాశంలో మెరుపు మెరిసి రాజకుమారుడికి అప్పటివరకూ కనిపించినవాటికి పదులరెట్ల సంఖ్యలో ఉన్న శవాలు ఒక్కసారిగా కనబడ్డాయి.దూరంగా చీకటిలో అప్పటివరకూ కనబడ్డ పెద్ద పెద్ద తేళ్ళలాంటి మృగాలు పడిపోయిన చెట్ల మానులని తెలిసింది.

“నేను వెనక్కి పోగలను.అడ్డుకొని చూడు” అన్నాడు తెచ్చిపెట్టుకున్న ఒక మొండి ధైర్యం తో.

చీకటి మళ్లీ గట్టిగా నవ్వింది.

“నువ్వీ వెన్నెలకంటే నాజూగ్గా ఉన్నావు రాకుమారా. ఇక్కడ చచ్చి పడ్డ గుర్రాలకన్నా అమాయకుడివి లాగున్నావు. వెనక్కి వెళ్లడం అంటే కోటలోకి వెళ్లడం కాదు. కోట దాటక ముందున్న రాకుమారుడి దగ్గరకు వెళ్లడం.నువ్వు ఇప్పుడు ఇక్కడ చూసిన వాటిని నీ కళ్ళలోంచి తుంచలేవు, నీ తలంపుల్లోంచి తెంచలేవు. వెనక్కి వెళ్లే వీలు లేని దారిలో వచ్చావు నువ్వు. ఆ శవాల ముఖకవళికలు చూసిన క్షణమే నీ ప్రపంచం విచ్చిన్నమై మరో లోకం నీకు సృష్టించబడింది. నీ పాత లోకం ఇక శాశ్వతంగా నాలో కలిసిపోయింది. ఈ ఒలికిన రక్తంలోంచి ప్రాణం గాలిలో కలిసిపోయినట్టు నీ లేత అమాయకత్వం గతించిపోయింది. ఆ వెచ్చటి పరుపు వదిలి ఇక్కడికి ఎందుకొచ్చావ్? “

చీకటి భయపెట్టే కొద్దీ ఎందుకో రాజకుమారుడికి ధైర్యం రాసాగింది. “నిన్నిలా చూడటానికే వచ్చాను. నీతో వాదన పెట్టుకోడానికొచ్చాను. నీ మాయలో ఉద్విగ్నులైపోయి ఈ సైనికులూ రాజులూ ఆటలో పావులమని మరిచిపోతున్నారు.” అన్నాడు.

పెద్ద గాలి వీచి ఓ మర్రి చెట్టు వేళ్ళతో సహా పెకిలించబడింది. ఆ గాలికి తాను కూడా కొట్టుకుపోకుండా అక్కడే నేలలో దిగబడ్డ ఒక కత్తిని ఆసరాగా పట్టుకున్నాడు రాజకుమారుడు. ఆ గాలి కొంచెం సద్దుమణిగాక చీకటి ఇలా అంది ” సరే వచ్చావుగా విను. నాతో వాదనలుండవు. నీ తండ్రి ఈ యుద్ధం ఓడిపోతాడు. నీ రాజ్యం చెర పట్టబడబోతుంది. నీ ప్రజలు బానిసలవుతారు. నీ తండ్రి అజ్ఞానానికి అందరూ శిక్షించబడతారు. ఇందులో ఏ మార్పూ ఉండబోదు”

రాకుమారుడి కోపం వచ్చింది. “నా తండ్రి జ్ఞాని. ఏనాడూ ఎవరికీ అన్యాయపు తీర్పు తీర్చలేదు.ధర్మమే తప్ప అధర్మాన్ని ఆచరించలేదు. శ్రేష్టమైన దాన్ని తప్ప ఎన్నడూ వేరేదీ ఆరాధించలేదు” అరిచాడు రాజకుమారుడు.

“అవును. కానీ నీ తండ్రి ఎన్నడూ నీలాగ గుర్రమెక్కి కటిక చీకటిలో నన్ను కలవడానికి రాలేదు. వెలుగుతో చీకటిపై యుద్ధం చేయాలనుకున్నాడు. వెలుగూ నేనూ విరుద్దమనుకున్నాడు. వెలుగు పడ్డ ప్రతి వస్తువూ నీడనిస్తుందని మర్చిపోయాడు. ఈ వెన్నెల రాత్రికి పరుపు పరిచిందే నేను కదా. వంతులు వేసుకొని వెలుగూ నేనూ పనిచేయబట్టే కదా పగలూ రాత్రీ. ప్రేతాల భయాల్ని పుట్టించడమే కాదు, పగటి అలసటను సంధ్యలో మెల్లగా ముంచి రాత్రి నిద్రలో మాయం చేసేది నేను కదా. నేను ప్రతి దాన్నీ కబళిస్తాను, ప్రతి మనిషినీ సంధిస్తాను. నేను కమ్మక ముందే ఇలా నాతో సంధికి రాకపోతే నేను ఒక్క సారే మీద పడ్డాక గుండె ఆగుతుందో పగులుతుందో నేనే చెప్పలేను. భళా రాజకుమారా. నువ్వు అమాయకుడివే కానీ సరియైన వాడివి. కానీ ఇంకా ముందే రావాల్సింది. సరే, నువ్వు కూడా నీ ప్రజలతో పాటు బానిసత్వం లోకి వెళతావు. కానీ నేను నీ అమ్ములపొదిలో ఒక బాణంగా ఉంటాను. శత్రు రాజ్యం లో నీవు తినే కొరడా దెబ్బలతో నీకు సానబెడతాను.ఇలాంటి చలి రాత్రులెన్నో నీ జీవితంలో ఉండబోతున్నాయి అలవాటు పడు. నీతో పాటు ఈ చలిగా చీకటిగా నేనూ ఉంటాను.గాయంలా తొలుస్తూ ఉంటాను. శిల్పంలా చెక్కుతుంటాను. రాత్రి గడిచి మళ్లీ ఉదయించే వేళకు చీకటి వెలుగుల సంపూర్ణ జ్ఞానాన్నై నీ కూడా ఎప్పటికీ ఉంటాను. ఈ భూమిలాగే నన్ను ఎక్కడ ఆహ్వానించాలో ఎప్పుడు సాగనంపాలో తెలుసుకో, నిన్ను మళ్లీ రాజుని చేస్తాను. ఓపిగ్గా ఉండు. నీతో ఇది నా ఒప్పందం.” అని నిమ్మళించింది చీకటి.

తెల్లవారు ఝాము కిరణాలు మెల్లగా పొగమంచును చీల్చుకుంటూ వస్తున్నాయి. దూరంగా శత్రు సైన్యం కవాతు వినబడుతుంది. భూమి అదురుతుంది.

Exit mobile version