ఆదివరాహావతారం తో వెలసిన ఆలయాలు రెండు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక ఆలయం తిరుమల తిరుపతిలో ఉండగా, రెండవ ఆలయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కామన్ పూర్ గ్రామంలో శ్రీ ఆదివారాహస్వామి వారి ఆలయం ఉంది. దశావతారాల్లో ఆదివారాహస్వామి అవతారం మూడొవదిగా ప్రసిద్ధి గాంచింది. అయితే తిరుమలలో ప్రధమ పూజ వరాహస్వామియే అందుకుంటున్నాడు. స్థలపురాణం ప్రకారం 600 సంవత్సరాల క్రితం ఒక మహర్షి ఆది వరాహమూర్తి దర్శనం కోసం తపస్సు చేశాడు. ఆయన కలలో ఆది వరాహస్వామి ప్రత్యక్షం అయి, దర్శనమిచ్చాడు. మహర్షి కోరిక మేరకు ఒక చిన్న బండరాతిపైన శ్రీ మహావిష్ణువు ఆది వరాహమూర్తిగా వెలిశాడు. అయితే, ఈ విషయం ఎవరికీ తెలియక పోవడంతో క్రమేణా విగ్రహం మరుగున పడింది. ఇటీవల అంటే దాదాపు మూడున్నర దశాబ్దాల క్రితం తవ్వకాలలో స్వామి వారి విగ్రహం బయట పడడంతో ఆ మూర్తిని అక్కడే ప్రతిష్ఠించి, ఆదివరాహమూర్తిగా పూజించడం ప్రాంభించారు. ఇక్కడ స్వామి వారిని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకున్న వారి కోరికలు తీరుతుండడంతో అందరూ కూడా స్వామిని వరాల స్వామిగా కొలుస్తున్నారు. గతంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు సింగరేణి సంస్థ ఆలయానికి సమీపంలో బుల్‌డోజర్లతో భూమిని చదును చేస్తుండగా బుల్‌డోజర్ ముందుకు కదలనంటూ మొరాయించింది. ఎందుకిలా జరిగిందంటూ అక్కడ పరిశీలించగా ఒక బండరాయి మీద స్వామివారి పాదముద్రలు ప్రత్యక్షమయ్యాయి. అక్కడినుంచి ఆలయం వరకూ స్వామివారు నడచి వస్తున్నట్లుగా పాదముద్రలు కనిపించడంతో మరింత భక్తిశ్రద్ధలతో పూజించడం ప్రారంభించారు భక్తులు. ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు నెరవేరితే మందిరం నిర్మిస్తానని గత పది సంవత్సరాల క్రితం స్వామివారికి మొక్కుకున్నాడు. స్వామివారి కరుణతో అతను అనుకున్న పనులన్నీ సవ్యంగా జరగడంతో మందిర నిర్మాణానికి పూనుకున్నాడా భక్తుడు. ఇంతలో ఆ భక్తుని కలలో స్వామివారు కనిపించి, తనకు ఏ విధమైన మందిరంగానీ, గోపురం గానీ నిర్మించవద్దని, తాను భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎల్లవేళలా వారికి తన దర్శనభాగ్యం కల్పిస్తూ, అక్కడే ఉంటానని చెప్పడంతో మందిర నిర్మాణాన్ని మానుకున్నాడు భక్తుడు. జిల్లాకు తూర్పుదిశగా ఒక బండరాతి మీద చిన్న ఎలుక పరిమాణంలో తొలుత భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు, తర్వాత క్రమేణా పెరగడం ప్రారంభించి, రెండు అడుగుల కన్నా పెద్దగా పెరిగారు. ఈ బండపై కొలువు తీరిన విగ్రహంపై రోమాలు కూడా కనిపించడం విశేషం. స్వామివారికి నిత్యం పూజలు, అభిషేకాలు, అర్చనల జరుగుతుంటాయి. ఇంతటి విశేషం ఉన్న ఈ అవతారంలో వెలసిన స్వామివారిని చూడటానికి భక్తులు అనేక ప్రాంతాల నుండి వచ్చి తమ కోరికలను నెరవేర్చుకుంటున్నారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.