Written By Swaroop Thotada
Batman Begins చిత్రం ప్రారంభంలో Bruce Wayne తన ఆస్తినంతా తన butler కి అప్పజెప్పి ప్రపంచం నలుమూలల్లో అల్లరి మూకలతో, దొంగల ముఠాలతో తిరుగుతుంటాడు. తరతరాలు తిన్నా తరగనంత ఆస్తి వదిలేసి ఈ ముఠాతో నేపాల్లోని ఒక నరకప్రాయమైన చెరసాలలో వచ్చి పడతాడు. అతని అసలు పేరు చెప్తే అతన్ని వదిలేస్తారు. కానీ ఒక అనామకుడిగా అక్కడే ఉండటానికి నిర్ణయించుకుంటాడు. ఈ కరడుగట్టిన నేరస్తుల్ని అర్ధం చేసుకోవాలన్నదే అతని ప్రయత్నం. వారితో కలిసి తిరిగితే, గొడవపడి బురదలో కొట్లాడితే, ఆ హింసా ప్రవృత్తి వెనుక ఏదో నిజం అర్ధమవుతుందని అతని ఉద్దేశం.
Carl Jung దీన్నే confronting the shadow అంటాడు. మనిషిలో ఉండే అంతర్గతమైన చీకటికి సమాహారం shadow. “One does not become enlightened by imagining figures of light, but by making the darkness conscious” అంటాడు Jung. మనలో ఉన్న చీకటితో ముఖాముఖీ గా కలిసి సంధి చేసుకుంటే తప్ప మన మానసిక ఎదుగుదల సాధ్యం కాదంటాడు. ఇక్కడ Wayne చేస్తుంది కూడా కొంచం అలాంటిదే. Evil ని ఎలా అర్ధం చేసుకోవాలి? దయా దాక్షిణ్యం లేకుండా ప్రాణాలు తీసే కొంత మంది మనుషుల మనస్థితిని ఏ sophisticated thinking మనకు విపులీకరిస్తుంది? మానసిక శాస్త్రం ఊతంతో మనుషుల హింసాత్మక ప్రవృత్తులు అవగతం చేసుకున్నా, దానికి చుట్టూతా ప్రపంచపు తీరులో, సమాజపు నిర్మాణంలో, ఇంకా అవతల ఉనికి స్వభావంలో, దాని mechanism లో నక్కి అంతా వ్యాపించి ఉన్న చీకటిని, విచ్చిన్నాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? మన ఆలోచనా పటుత్వం ఈ విషయాల్ని మనకు సరళీకరించినా ఉపయోగం ఏమిటి? ప్రతి క్షణం ఏదో ఒక మూల ఏదో ఒక జీవి అకారణంగా నొప్పికీ, హింసకూ గురవుతూనే ఉంటుంది. పరిష్కారం? నిజ జీవితంలో అయితే ఉండదు. అందుకే ఈ కాల్పనిక ప్రపంచంలో పాత్రలు మన coping mechanisms.
Batman ఎప్పుడూ ప్రమాదాలకు సిద్ధంగానే ఉంటాడు. ఈ ప్రపంచం ఎంతమాత్రమూ perfect కాదన్న ఎరుకలో నిరంతరం ఉంటాడు. మనుషుల బలహీనత పట్ల ఒక వాస్తవిక దృక్పధాన్ని కలిగి ఉంటాడు. అయినా perfection కే aim చేస్తాడు. హీరోలు సాధ్యం కాని ఈ స్వార్ధపు ప్రపంచంలో ultimate sacrifice చేయడానికి సిద్ధంగా ఉంటాడు. మానవ స్వభావపు సరిహద్దుల మీద ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తుంటాడు. Batman ఎప్పటికీ ఆనందంగా ఉండలేడు. ఎందుకంటే అతను ఆనందంగా ఉండగలిగిన ప్రపంచంలో Batman అవసరమే ఉండదు కాబట్టి. ఒకరి వెనక ఒకరు అతనికి ప్రత్యర్ధులు, శత్రువులు వచ్చి పడుతూనే ఉంటారు. Ras Al Ghul, Joker, Bane, Riddler, Penguin, Two Face, Poison Ivy, Red Hood ఇలా అందరూ అతను నిద్ర మానేసి కాపు కాస్తున్న Gotham ని తగలబెట్టాలని ప్రయత్నించిన వారే. ఒక రకంగా ఈ పోరాటం అతనికి అవసరం కూడా. ఆ చీకటితో రక్తమోడుతూ చేసే యుద్ధం అతనికి ఒక ఆదరువు. అతని లోపల సంకెళ్లతో బంధించబడ్డ inner demons కి తాత్కాలిక విడుదల. అంతులేని ఆ ఆవేదనకి, భరింపశక్యం కాని నొప్పికీ చిత్రంగా ఆ విరామం లేని పోరాటమే ఊరట.
Batman ని చాలా మంది దర్శకులు handle చేసారు కానీ అందరిలోకీ Nolan బాగా విజయవంతమయ్యాడు. ఆ పాత్రను సృష్టించిన Bob Kane ఒక సందర్భంలో “Batman is associated more with the average man than Superman. He has no superpowers. He could bleed and die.” అంటాడు. అందుకే మిగతా సూపర్ హీరోలతో పోలిస్తే Batman పోరాటాలు మరింత వీరోచితం. ఆ రాత్రిపూట అతను rooftop నుంచి గాలం వేసుకుని దూకితే అతని శరీరం నలుగుతుంది, ప్రతి దెబ్బా మరునాటికి గుర్తుంటుంది. The Dark Knight Rises లో మనం మోకాళ్ళ నొప్పుల కోసం హాస్పిటల్ కి వెళ్లే Bruce Wayne ని చూస్తాం. ఆ గాడ్జెట్స్ వెనక ఉన్న మానవమాత్రుణ్ణి, ఆ డిటెక్టివ్ స్కిల్స్ వెనక దాక్కున్న సోలిపోయిన ఆత్మని, మానసిక అగాధాన్ని, ఆ పోరాట విన్యాసాల వెనక ఉండే Bruce యొక్క desperation నీ చక్కగా తెరకెక్కించాడు Nolan.