హిందూ సంప్రదాయంలో వినాయకుడు సకల దేవతాగణములకు అధిపతి. అన్నికార్యములకూ, పూజలకూ ప్రధమముగా పూజింపవలసినవాడు. విజయానికీ, చదువులకూ, జ్ఙానానికీ దిక్కైన దేవుడు వినాయకుడు. ఈయనను గణనాయకుడు, గణపతి, గణేశుడు మరియు అన్ని అడ్డంకులు తొలగించు వాడు విఘ్నేశ్వరుడు అంటూ అనేక రకాలుగా కొలుస్తారు. అయితే మనలో చాలా మందికి వినాయకుడి వాహనం అంటే మూషికం ఒక్కటే గుర్తుకు వస్తుంది. అయితే వినాయకుడికి మూషికం కాకుండా మరికొన్ని వాహనాలు ఉన్నాయని పురాణాలూ చెబుతున్నాయి. మరి వినాయకుడికి మొత్తం ఎన్ని వాహనాలు ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
మన పురాణాల ప్రకారం వినాయకుడికి మొత్తం ఎనిమిది అవతారాలు ఉన్నాయి. అందులో ఐదు అవతారాలలో ఎలుక వాహనం కాగా మిగతా అవతారాలలో ఒక్కో అవతారానికి ఒక్కో వాహనం అనేది ఉంది.
సింహం:
వినాయకుడి అవతారాలలో ఒక అవతారం వక్రతుండం. ఈ అవతారం ఓంకారానికి ప్రతీకగా చెబుతారు. అయితే ఈ అవతారంలో వినాయకుడు సింహనాధుడై మాత్సర్యాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడు.
నెమలి:
కామాసురుడిని సంహరించడానికి వినాయకుడి ఎత్తిన అవతారం వికటావతారం. ఈ అవతారంలో వినాయకుడు మయూర వాహనం పైన దర్శనమిస్తాడు.
శేషువు:
వినాయకుడు మమతా సురుని సంహరించడానికి ఎత్తిన అవతారం విఘ్నరాజావతారం. ఈ అవతారంలో వినాయకుడి వాహనం ఆదిశేశుషుడు.
ఎలుక:
వినాయకుడు ఎక్కువగా మనకు మూషిక వాహనుడై దర్శనం ఇస్తుంటాడు. ఇవే కాకుండా జైన సంప్రదాయాలలో వినాయకుడి వాహనంగా ఎలుక, ఏనుగు, నెమలి, తాబేలు, పొట్టేలు వంటివి కూడా ఆయన వాహనాలుగా చెప్పబడ్డాయి