Home Unknown facts పురాణాల ప్రకారం వినాయకుడి అవతారాలు ఎన్ని ?

పురాణాల ప్రకారం వినాయకుడి అవతారాలు ఎన్ని ?

0

హిందువుల ఆరాధ్య దైవం గణపతి. దేవతలందరికి అధిపతి గణపతి అని చెబుతుంటారు. శివపార్వతుల పెద్ద కొడుకు గణపతి. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు. మరి వినాయకుడి అవతారాలు ఎన్ని? వాటి విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముద్గుల పురాణంలో వినాయకుడికి మొత్తం ఎనిమిది అవతరాలని చెప్పబడింది. అవి వక్రతుండ, ఏకదంతా, మహోదర, గజ వక్త, లంబోదర, వికట, విఘ్నరాజా, ధూమ్రవర్ణ.

వక్రతుండావతారం:

Ganeshaపూర్వం మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను ముప్పుతిప్పలు పెడుతుండగా అప్పుడు దేవతలంతా కలసి దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్లి ఉపాయం అడుగగా అయన గణపతిని ప్రార్ధించమని చెప్పాడు. అప్పుడు దేవతలంతా కలసి గణపతిని ప్రార్ధించగా గణపతి వక్రతుండ అవతారం ఎత్తి సింహవాహనుడై వచ్చి ఆ రాక్షసుడిని వధించాడు. ఇదియే గణపతి మొదటి అవతారంగా చెబుతారు. వక్రతుండుడు అనగా విఘ్నములని ముక్కలుగా చేసేవాడని అర్ధం. అప్పటినుండి గణపతి వక్రతుండ గణపతిగా పూజలను అందుకుంటున్నాడు.

ఏకదంతావతారం:

పూర్వం మదాసురుడనే రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు కొన్ని సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి ఎన్నో శక్తులని సంపాదించగా ఒక రాక్షసుడికి ఇన్ని శక్తులు ఉండటం చూసి దేవతలంతా కూడా భయపడిపోయారు. ఇక ఆ సమయంలో దేవతలంతా కూడా గణేషుడిని ప్రార్ధించగా ఏకదంతుడి అవతారాన్ని ఎత్తి ఆ రాక్షసుడిని ఎదుర్కొంటాడు. మదాసురుడు అంటే గర్వానికి చిహ్నం. సృష్టి యావత్తు కూడా ఒక్కటే అని చెప్పడం కోసమే ఈ ఏకదంతా అవతారం.

మహోదర అవతారం:

పూర్వం మోహనసురుడు అనే రాక్షసుడు సూర్యభగవానుడిని అనునిత్యం ఆరాధించి ముల్లోకాలను జయించాడు. అప్పుడు దేవతలు గణపతిని ఆరాదించగా గణపతి ఈ అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని ఎదురిస్తాడు.

గజాననుడు:

పూర్వం లోభాసురుడు అనే రాక్షసుడు శివునికై ఘోర తపస్సు చేసి వరాలను పొంది ముల్లోకాలను ఎదిరించి చివరకు కైలాసాన్ని కూడా వశ పరుచుకోవాలని భావించగా, అప్పుడు దేవతలు అందరు గణపతిని ప్రార్ధించగా అయన గజాననుడుగా అవతారాన్ని ఎత్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. గజాననుడు అనగా ఏనుగు ముఖం కలవాడని అర్ధం.

లంబోదరుడు:

దేవతలు రాక్షసులు కలసి సాగరాన్ని మధించినప్పుడు అమృతం దక్కింది. అయితే అమృతం రాక్షసులకు దక్కకుండా చేసేందుకు శ్రీమహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించగా ఆ రూపాన్ని చూసి శివుడికి మనసు చలించినదట, అప్పుడు నిజ రూపంలో వచ్చిన శ్రీమహావిష్ణువు చూసి శివుడి కోపం నుండి క్రోధసురుడు అనే రాక్షసుడూ ఉధ్భవించాడట. అలా జన్మించిన క్రోధసురుడు సూర్యుడి అనుగ్రముతో మహాబలవంతుడయ్యాడు. అప్పుడు అతడిని సంహరించేందుకు గణపతి లంబోధరుడిగా అవతారం ఎత్తి సంహరించాడని పురాణం.

వికటుడు:

పూర్వం కామాసురుడు అనే రాక్షసుడిని అంతం చేసేందుకు గణపతి వికటావతారం ఎత్తాడు. ఈ అవతారంలో వినాయకుడు మయూర వాహనం పైన దర్శనమిస్తాడు.

విఘ్నరాజావతారం:

శబరుడు అనే రాక్షసుడిని అంతం చేసేందుకు గణపతి విఘ్నరాజావతారం ఎత్తాడు. ఈ అవతారంలో గణపతి పాముని అంటే ఆదిశేషుని వాహనంగా చేసుకున్నాడు.

ధూమ్రవర్ణుడు:

అహంకారానికి సూచిక అహంకారేశ్వరుడు అనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అనే అర్ధం వస్తుంది. దీనికి ఒక ఆకారం అనేది ఉండదు. మనిషి తాను అనే అహంకారాన్ని విడిచి భగవంతుడితో ఐక్యం కావాలనే సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం అని చెబుతారు.

Exit mobile version