Home Unknown facts త్రిశంక స్వర్గం ఎలా సృష్టించబడిందో తెలుసా ?

త్రిశంక స్వర్గం ఎలా సృష్టించబడిందో తెలుసా ?

0

ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడు అనే మహారాజుకు ఒక విచిత్రమైన ఆలోచన కలుగుతుంది. తన పూర్వ వంశీయుల వలె కాక, తాను సశరీరంగా స్వర్గానికి చేరుకోవాలి అనే కోరిక పుడుతుంది.

కులగురువులైన వశిష్ఠుడికి తన కోరిక విన్నవిస్తాడు. బొందితో స్వర్గానికి వెళ్ళడానికి తనచేత ఏదైనా యాగం చేయించుమని కోరగా అది కుదరని పని, ధర్మశాస్త్ర విరుద్దమని వశిష్ఠుడు వారిస్తాడు. అంతట వశిష్ఠుని నూరుగురు కొడుకుల వద్దకు వెళ్ళి తన ఇష్టాన్ని ప్రకటిస్తాడు. సశరీరంగా స్వర్గానికి వెళ్ళడం కూడని పని అని వశిష్టుని కుమారులు కూడా బోధిస్తారు. మీ వల్ల ఆ కార్యం కాకపోతే నేను వేరే గురువుని చూసుకొంటాను అని త్రిశంకుడు వశిష్ఠుడి కుమారులతో అంటాడు.

Trishankaఆ మాట విన్న వశిష్ఠకుమారులు కోపించి ఛండాలుడివి కమ్మని త్రిశంకుని శపిస్తారు. మరునాటి ఉదయానికి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు ఇనుప గొలుసులుగా మారిపోయి త్రిశంకుడు ఛండాలుడుగా మారిపోతాడు. ఛండాలుడిగా మారిన త్రిశంకుడు దేశదిమ్మరిలా తిరుగుతూ దక్షిణ తీరంలో తపస్సు ముగించిన విశ్వామిత్రుడి కంటపడి, తన వృత్తాంతాన్నంతా చెబుతాడు.

త్రిశంకుడి కథ విని సంతోషపడిన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు చెయ్యలేని పనిని తాను చెయ్యాలనే కోరికతో త్రిశంకుడికి అభయం ఇచ్చి, తాను యాగం నిర్వహించి త్రిశంకుడిని సశరీరంగా ఛండాలావతారంతో స్వర్గానికి పంపుతానని చెబుతాడు. విశ్వామిత్రుడు తన కుమారులను పిలిచి సమస్త భూగోళంలో ఉన్న బ్రహ్మణులను యజ్ఞానికి అహ్వానించమంటాడు.

వశిష్ఠుడి కుమారులు, మహోదయుడు అనే బ్రాహ్మణుడు యజ్ఞానికి రామన్నారని, మహోదయుడైతే క్షత్రియుడు చేయించే యజ్ఞంలో ఛండాలుడు హవిస్సులు ఇస్తే దేవతలు తీసుకోరని చెప్పాడనీ విశ్వామిత్రుని కుమారులు తండ్రికి విన్నవిస్తారు. ఇది విన్న విశ్వామిత్రుడు క్రోధావేశంతో వశిష్ఠుని నూరుగురు కుమారులను భస్మరాసి అవుతారనీ, 700 జన్మలు శవమాంసాన్ని తింటూ బ్రతుకుతారనీ, ఆ తరువాత ముష్టికులుగా పుట్టి కుక్కమాంసం తింటూ బ్రతుకుతారనీ శపిస్తాడు.

మహోదయుడు నిషాదుడిగా హీనమైన బ్రతుకు బ్రతుకుతాడని కూడా శపిస్తాడు. యాగంలో హవిస్సులు సమర్పిస్తుంటే హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రారు. అది గమనించిన విశ్వామిత్రుడు తన తపోశక్తితో త్రిశంకుడిని సశరీరంగా స్వర్గానికి పంపుతాడు. అది చూసిన ఇంద్రుడు త్రిశంకుడితో గురుపుత్రుల శాపానికి గురైన నీకు స్వర్గ ప్రవేశం లేదని, వచ్చిన దారినే పొమ్మని త్రిశంకుడిని భూలోకానికి నెట్టేస్తాడు.

అలా నెట్టి వేయబడ్డ త్రిశంకుడు తలక్రిందులుగా పడిపోతూ, విశ్వామిత్రా రక్షించు అని ఆర్తనాదం చేస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడు త్రిశంకుడిని మార్గమధ్యంలో ఆపి, బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి (స్వర్గాన్ని, నక్షత్రమండలాన్ని) చేయడం ఆరంభిస్తాడు. దీనిని గమనించిన దేవతలు విశ్వామిత్రుడితో బ్రహ్మ సృష్టికి ప్రతిసృష్టి చేయడం తగదని వారిస్తారు. వారి అభ్యర్థన మేరకు త్రిశంకు ఉండే స్వర్గాన్ని నక్షత్రమండలానికి ఆవల సృష్టించి, త్రిశంకుడు తలక్రిందులుగా ఆ త్రిశంకు స్వర్గంలో ఉండేటట్లు ఏర్పాటు చేస్తాడు.

 

Exit mobile version