Home Unknown facts హనుమంతుడు తన కుమారుడి గురించి ఎలా తెలుసుకుంటాడు

హనుమంతుడు తన కుమారుడి గురించి ఎలా తెలుసుకుంటాడు

0

హనుమంతుడు సాక్షాత్ శివుని అవతారమని శాస్త్రం చెబుతోంది. వాయు దేవుని వరంతో అంజని మరియు కేసరిక దంపతులకు జన్మించాడు. అందుకే హనుమంతుడిని పవన పుత్రుడు అని కూడా పిలుస్తారు. మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా, తలపెట్టిన పనిని పూర్తిచేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు. హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్షే అని కూడా చెబుతారు.

Hanumanవాల్మీకి రామాయణంలో హనుమంతుని వివాహం గురించి కాని, భార్య గురించి కాని ఎటువంటి ప్రస్తావన లేదు. కొన్ని పురాణాల ప్రకారం సూర్యభగవానుని కుమార్తె సువర్చల ఆంజనేయుని భార్య. అంటే సూర్యాంజనేయుల మధ్య మామా అల్లుళ్ళ సంబంధం కూడా ఉంది. పార్వతీదేవి అంశతో అయోనిజగా సువర్చల జన్మించింది. కానీ వారికి సంతానం లేదు. అందుకే హనుమంతుడిని అస్కలిత బ్రహ్మాచారి అని అంటారు.

అలాగే అందరికీ హనుమంతుడు బ్రహ్మచారిగానే తెలుసు. బ్రహ్మచారిగానే ఉండాలనుకునే వారు హనుమంతుడినే ఆదర్శంగా తీసుకుంటారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే, బ్రహ్మచర్యానికి మారుపేరైన హనుమంతుడికి పుత్రుడున్నాడా? ఈ ప్రశపై చాలా సందేహాలు ఉన్నాయి. హనుమంతుడికి కుమారుడున్నాడన్న విషయం హనుమంతుడికి కూడా యుద్దభూమికి వెళ్ళేంతవరకు తెలియదన్న విషయం ఆశ్చర్యకరమైన అంశం. యుద్ద భూమిలో ఎదురైనా శత్రువే తన కుమారుడని హనుమంతుడు తెలుసుకున్నాడు. అదెలాగో రామాయణంలోని ఒక సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. సీతామాతను వెతకడానికి రాముని దూతగా లంకకు చేరుకుంటాడు హనుమంతుడు. కానీ దూత సందేశం నచ్చని రావణాసురుడు, హనుమంతుని మాటను లెక్కచేయకపోగా… అతని తోకను నిప్పంటించమని తన సైన్యానికి ఆదేశిస్తాడు.

మరి మహావీర్ హనుమాన్ ఊరుకుంటాడా… తోకతో లంక దహానం చేస్తాడు. ఆ తర్వాత లంక నుంచి తిరిగివెళ్తూ, ఆ వేడి నుంచి ఉపశమనం లభించేందుకు సముద్రంలో కొంత సేపు మునిగి ఉండేందుకు నిశ్చయించుకుంటాడు. హనుమంతుడు నీట మునగగానే అతని శరీరం నుంచి విడివడిన స్వేద బిందువు, ఓ జల కన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన ఒక శిశువుగా మారుతుంది. ఆ విషయం హనుమంతుడు గ్రహించడు. కొన్నాళ్లకి పాతాళలోకాన్ని పాలించే రాజు మైరావణుడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది. మైరావణుడికి ఆహారంగా ఆ జలకన్యను మోసుకుపోతారు అతని భటులు. కానీ ఆమె పొట్టను కోసి చూసిన వారు ఆశ్చర్యంలో మునిగిపోతారు. జలకన్య గర్భాన శక్తిమంతమైన ఓ జీవి వారికి కనిపిస్తుంది. సగం కోతి రూపంలోనూ, మరో సగం మకరంగానూ ఉన్న ఆ జీవికి ‘మకరధ్వజురడు’ అని పేరు పెడతాడు మైరావణుడు. అతన్ని ద్వారపాలకుడిగా నియమిస్తాడు.

యుద్ధం సమయంలో రావణాసురుడు తన బంధువైన పాతాళాధిపతి మైరావణుడికి కబురు పంపాడు. రావణుడు మాయోపోయాలతో రామలక్ష్మణులను అపహరించి తన కోటలో బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న హనుమంతుడు మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలపడాల్సిన సందర్భం ఏర్పడుతుంది. మకరధ్వజుని బలపరాక్రమాలను చూసిన హనుమంతుడు నువ్వు ఎవరి కుమారుడవు అని అడుగుతాడు.

అప్పుడు తాను హనుమంతుని కుమారుడినని చెప్పడంతో ఆశ్చర్యపోతాడు. మకరధ్వజుడు తన కుమారుడన్న విషయం తెలుసుకుని హనుమంతుడు విస్మయానికి లోనవుతాడు. తాను బ్రహ్మచారని చెప్తాడు. తరువాత జరిగిన సంఘటనలన్నిటినీ ఒకసారి కళ్ళు మూసుకుని తన మనోనేత్రంతో హనుమంతుడు తెలుసుకుంటాడు. తన పుత్రుడైన మకరధ్వజుడిని హత్తుకుని ఆశీర్వాదాన్ని అందించి మైరావణుని సంహరించి రామలక్ష్మణులను విడిపిస్తాడు. మకరధ్వజుని చూసిన రాముడు, అతడిని పాతాళానికి అధిపతిగా నియమిస్తాడు.

 

Exit mobile version