కంచికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని బంగారు, వెండి బల్లులు దర్శించుకుంటే సకల పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. అయితే కంచి మాదిరిగానే కంచి కి వెళ్లలేని భక్తులు ఈ కొడకంచి ఆలయానికి వచ్చి ఇక్కడ ఉన్న బంగారు, వెండి బల్లిని తాకి పాపాలను తొలగించుకుంటున్నారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇంకా ఇక్కడి విశేషాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలో జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఆదినారాయణ స్వామి ఆలయం ఉంది. 900 ఏండ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం పునఃనిర్మాణంతో దినదినాభివృద్ధి చెందుతోంది. ఇక్కడ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు స్వామివారి సన్నిధిలో కంచి తరహాలో పూజలు నిర్వహిస్తుంటారు.
ఇక పురాణానికి వస్తే, 900 ఏళ్ల క్రితం అల్లాణి వంశస్తుడైన రామోజీరావుకు స్వామివారు కలలోకి వచ్చి మంబాపూర్ అటవీ ప్రాంతంలో తన విగ్రహం ఉందని, దాన్ని తీసుకువచ్చి పూజలు నిర్వహించాలని ఆదేశించారు. దీంతో అల్లాణి వంశస్తులతో పాటు, గ్రామ ప్రజలందరూ కలసి స్వామివారి విగ్రహం కోసం వెతికారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దాంతో మరోసారి స్వామి వారు అల్లాణి వారి కలలోకి వచ్చి తెల్లవారే లోపు మీ ఇంటిముందు గరుడ పక్షి ఉంటుందని, ఆ గరుడపక్షే వారిని తానున్న స్థానానికి తీసుకువెళ్తుందని, ఈ విగ్రహాన్ని కొడకంచి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల ఓ గుట్టపై ప్రతిష్టించాలని చెప్పారు.
గరుడపక్షి చూపిన దారిలో అటవీ ప్రాంతంలోకి వెళ్లిన అల్లాణి వంశస్తులకు స్వామివారి విగ్రహం లభించింది. ఈ విగ్రహాన్ని కొడకంచిలోని ఓ గుట్టపై ప్రతిష్టించారు. అప్పటినుంచి నేటి వరకు కంచిలో స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహిస్తారో ఇక్కడి స్వామివారికి కూడా అలాగే పూజలు నిర్వహిస్తున్నారు.
కంచిలో ఉన్న విధంగానే ఇక్కడి ఆలయం, అర్చనలు ఉంటాయి. అంతేకాదు, కొడకంచిలోని ఆదినారాయణ స్వామి ఆలయంలో కూడా బంగారు, వెండి బల్లులు ఉన్నాయి. ఈ వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే సకల పాపాలు తొలగి పోతాయని, బల్లిదోష నివారణ కూడా జరుగుతుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంది.
ఆలయం ఆవరణలో ఉన్న పొగడ చెట్టు ప్రత్యేకమైనది. ఈ చెట్టుకు పూచిన పువ్వులను మాలగా చేసి దేవునికి అలంకరిస్తారు. ఆదినారాయణస్వామి ఆలయం ఎడమ పక్కన ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో శివలింగం, త్రిఫల వృక్షాలు, నంది విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయంలోని శివలింగం రావణాసురుడు పూజ చేసిన 101 లింగాలలో ఒకటని ప్రతీతి. శివమాలలు వేసుకున్న వారికి ఈ ఆలయమే సన్నిదానం.
కంచిలో ఉన్న విధంగా ఆలయం ఆవరణలో ఉన్న కొలనులో స్నానం చేసి, దేవాలయంలోని వెండి, బంగారు బల్లులను స్పర్శిస్తే కంచికి వెళ్లినంత పుణ్యం వస్తుందని భక్తులు భావిస్తుంటారు. అందుకే కంచికి వెళ్లలేకున్నా కొడకంచికి వెళ్లాలనే నానుడి ఉంది.
ఈవిధంగా కొడకంచి లో వెలసిన ఆదినారాయణ స్వామి ఆలయం ఆ స్వామివారి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటిగా విరాజిల్లుతుంది.