మగువలు అందాన్ని కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇక ముఖారవిందానికి అతివలు ఇంటి చిట్కాలు కూడా వాడుతుంటారు. అందులో బొగ్గు కూడా ఒకటి. వంటపాత్రలు, దంతాలు తళతళా మెరవాలంటే బొగ్గు వాడతారుగాని, ముఖానికి ఎవరైనా పూసుకుంటారా సౌందర్యసాధనకు, పోషణకు కూడా కాదేదీ అనర్హం అన్నట్టు బొగ్గుతో ముఖవర్ఛస్సును పెంచుతున్నారు బ్యూటీషియన్లు.
నల్ల బంగారంగా పిలవబడే బొగ్గు, చర్మాన్ని తళతళ మెరిసిపోయేలా చేస్తుంది. బొగ్గులో విషపదార్థాలను లాక్కునే గుణం కలిగి ఉంటుంది. అందువల్ల చర్మంలోని విషపదార్థాలను బయటకు తీసివేస్తుంది. దానివల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడమే కాదు అందంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బొగ్గుతో తయారయ్యే ఫేస్ మాస్కును ఎలా తయారు చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం…
నిజానికి బొగ్గును చాలా సౌందర్యాసాధనాల్లో ఎప్పటినుంచో వాడుతున్నారు. అయినా నేరుగా ముఖానికి పూయడం మాత్రం కొత్త ట్రెండ్. బొగ్గు ప్యాకులు ఆన్ లైన్ లోనూ దొరుకుతున్నాయి. బొగ్గులోని రసాయనిక పదార్థాలు మురికిని శక్తిమంతంగా తమలోకి లాక్కుంటాయి. అందుకే టూత్ పేస్ట్ వంటి వాటిలో దాన్ని ప్రాసెస్ చేసి వాడతారు. డెబ్బీ స్కిన్‌కేర్ సెంటర్‌లో మసిపూతకు తోడు లేజర్ ట్రీట్‌మెంట్ కూడా ఉండడంతో కస్టమర్లు బాగానే వస్తున్నారట.
చర్మ రంధ్రాలను తెరుచుకునేలా చేసే బొగ్గు ఫేస్క్ మాస్కును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికి 1టేబుల్ స్పూన్ బొగ్గుపొడి
1టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి
2టేబుల్ స్పూన్ల నీళ్ళు
1/2టేబుల్ స్పూన్ తేనె
1 చుక్క మీకు ఇష్టమైన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి. ఇవన్నీ పదార్థాలను ఒక దగ్గర కలిపి మిశ్రమంగా చేయాలి. పూర్తిగా చిక్కబడ్డ మిశ్రమం మాదిరిగా అయిన తర్వాత ముఖానికి వర్తించాలి. ఆ తర్వాత ఎండిపోయేదాకా అలాగే ఉంచుకుని కాసేపయ్యాక నీళ్ళతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మిల మిల మెరిసే చర్మం కావాలనుకునే వారు, అందమైన ముఖం కోసం ఈ బొగ్గు ఫేస్ మాస్కును ఉపయోగించవచ్చు. వారానికి ఒకటి లేదా రెండు సార్లు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది.
కొంతమందికి చర్మంపై ఒక్కోసారి జిడ్డుపేరుకుపోయి ఉంటుంది. అలాంటప్పుడు చార్‌కోల్ పౌడర్‌ను తీసుకుని నీళ్లలో కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాలు అయ్యాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. ఇలా పదిరోజులకు ఓసారి చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. చర్మంపై పడిన గుంతలు తగ్గుతాయి. ఒక్కోసారి తెగిన, కాలిన గాయాలు…మానిపోయినా మచ్చలు మాత్రం అలానే ఉండిపోతాయి. అలాంటప్పుడు రెండు చెంచాల చార్‌కోల్ పౌడర్, చెంచా తేనె, కాసిన్ని నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసుకోండి. దీన్ని మచ్చపై రాయండి.ఇలా కొన్ని రోజులు చేస్తే మీ సమస్య దూరమవుతుంది. బొగ్గును వాడడం వలన చర్మం నుండి ఎక్కువగా ఉత్పత్తి అయ్యే నూనెలు తగ్గడంతో పాటు సహజ నూనెలు కోల్పోకుండా ఉంటుంది.
జుట్టు ఒత్తుగా పెరిగేందుకు.. తలసాన్నానికి ముందు షాంపూలో కొద్దిగా చార్‌కోల్ మిశ్రమాన్ని కలపండి.. లేదా మార్కెట్‌లో దొరికే చార్‌కోల్ షాంపూని మీ జుట్టుకు పట్టించి రెండు నిమిషాల పాటు ఉంచి గోరువెచ్చటి నీటితో శుభ్రపరచండి. చార్‌కోల్‌లో ఉండే కార్బన్ మీ జుట్టుకి దృఢత్వానిచ్చి రాలకుండా చేస్తుంది. ఊళ్లలో మన అమ్మమ్మలు, నానమ్మలు అయితే చాలావరకు బొగ్గుతోనే తోముకునేవాళ్లు.. మన అమ్మలు కూడా చిన్నతనంలో పళ్లు తోముకోవడానికి బొగ్గునే ఉపయోగించేవారు.. కానీ కాలం మారింది. మార్కెట్‌లోకి రకరకాల బ్రష్‌లు, పేస్టులు అందుబాటులోకి వచ్చాయి. జనాలు కూడా వాటికే అలవాటు పడిపోయారు. కాలక్రమేణా బొగ్గును వాడటం పూర్తిగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు మార్కెట్‌లోకి మళ్లీ బొగ్గు ఉత్పత్తులు వస్తున్నాయి. చార్కోల్ బ్రాండ్‌తో మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. పళ్ళు పచ్చగా ఉన్నవారు కాస్త బొగ్గు పొడి తీసుకుని, దానిలో తగినంత వంటసోడా కలిపి ఈ పొడితో వారానికోసారి పళ్ళు తోముకుంటే…పళ్ళు ముత్యాల్లా మెరుస్తాయి అంటున్నారు. కేవలం పేస్టులు మాత్రమే కాదు.. దిండ్లు, ఎయిర్ ప్యూరిఫయిర్లుగా దొరుకుతున్నాయి. అంతేకాదు మనం తినే ఐస్‌క్రీంలు, బర్గర్‌లు, కాఫీలల్లోనూ బొగ్గును వాడేస్తున్నారు.