పండ్లు తినడం వల్ల శరీరానికి కావాల్సిన అన్నీ రకాల విటమిన్లు, మినరల్స్ లభిస్తాయని, కాబట్టి తరుచూ పండ్లు తింటూ ఉండాలని వైద్యులు చెబుతుంటారు. అయితే అన్నీ పండ్లు తింటే వచ్చే విటమిన్లు, మినరల్స్ అన్నీ ఒకే పండులో దొరుకుతాయంటే అంతకంటే కావాల్సిందేముంటుంది. ఆ పోషకాలన్నిటి సమాహారమే డ్రాగన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్ తింటే ఆరోగ్యం మన వెంటే అని ఒక్క మాటలో చెప్పవచ్చు. దక్షిణ అమెరికాలో పుట్టిన ఈ పండు ఇప్పుడు ప్రతి పట్టణంలోనూ, ప్రతి నగరంలోనూ లభిస్తోంది.
దీనిని సూపర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తుంటారు. అయితే డ్రాగన్ అనగానే మనకు చైనాకి చెందిన జంతువు గుర్తుకొస్తుంది. డ్రాగన్ అనేది చైనాలో పవిత్రమైన జంతువు. అది తన నోటి ద్వారా అగ్నిజ్వాలలు రగిలిస్తూ… శత్రువుల్ని సంహరిస్తుందనీ, అలాంటి డ్రాగన్స్ ఇప్పటికీ ఉన్నాయని చైనీయులు నమ్ముతారు. మరి ఆ విచిత్రమైన పేరు ఈ పండుకి ఎందుకు పెట్టారంటే… వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల వల్లే. డ్రాగన్ ఫ్రూట్ గులాబీ రంగులో ఉంటుంది. లోపల తెల్లటి గుజ్జు.. అందులో నల్లటి విత్తనాలు ఉంటాయి.
గులాబీ రంగులో ఉండే ఈ పండుకి చుట్టూ ఉన్న రేకులు పసుపు, పచ్చ రంగులో ఉంటాయి. వీటి ఆకర్షణీయమైన రంగు, రూపురేఖల కారణంగా ఎన్ని పండ్లు ఉన్న డ్రాగన్ పండ్లను సులభంగా గుర్తు పట్టవచ్చు. ఈ డ్రాగన్ ఫలంలో కేలరీలు తక్కువగా, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. పీచు పదార్థం కూడా అధికంగానే ఉంటుంది. ఐరన్, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, మెగ్నీషియం, విటమిన్ సి, విటమిన్ ఇ, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ తదితర విలువైన పోషకాలు లభిస్తాయి. డ్రాగన్ ఫ్రూట్ ఖరీదు కొంచెం ఎక్కువే అయినా దానికి తగ్గట్లే శరీరానికి శక్తినిచ్చే న్యూట్రియెంట్స్ లభిస్తాయి. అందుకే ఈ పండు తినడం ఎంతో మేలు ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఈ పండులో విటమిన్ B, ఫోలేట్ మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గర్భిణీ స్త్రీలకు అవసరమైన పండుగా పనిచేస్తుంది. B విటమిన్లు మరియు ఫోలెట్లు పుట్టబోయే బిడ్డలకు జన లోపాలను నిరోధించడంలో సహాయపడుతుంది మరియు గర్భధారణ సమయంలో గర్భిణీలకు శక్తినిస్తాయి. దీనిలో ఉన్న కాల్షియం శాతం పిండం యొక్క ఎముక అభివృద్ధికి బాధ్యత వహిస్తుంది. ఇందులో ఉన్న మెగ్నీషియం మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన సంక్లిష్టతలతో పోరాడటానికి సహాయపడుతుంది.
ఒత్తిడి, కాలుష్యం మరియు పోషక ఆహారం సరిగ్గా తినకపోవడం వంటి ఇతర కారకాల వల్ల తొందరగా చర్మం ముసలితనాన్ని సంతరించుకుంటుంది. అయితే, ఇది సన్ బర్న్, పొడి చర్మం మరియు మొటిమలకు చికిత్స చేయగల గొప్ప యాంటీఆక్సిడెంట్ల కలిగి ఉంటుంది. ఇందులోని విటమిన్ సి కంటెంట్ చర్మాన్ని ప్రకాశవంతంగా చేయడానికి సహాయపడతాయి. డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ తయారు చేసి, రేడియంట్ స్కిన్ కోసం రోజుకు ఒకసారి తాగవచ్చు.
ప్రతి రోజుకి ఒకసారి ఒక గ్లాసు పాలలో డ్రాగన్ పండు పొడిని కలుపుకొని తీసుకుంటే జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఈ పొడిలో లభించే సారం, జుట్టు కలరింగ్ చేసుకోవడం వల్ల జరిగే నష్టాలు తగ్గిస్తుంది మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. తద్వారా ఇది మన జుట్టును మృదువుగా మెరిసేలా చేస్తుంది.
అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ తో ఫేస్ ప్యాక్ కూడా చేసుకొని వాడొచ్చు. ఫేస్ పేక్ కోసం తినే డ్రాగన్ ఫ్రూట్ యొక్క తోలు తీసుకోవాలి. దానిపైన ఉండే మురికిని శుభ్రంగా కడిగి, పైన కొంచం బొడిపెలు తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కోసి పాలతో మెత్తటి ఫేస్ట్ చేసుకోవాలి. ఈ ఫేస్ట్ మంచి పింక్ కలర్లో ఉంటుంది. దీనిని ముఖానికి కింద నుంచి పైకి ప్యాక్ లా మందంగా వేసుకోవాలి. ప్యాక్ ఆరేంతవరకూ ఉండి మామూలు చల్లని నీళ్ళతో కడిగేయాలి. దీనివలన స్కిన్ టైట్ అయి ముడతలు తగ్గుతాయి.
ఫేషియల్ అయిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయడం వలన అప్పటి వరకూ చర్మం కోల్పోయిన తేమ తిరిగి అందుతుంది. మొత్తం ఈ ఫేషియల్ వలన చర్మంపై మురికి తొలగి మంచి నిగారింపు సొంతం చేసుకుంటుంది. మృదువుగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా శ్రద్ధ తీసుకోవడం వలన చర్మం ఆరోగ్యంగా మారుతుంది.