Home Unknown facts వింత ఆచారాలను పాటించే ఈ ఆలయం గురించి తప్పక తెలుసుకోండి

వింత ఆచారాలను పాటించే ఈ ఆలయం గురించి తప్పక తెలుసుకోండి

0

మనదేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. అక్కడి ఆచారాలను బట్టి దేవుడికి పూజలు చేస్తుంటారు. వారికి ఉన్నదాంట్లో పండో, ఫలమో నైవేద్యంగా పెడతారు. కచ్చితంగా ఇదే పెట్టాలని ఎక్కడా నియమం లేదు కదా… ఆర్తులు భక్తితో ఏది అందించినా స్వీకరించే సహృదయం దైవానిది. భక్తితో మాంసం పెట్టినా పరవశించిపోయారు శివుడు. అలాంటి ఒక సందర్భానికి ఉదాహరణగా కేరళ రాష్ట్రంలో పూజలందుకునే ముత్తప్పన్ గురించి చెప్పుకోవాల్సిందే.

Sree Muthappan Madapuraచాలావరకు మనదేశంలో ఉన్న భక్తులంతా శివున్నో లేదా విష్ణువునో ఆరాధిస్తారు. పరమశివుని పూజించేవాళ్ళని శైవులని, విష్ణుమూర్తిని కొలిచేవారిని వైష్ణవులని అంటారు. గ్రామీణదేవతలు సైతం అటు శైవ అంశంగానో, ఇటు విష్ణు స్వరూపంగానో ఆరాధింపబడతారు. ఆలయాల్లో విగ్రహాలు కూడా అలాగే ప్రతిష్టిస్తుంటారు. కానీ ముత్తప్పన్ మాత్రం ఇద్దరు దేవుళ్ళకు ప్రతీకగా శివకేశవుల ప్రతిరూపంగా భావిస్తుంటారు. ముత్తప్పన్ ఆకారంలో ఉండే చిన్న పాటి మార్పుని బట్టి వలియ ముత్తప్పన్గానో అంటే విష్ణువు చెరియ ముత్తప్పన్గానో అంటే శివుడు కొలుచుకుంటారు.

ఈ ముత్తప్పన్ దేవాలయాన్ని “పరస్సి నికడవు ముత్తప్పన్ దేవాలయం” అని కూడా పిలుస్తారు. దేవాలయం యొక్క ప్రధాన ఆదిదేవత శ్రీ ముత్తప్పన్. కేరళలో ఉన్న ఈ విభిన్నమైన ఆలయంలో దేవునికి మద్యాన్ని, చేప, మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారట. మిగతా ఆలయాల్లో మాదిరి ఈ దేవాలయంలో బ్రాహ్మణ విధి విధానాన్ని అనుసరించరు. దానికి బదులుగా ఇక్కడ మాంసం, చేపలు మరియు మద్యాన్ని నైవేద్యంగా స్వామికి పెట్టి పూజిస్తారు.ఇంకొక విచిత్రం ఏమంటే ఇక్కడ ఎలాంటి జాతి వారైనా, ఎలాంటి మతం వారైనా కూడా ప్రవేశించవచ్చును. దాన్లో కుక్కలను కూడా ప్రవేశింపచేస్తారంటే మీరు నిజంగా నమ్ముతున్నారా? సాధారణంగా గుడి ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే చాలు… అవతలకి తోలేస్తూ ఉంటారు. కానీ ముత్తప్పన్ కు కుక్కలంటే మహా ప్రీతి అంటారు. అందుకనే అక్కడ ఆలయంలో గుంపులు గుంపులుగా కుక్కలు కనిపిస్తూ ఉంటాయి. ఆలయ ద్వారానికి ఇరువైపులా కూడా కుక్కల విగ్రహాలు ఉంటాయి. ఆలయంలో స్వామివారికి నైవేద్యం అర్పించిన తర్వాత దాన్ని తొలి ప్రసాదంగా కుక్కలకే అందిస్తారట.

కేరళలో పూజలందుకుంటున్న ఈ ముత్తప్పన్ జన్మవృత్తాంతం కాస్త విచిత్రంగా ఉంటుంది. పూర్వం సదాచార సంపన్నులైన అయ్యంకర వళువనార్, పడికుట్టి అనే దంపతులు ఉండేవారు. వారికి ఎంతకాలమైనా సంతానం కలగదు. సంతానం కోసం వారు చేయని పూజా లేదు. తమకు ఒక్క బిడ్డని ప్రసాదించమని పడికుట్టి నిత్యం ఆ పరమేశ్వరుని ప్రార్థించేదట. ఆమె ప్రార్థనలు విన్న మహాదేవుడు త్వరలోనే ఆమెకు సంతాన ప్రాప్తి కలుగుతుందని ఆశీర్వదించారు. ఆ మరుసటి రోజు పడికుట్టి నదికి వెళ్లి వస్తుండగా ఆమెకు పూలపాన్పు మీద ఒక బిడ్డ కనిపించాడు. ఆ బిడ్డని, సాక్షాత్తు పరమేశ్వరుని వరప్రసాదంగా భావించిన పడికుట్టి దంపతులు అతనికి ముత్తుప్పన్ అని పేరు పెట్టి పెంచుకోసాగారు.

అలా ఆ దంపతుల ప్రేమతో పెరిగి పెద్దవాడవుతున్న ఆ బాబుకి వేట అంటే మహా సరదాగా ఉండేది. సమీపంలో ఉండే అడవికి వెళ్లి అక్కడ జంతువులను వేటాడి వాటి చర్మాన్ని ధరిస్తుండేవాడు. అడివిలో ఉండేవారితోనే సహవాసం చేసేవాడు. వారి కోసమని ఆహారాన్ని తీసుకువెళ్లేవాడు. అయితే సంప్రదాయ కుటుంబానికి చెందిన పడికుట్టి దంపతులకు ముత్తప్పన్ తీరు నచ్చలేదు. ముత్తప్పన్ స్వభావానికి కోపగించుకున్న తండ్రి ఓసారి అతన్ని తీవ్రంగా మందలించబోగా తాను సామాన్య మానవుడిని కాదంటూ ముత్తప్పన్ విశ్వరూపాన్ని చూపించి ఆ ఊరి నుంచి వెళ్ళిపోయాడు.

అలా ఇల్లు వదిలి వెళ్ళిన ముత్తప్పన్ వెళుతూ వెళుతూ చెట్టు నుండి కల్లు దింపుతున్న చెంతన్ అనే వాడిని కల్లు పోయమని అడిగితె ఆటను నిరాకరించాడట. దానితో ముత్తప్పన్ కోపానికి అతను రాయిల మారాడట. చెంతన్ భార్య వచ్చి వేడుకోవటంతో కరుణించి మరలా మాములు రూపాన్ని ప్రసాదించాడట. ముత్తపన్ తన స్పర్శతో ఎన్నో రోగాలని నయం చేసేవాడట. ఎవరేది కోరుకుంటే వారికీ అది లభించేదిట. ఇలా అక్కడి ప్రజల పాలిట ప్రత్యక్ష దైవంగా పూజలందుకున్నాడట ముత్తపన్.

పురాణాల ప్రకారం, ఒక కుక్క ఎల్లప్పుడూ తన ప్రయాణంలో ముత్తప్పన్ ను అనుసరిస్తుంది. అందువలన ముత్తప్పన్ దేవాలయంలో కుక్కను దైవసమానంగా పరిగణిస్తారు. ఇప్పటికి ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర కుక్క విగ్రహం ఉంటుందిట. ఆలయంలో కూడా కుక్కలు తిరుగుతూ ఉంటాయి గాని ఎవరిని ఏమి అనవు. ఆలయానికి వచ్చే భక్తులు వీటికి తినుబండారాలు వేస్తారు.

Exit mobile version