Home Unknown facts ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

0

మన దేశంలో విష్ణు దేవాలయాలు కోకొల్లలు. ప్రతి ఊర్లో రాముడిదో, కృష్ణుడిదో, నరసింహ స్వామిదో గుడి దర్శనం ఇస్తూనే ఉంటుంది. ఆ దేవాలయాల్లో ‘వేం పంచ హరి’ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ క్షేత్రం కూడా ఒకటి. ఈ ఆలయంలోని హరి భక్తులు కోరిన కోరికలు తీర్చే హరిగా పిలవబడతాడు. కాలక్రమంలో దీని పేరు వేపంజరిగా ప్రసిద్ధి గాంచింది. ఈ క్షేత్రానికి ‘వేం పంచ హరి’ అని పేరు అసలు ఎలా వచ్చింది అంటే’వేం’ అనగా పాపమని, ‘పంచ’ అనగా ఐదు, ‘హరి’ అంటే హరించమనే అర్థం వస్తుంది. అసలు ఈ క్షేత్రం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలోనూ, చిత్తూరుకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Sri Lakshminarayana Swamyఆలయానికి ఈశాన్య దిశలో స్వామివారి దశావతార పుష్కరిణి వుంది. ఈ పుష్కరిణిలో స్వామి వారి కృష్ణ లీలలను తెలియజేసే కాళీయమర్దన రూపంలో ఉండగా, దశావతార విగ్రహం పలువురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఒక్కో యుగంలో శ్రీమహావిష్ణువు పాపాత్ములను సంహరించడానికి దశావతారాలు ఎత్తాడని లోకవిదితమే. అయితే ఏ విష్ణు ఆలయంలో చూసినా, దశావతారాలు విడివిడిగా కనిపిస్తాయి. ఇక్కడ మాత్రం స్వామి వారి దశావతారాలు ఒకే విగ్రహంలో ఇమిడి వుండి 21 అడుగుల దశావతార విగ్రహం అద్భుతమయిన రూపంలో కనిపిస్తుంది.

అంతేకాక స్వామి వారి నాభి భాగంలో బ్రహ్మదేవుడు. వక్షస్థల భాగంలో శివుని రూపం కలిగి ఉంటారు. ఫలితంగా త్రిమూర్తులందరిని ఒకేచోట దర్శించుకునే అవకాశం భక్తజనులకు కలుగుతుంది. ఈ ఆలయానికి దగ్గరలో దేవతల వైద్యుడైన ధన్వంతరి ఆలయం వుంది. ఇక్కడకు వచ్చిన భక్తులు వారి అనారోగ్యాన్ని గురించి ధన్వంతరి దేవుని ముందు పెట్టుకుని, మంత్రాన్ని జపించి అందుకు తగిన ఫలితాన్ని పొందుతుంటారు.

ఇక్కడి నక్షత్ర వనంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు తమ దేవేరులైన సరస్వతి, లక్ష్మి, పార్వతీ సమేతంగా కొలువై వుంటారు. అంతేకాక 27 నక్షత్రాలకు సంకేతంగా 27 వృక్షాలున్నాయి. అంతేకాక పుష్కరిణికి ఉత్తరదిశలో శ్రీవిద్య వినాయక విగ్రహం కూడా వుంది. దీని దగ్గర్లో 18 మెట్లతో అయ్యప్పస్వామి విగ్రహం వుంది. గంగమ్మ, భక్త ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు కూడా వుండటం విశేషం. శబరిమలైని తలపించే విధంగా స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఇంకా ఈ క్షేత్రంలో 33 అడుగుల ఎత్తుతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి వారి విగ్రహం చూపరులను ఆకట్టుకుంటుంది.

స్థల పురాణానికి వస్తే చోళవంశానికి చెందిన మూడవ కుళోత్తుంగ రాజువారి పరిపాలనలో తొండ మండల గ్రామంలో క్రీ.శ. 12వ శతాబ్దంలో శ్రీలక్ష్మీనారాయణ స్వామి స్వయంగా వెలిసాడని చరిత్ర చెపుతుంది. ఓ వైష్ణవ భక్తుని కలలో గోచరించిన శ్రీమన్నారాయణుడు, కుళోత్తుంగ చోళుడు పరిపాలిస్తున్న సమయంలో తాను సమీపంలోని ఒక పుట్టలో ఉన్నట్లుగా తెలిపాడు. అయితే ఆ భక్తుడు వెంటనే తన కలలో కనిపించిన దృశ్యాన్ని రాజుకు వివరించాడు. దీంతో రాజు రాజ్యంలోని ప్రజల సమేతంగా స్వామి ఉన్న పుట్టకోసం వెతకడం ప్రారంభించాడు. అలా వెతకగా వెతకగా ఓ చిట్టడవిలో ఓ పుట్ట కనిపించింది. దాన్ని తొలగించగా, స్వామివారు, అమ్మవారిని తన తొడపై కూర్చోబెట్టుకున్న భంగిమలో శ్రీలక్ష్మీనారాయణుల వారి శిలాప్రతిమ దర్శనమిచ్చింది.

వెంటనే ఆ విగ్రహాన్ని ఓ పద్మపీఠంపై ప్రతిష్టింపజేసిన రాజావారు ఓ అద్భుతమైన ఆలయాన్ని కట్టించాడు. ఆ విధంగా మూడవ కుళోత్తుంగ నిర్మించిన ఆలయం నిత్య పూజలతో, ఉత్సవాలతో కళకళలాడింది. ఆ తరువాత ఆలయాన్ని పట్టించుకునే వారే కరువవ్వడంతో శత్రువుల దండయాత్రలకు, ప్రకృతి బీభత్సాలకు ధ్వంసమయ్యే స్థితికి చేరుకుంది. ఆ తరువాత ఆ ప్రాంతంలో వర్షాలు లేక పంటలు లేక అనావృష్టి తాండవించి, కరువు కరాళ నృత్యం చేయసాగింది. ఆ తరువాత గ్రామస్తులంతా తమ ప్రాంతానికే ఎందుకీ దురావస్థ అని ఆలోచించారు.

ఆ పరమత్ముడు శ్రీలక్ష్మీనారాయణ స్వామికి నిత్య పూజలు జరుగక పోవడమే క్షామానికి కారణమని గ్రహించారు. అప్పటి నుంచి ఆలయంలో నిత్య పూజలు మొదలయ్యాయి. దాంతో ఆ ప్రాంతమంతా అప్పటి నుంచి పైరులతో కళకళలాడటం ప్రారంభించింది. ఈ స్వామి వారి విగ్రహం సుమారు క్రీ.శ. 1178-1218 కాలం నాటిది. స్వయంగా స్వామి, అమ్మవారితో కలిసి భక్తుల కోరికలను తీరుస్తూ వుంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ మనోహర రూపాన్ని దర్శించుకోడానికి రెండు కళ్లు చాలవంటే అతిశయోక్తి కాదు. వేపంజరి గ్రామంలో ప్రధానమైంది అష్టలక్ష్మీ ఆలయం. మన రాష్ట్రంలోనే ప్రముఖ స్థానాన్ని సంపాందించుక్ను ఈ ఆలయంలో శ్రీవారు కుబేరలక్ష్మీతో మధ్యస్థంగా వుండగా చుట్టూ అష్టలక్ష్ములు కొలువై ఉన్నట్టుగా విగ్రహాలు వున్నాయి.

Exit mobile version