సర్వం శివం.. త్రికూటేశ్వరం
కాకులు కనిపించని కొండ…
శివుడు దక్షిణామూర్తిగా కొలువైన ఈ కొండపై కాకులు వాలకపోవడం ఇక్కడి ప్రధాన విశేషం. కాకులు దూరని కారడవి అని విన్నాం.. కానీ కాకులు వాలని కొండ ఏంటి అనుకుంటున్నారా? అవునండి.. కోటప్పకొండపై కాకులు వాలవు. మనం కొండ ఎక్కేటప్పుడు దారిలో ఒకటి, రెండూ కనిపించినా.. కొండపైన మాత్రం కాకుల జాడ కనిపించదు. అసలు ఈ కాకులు కొండపై ఎందుకు వాలవు..? అసలు ఏంటీ కథ..? తెలుసుకోవాలంటే ముందు మనం ఆలయ పురాణగాథ తెలుసుకోవాలి.
ఆలయ పురాణ గాథ…
* గర్భంతో ఉన్న ఆనందవల్లి ఒకరోజు పరమేశ్వరున్ని ఓ కోరిక కోరుతుంది. తాను కొండ ఎక్కలేకపోతున్నాని, నీవే దిగి రావాలని. ఇది విన్న శివుడు సరే అని ఒప్పుకుని ఒక షరతు పెడతాడు. అదేంటంటే.. నీవు ఇంటికి తిరిగి వెళ్లే సమయంలో మాత్రం ఏం జరిగినా వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని అంటాడు. కానీ, ఓ రోజు ఆనందవల్లి పూజ చేసి వెళ్తున్న సమయంలో పెద్ద పెద్ద శబ్దాలు రావడంతో వెనక్కి తిరిగి చూస్తుంది. దీంతో శివుడు అక్కడే జంగందేవరకొండపై ఉన్న గుహలో శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేటి కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న ఆనందవల్లి దేవుడిలో ఐక్యమైపోతుంది. మనం ఆనందవల్లి గుడిని ఇక్కడే కొండ కింది భాగంలో చూడొచ్చు.
మరికొన్ని ఆలయ విశిష్టతలు…
* పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదొక్కటే.
* ఇక్కడ మహాశివుణ్ణి పూజిస్తే జాతకంలో గురుబలం పెరుగుతుందని చెబుతారు. గురుబలం కారణంగా ఇతర గ్రహాల ప్రభావం ఆ మనిషిపై పడకుండా రక్షణ పొందుతాడని నమ్మకం. అందుకే గురుగ్రహం అనుగ్రహం పొందాలంటే కోటప్పకొండ వెళ్లి త్రికూటేశ్వరున్ని సేవించాలని అంటారు.
* శివరాత్రికి వివిధ గ్రామాల నుంచి ప్రభలను తీసుకురావడం ఇక్కడ ఆనవాయితీ. నలభై అడుగుల నుంచి వంద అడుగుల వరకు విద్యుత్ దీపాల అలంకరణతో ఏర్పాటు చేసేవే ప్రభలు. వాటిని ఊరేగింపుగా ఆలయం వద్దకు తీసుకువచ్చి.. ఓ ఖాళీ ప్రదేశంలో ఉంచి శివరాత్రి రోజు వాటి ముందు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
* ప్రధాన ఆలయానికి కుడివైపు వెనక భాగంలో పరమశివుడి సుపుత్రుడైన విఘ్నేశ్వరుడి పెద్ద విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది.
ఇవండీ.. మహా శివుడు దక్షిణామూర్తిగా కొలువై ఉన్న కోటప్పకొండ ఆలయ విశేషాలు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయాన్ని సందర్శించారా..? అయితే.. మీ అనుభూతులను కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. ఇప్పటివరకు వెళ్లనివారు ఎవరైనా ఉంటే వీలు చూసుకుని దర్శించుకుని రండి.. ఆ పరమశివుని కటాక్షం పొందండి.
అందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు..