ఉదయం పూట రాజులా పుష్టిగా తినాలి, మధ్యాహ్నం పూట మంత్రిలా ఆలోచించి తినాలి, రాత్రిపూట బంటులా కొద్దిగా తినాలి అని చెబుతుంటారు పెద్దలు. ఉదయం పూట ఎక్కువగా తినడం, నిద్రపోవడానికి చాలాసేపటి ముందే భోజనాన్ని ముగించడం ద్వారా ఆరోగ్యంపై సానుకూల ప్రభావం పడుతుందని చాలామంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సాధారణంగా మన అలవాట్లకు తగ్గట్లే మన జీవ గడియారంకు కూడా ఉంటుంది.రోజూ దాదాపు ఒకే సమయానికి నిద్ర లేవడం, నిద్ర రావడం లాంటివన్నీ బాడీ క్లాక్ పనిలో భాగమే. ఆ సమయానికి రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల స్థాయుల లాంటివాటిని నియంత్రించడం ద్వారా శరీరంలో ఏ క్రియ చోటు చేసుకోవాలనే సూచనలను బాడీ క్లాక్ అందిస్తుంది. క్రమం తప్పకుండా ఒకే పనిని ఒకే సమయానికి చేయడం ద్వారా మన జీవ గడియారం ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని దానికి తగ్గట్లే స్పందిస్తుంది.
నిద్ర మాదిరిగానే భోజన వేళలు కూడా జీవ గడియారాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే రాత్రి పూట ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకోకపోవడం మంచిది. అప్పటికే నిద్రకు సమయం ఆసన్నమైందనే సందేశాన్ని జీవగడియారం శరీరానికి అందించి ఉంటుంది. దాంతో జీవక్రియల వేగం తగ్గిపోతుంది. ఫలితంగా అరుగుదల కూడా మందగిస్తుంది.ఏ వ్యక్తికైనా కంటినిండా నిద్ర తప్పనిసరి. సరిగా నిద్ర లేనట్లయితే చేసే పనిపైన ధ్యాస ఉండదు.
రాత్రిపూట సరైన సమయానికి తినడం సరైన ఆహరం సరైన మోతాదులో తినడం అంతే ముఖ్యం. అందుకే రాత్రి పూట నిద్ర పోయేముందు నిద్రాభంగం కలిగించే కొన్ని రకాల ఆహారపదార్థాలను తినకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. డార్క్ చాక్లెట్లలో ఉండే మెగ్నీషియం, యాంటియాక్సిడెంట్స్ తోపాటు కెఫీన్ అనే పదార్థం ఉంటుంది. దీనివల్ల నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. అందువల్ల నిద్రపోయే ముందు డార్క్ చాక్లెట్లు తినొద్దని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి వేళ్లలో పండ్లు తినడం మంచిది కాదు. పండ్లలో ఉండే యాసిడ్లు గాస్ట్రిక్ సమస్యలకు దారితీయొచ్చు. యాపిల్ ఆరోగ్యానికి మంచిదే. కానీ, రాత్రివేళల్లో తింటే కడుపులో యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. భోజనం తర్వాత అరటి పండు తినడం మంచిదే. కానీ, రాత్రి వేళ్లలో తీసుకోవద్దు. దీనివల్ల ఊపిరితీత్తుల్లో శ్లేష్మం ఏర్పరుస్తుంది. సిట్రస్ స్థాయిలు ఎక్కువగా ఉండే నారింజ, ద్రాక్ష, పైనాపిల్ పండ్లను తినకూడదు. వీటిని ఖాళీ కడుపున అస్సలు తినొద్దు. టమోటా సాస్‌లు, చీజ్‌లు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తాయి.
పిజ్జా, బర్గర్ వంటి స్పైసీ ఆహారాన్ని అస్సలు తినొద్దు. ఇది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. బట్టర్, క్రీమ్, సాస్ లు పడుకునే ముందు తీసుకుంటే సరిగా నిద్ర పట్టదని, వాటికి రాత్రి సమయంలో వీలైనంత దూరంగా ఉండాలని అంటున్నారు. ఇక రాత్రి పూట పెరుగు తినకపోవడమే మంచిది. జలుబు, దగ్గు, అలర్జీ సమస్యలు ఉన్నారు పెరుగుకు దూరంగా ఉండాలి. రాత్రి వేళ పెరుగుతో భోజనం చేస్తే శ్లేష్మం ఏర్పడుతుంది. రాత్రి భోజనం తర్వాత స్వీట్లు తినకండి. రక్త ప్రసరణపై ఒత్తిడి పెరుగుతుంది.
రాత్రి వేళల్లో మాంసాహారానికి దూరంగా ఉండండి. మాంసంలో ఉండే అధిక ప్రోటీన్స్, కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణం కావు. కారంతోపాటు స్పైసీ గా ఉండే ఏ ఆహార పదార్థాలు అయినా రాత్రి పూట తిన్నట్లయితే నిద్రకు ఆటంకం కలిగే అవకాశం ఉంటుందంటున్నారు. పిజ్జాలు, ఐస్ క్రీములు, ఎక్కువ చీజ్ ఉన్న ఆహారపదార్థాలు మరియు వరి అన్నం ఎక్కువగా తీసుకున్నా, మటన్ తోపాటు ఇతర మాంసాహార పదార్ధాలు రాత్రి వేళ తింటే అవి సరిగా జీర్ణం కాకపోవడం వల్ల సుఖ నిద్ర పట్టదంటున్నారు నిపుణులు.
అందుకే రాత్రివేళ మితాహారం తీసుకోవడం వల్ల హాయిగా నిద్రపోవచ్చని పోషకాహార నిపుణులు సూచించారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధిక స్థాయిలో ఉంటాయి. రాత్రివేళ అన్నం తిన్నట్లయితే బరువు పెరుగుతారు. రాత్రి నిద్ర సమయంలో ఆహారాన్ని తింటే కార్బోహైడ్రేట్లు వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అలాగని రాత్రి వేళ పూర్తిగా ఆహారం మానివేయడం మంచిది కాదు. కొంతైనా సరే తినాలి. లేకపోతే చక్కెర స్థాయిలు పడిపోతాయి. అన్నానికి ప్రత్యామ్నాయంగా గోదుమ లేదా జొన్న రొట్టెలు తినడం మంచిది.