ఉదయం లేవగానే టీ రుచి చూడకపోతే రోజు గడవదు అనేవారు చాలామంది ఉంటారు. రోజుకి నాలుగు నుండి ఐదు సార్లు టీ తాగేవాళ్ళు కూడా ఉంటారు. ఒత్తిడికి గురైనప్పుడు, అలసిపోయినప్పుడు, నిద్రావస్థలో ఉన్నప్పుడు, తలనొప్పి, ఇతర అనారోగ్యం బారిన పడినప్పుడు, సాధారణ పరిస్థితుల్లో ప్రతీ ఒక్కరూ టీ తాగుతారు. అయితే టీలో షుగర్ ఉండటం వల్ల శరీరానికి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. దీంతో బరువు అధికంగా పెరుగుతుంది. అయితే టీలో చక్కెరకు బదులుగా బెల్లంను చేర్చుకుంటే అధిక బరువు ముప్పు నుంచి తప్పించుకోవడంతోపాటు పలు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు.
- శీతాకాలంలో చక్కెర వాడకాన్ని తగ్గించాలని నిపుణులు చెబుతున్నారు. దీని స్థానంలో బెల్లాన్ని ఆహార పదార్థాల తయారీలో వాడటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉండటంతో పాటు, ఈ కాలంలో ఎదురయ్యే వ్యాధులు, అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. బెల్లంలో అనేక పోషక పదార్థాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. అందువల్ల చక్కెర కన్నా మనకు బెల్లమే ఎంతో ఎక్కువగా ఉపయోగపడుతుందని వైద్యులు చెబుతుంటారు. బెల్లంలో పోషకాలు ఉంటాయి కనుక అది మనకు మేలు చేస్తుంది. అందుకే శీతాకాలంలో బెల్లంతో తయారు చేసే టీని రోజూ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.
- బెల్లం టీ తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూసుకోవచ్చు. చలికాలంలో దగ్గు, జలుబు సహజంగానే వస్తుంటాయి. వీటిని నివారించేందుకు రోజూ బెల్లం టీని తాగాలి. బెల్లం టీలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల సీజనల్‌గా వచ్చే వ్యాధులు తగ్గుతాయి. మైగ్రేన్, దీర్ఘకాలిక తలనొప్పితో బాధపడేవారు ఆవు పాలలో బెల్లం కలిపి తాగితే ఉపశమనం ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఉన్నవారు క్రమం తప్పకుండా బెల్లం టీ తీసుకోవాలి.
- ఆహార పదార్థాల్లో చక్కెరకు బదులుగా బెల్లం తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బెల్లం తినడం ఇష్టం లేనివారు దాంతో టీ చేసుకొని తాగవచ్చు. శీతాకాలంలో చక్కెర తక్కువగా తీసుకుంటే అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చు. ఈ సీజన్‌లో సహజంగానే చలి ఎక్కువగా ఉంటుంది. కనుక బెల్లం టీని తాగితే చలి తీవ్రత నుంచి బయట పడవచ్చు. శరీరం వెచ్చగా ఉంటుంది.
- మలబద్దకంతో బాధపడేవారికి బెల్లం ఎంతో మేలు చేస్తుంది. టీలో బెల్లంను చేర్చడం వల్ల జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. జీర్ణ ప్రక్రియ వేగంగా జరుగుతుంది. బెల్లంలో ఉండే ఐరన్‌తో రక్తహీనత సమస్య నుంచి కూడా మనం బయట పడవచ్చు. దీంతోపాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా బాగా పెరుగుతుంది. దీంట్లో ఎక్కువ మొత్తంలో ఐరన్ ఉంటుంది. శరీరంలోని వివిధ భాగాలకు ఆక్సిజన్‌ను అందించడానికి ఐరన్ తోడ్పడుతుంది. అంతేకాకుండా బెల్లం కాలేయాన్ని శుభ్రపరిచి మలినాలను బయటకు పంపుతుంది.
-
బెల్లం టీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:
మూడు నుంచి నాలుగు టేబుల్ స్ఫూన్ల తురిమిన బెల్లం, ఒక టీస్పూన్ తేయాకు, కాస్త ఏలకుల పొడి, టీస్పూన్ సోంపు (ఆసక్తి ఉంటేనే), రెండు కప్పుల పాలు, ఒక కప్పు మంచి నీరు, అర టీస్పూన్ మిరియాల పొడి, రుచికి తగినంత అల్లం సిద్ధం చేసుకోవాలి.
-
తయారు చేసే విధానం
టీ పాన్‌లో ఒక కప్పు నీరు తీసుకొని వేడి చేయాలి. ఏలకుల పొడి, సోంపు, నల్ల మిరియాల పొడి, అల్లం, తేయాకులను వేడి నీటిలో వేసి బాగా మరగనివ్వాలి. కాసేపటి తరువాత దాంట్లో పాలు పోసి బాగా మరిగించాలి. అనంతరం దాంట్లో బెల్లం వేసి కరిగే వరకు కలపాలి. ఆ తరువాత పొయ్యి ఆపేసి, బెల్లం టీని వడకట్టుకొని తాగవచ్చు. బెల్లం వేసిన తరువాత టీని ఎక్కువ సమయం మరగనివ్వకూడదు. పాలు కలపడం వల్ల టీ విరిగిపోయే అవకాశం ఉంది.