Recalling The Greatest Movies Of K Viswanath Garu Which Are Actually A Gift To Us
ఒక సినిమా తీయడమనేది అంత ఈజీగా అయ్యే పని కాదు. దాని వెనక ఎంతో మంది కృషి ఉంటుంది.. రాత్రీపగలు కష్టపడితే తప్ప అనుకున్నది అనుకున్నట్లు పూర్తి అవ్వదు. అదే ఒక కళాఖండం తీయాలంటే.. ఇంకెంత తపన కావాలి.. ఎన్ని కలలు కనాలి.. ప్రాణం పెట్టాలి.. చూపించే ప్రతి ఫ్రేమ్ లో కళాత్మకత ఉట్టిపడాలి. ఏ సినిమానీ.. కళాఖండం అవ్వాలని తీయరు. బయటికి వచ్చాక అది ప్రేక్షకుల మనస్సులో స్థానం సంపాదిస్తే తప్ప అది అంతటి పేరు తెచ్చుకోదు.. అప్పుడే ఒక మంచి సినిమా అవుతుంది.. ఇంకా బాగుంటే.. ఒక గొప్ప సినిమా అవుతుంది.. చరిత్ర సృష్టించిందంటే.. కళాఖండం అవుతుంది. అలాంటి కళాఖండాలు ఒకటి.. రెండు కాదు.. జీవితాంతం గుర్తుంచుకునేలా ఎన్నో సినిమాలు.. అది కూడా ఒక్క డైరెక్టరే తీస్తే.. ఆయన్నే కళాతపస్వి అంటారు. సినిమా ప్రపంచానికి ఒక్కరే కళాతపస్వి.. ఆయనే పద్మశ్రీ, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత కాశీనాథుని విశ్వనాథ్ గారు.
ఆయన కమర్షియల్ సినిమాలు కూడా తీశారు. కానీ విశ్వనాథ్ గారి ప్రతిభ ప్రపంచానికి తెలిసింది.. ఎక్కువ పేరు తెచ్చిపెట్టినవి మాత్రం ఖచ్చితంగా కళాత్మక సినిమాలే. ఆ సినిమాలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమాని నిలబెట్టాయి. తెలుగు సినిమా సత్తా ఇదిరా… అని అందరికీ తెలిసేలా చేశాయి. విశ్వనాథ్ గారి గొప్పతనం, ఆయన దర్శకత్వ ప్రతిభ గురించి ఇప్పటి జనరేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరెక్ట్ గా చెప్పాలంటే మనలాంటి సామాన్యులు అంత ఈజీగా అర్థం చేసుకోలేని సబ్జెక్టులు ఆయన టచ్ చేశారు. ఆయన ఒక్కో సినిమా గురించి మాట్లాడాలి అంటే.. ఒక్కో రోజు పడుతుంది. అందుకే.. మనకు తెలిసినంతలో కట్టే.. కొట్టే.. తెచ్చే.. లాగా కొన్నిసినిమాల గురించి సింపుల్ గా మాట్లాడుకుందాం.
1. శంకరాభరణం
2. శుభలేఖ
3. సాగర సంగమం
4. స్వాతిముత్యం
5. సిరివెన్నెల
ఒక చూపు లేని వాడికి.. ఒక మాటలు రాని అమ్మాయి తోడైతే ఎలా ఉంటుంది.. అదే సిరివెన్నెల సినిమా. అసలు ఈ రెండు క్యారెక్టర్స్ మధ్య కన్వర్జేషన్ చాలా కష్టం. అలాంటిది సినిమా మొత్తం నడిపించారు విశ్వనాథ్ గారు. కళ్ళతో చూడలేకపోయినా స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో మనకు వివరించారు. ఈ సినిమాతోనే మనకు పాటల రచయిత సీతారామశాస్త్రి గారు పరిచయం అయ్యి సినిమా పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు..
6. స్వయంకృషి
మెగాస్టార్ చిరంజీవిని చెప్పులు కుట్టే పాత్రలో చూపించి సాహసం చేశారు విశ్వనాథ్ గారు. చేసే పనే దైవంగా.. స్వయంకృషితో ఎదిగిన సాంబయ్య క్యారెక్టర్ లో అద్భుతంగా జీవించారు చిరంజీవి గారు.. జీవించేలా చేశారు విశ్వనాథ్ గారు. ‘కృషితో నాస్తి దుర్భిక్షం’ అనే మాటకి సరైన అర్థం ఈ సినిమా.
7. స్వర్ణ కమలం
ఈ సినిమా భానుప్రియ గారి యాక్టింగ్ కోసమైనా తప్పక చూడాలి. నాట్యం, శాస్త్రీయ సంగీతం పాతకాలం పద్ధతులు అని.. కడుపు నింపవని అనుకునే మీనాక్షి.. ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ ఏంటో ప్రపంచానికి చూపిద్దామనుకునే అబ్బాయి చంద్రశేఖరం. ఈ రెండు క్యారెక్టర్స్ లో వెంకటేశ్, భానుప్రియ జీవించారు. ప్రపంచం ఒక వైపు పరుగులు పెడుతున్నా.. మన దేశ సంస్కృతి, సంప్రదాయాలు మర్చిపోకూడదు అని చెప్పిన కథ ఇది.
8. ఆపద్భాంధవుడు
మరోసారి తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టి పశువుల కాపరి మాధవుడిగా చిరంజీవి చేసిన సినిమా ఇది. రోజురోజుకీ మనం మరిచిపోతున్న సాహిత్యం, దాని విలువ గురించి ఇందులో చూపించారు. హీరోయిన్ తండ్రి తాను రాసిన కవితలను హీరోకి అంకితం చేసి చనిపోయే సీన్.. ఈ సినిమాలో ఓ బెస్ట్ సీన్ గా చెప్పొచ్చు. ఇందులో హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ మన హాస్యబ్రహ్మ ‘జంధ్యాల’ గారు చేశారు.
9. సప్తపది
10. స్వాతికిరణం
ఒకరు తన కన్నా ఎక్కువ ఎదుగుతుంటే.. పక్కన ఇంకో మనిషికి ఈర్ష్య, అసూయ కలగడం అనేది చాలా కామన్. ఎంత పండితుడు అయినా.. జ్ఞాని అయినా.. ఈర్ష్య, అసూయలు పెంచుకుంటే ఎలా పతనం అవుతాడో చూపించారు ఇందులో. ఈ సినిమా చివరిలో తన తప్పు తెలుసుకున్న సంగీత విద్వాంసుడి పాత్ర.. సంగీత పాఠాలు మొదటి నుండి నేర్చుకోవాలని చిన్నపిల్లల మధ్య కూర్చునే ఒక్క సీన్.. విశ్వనాథ్ గారి కళాత్మక దృష్టి ఏంటో తెలియజేస్తుంది.
ఇలా.. ఎన్నో.. మరెన్నో తెలుగు జాతి గర్వించే సినిమాలు మనకు అందించి… సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన విశ్వనాథ్ గారు మన తెలుగువాడు అయినందుకు మనం ఎంతో గర్వపడాలి. ఏడ్చేవాడు కాదు.. తన నటనతో ఏడిపించేవాడు కళాకారుడు.. ఆ కళాకారుడిని తీర్చిదిద్దిన మన విశ్వనాథుడికి తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ రుణపడి ఉంటారు.