ఆహా ఏమి రుచి..
అనరా మైమరచి
రోజూ తిన్నా మరీ మోజే తీరనిదీ
తాజా కూరలలో రాజా ఎవరండీ…
ఇంకా చెప్పాలా వంకాయేనండీ అన్నాడు ఓ మహా కవి.
మన తెలుగింటి వంటకాలలో వంకాయకు ఉండే ప్రాముఖ్యత అలాంటిది. వంకాయ.. గుత్తి వంకాయ కూర అంటే లొట్టలేసుకుని తింటారు. ఇక వివాహా వేడుకలో గానీ ఫంక్షన్ల లో గానీ వంకాయ ఖచ్చితంగా కనిపిస్తుంది.
కొన్ని సార్లు ఆరోగ్యం, అందానికి కూడా వంకాయను ఉపయోగిస్తుంటారు. వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి గుండె సమస్యలను నివారిస్తుంది. శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది. రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి. వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది. వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉండడం వల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది. వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది. శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
ఐతే కొన్ని రకాల వంకాయలను తినడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం… కొన్ని రకాల వంకాయలు తినడం వల్ల రుతుస్రావంలో తేడా చేయవచ్చు. గర్భస్రావం జరగవచ్చు. ఆమ్ల సమస్యలకు కారణం కావచ్చు. అలెర్జీలకూ కారణం కావచ్చు. కొన్ని రకాల వంకాయలను తిన్నప్పుడు ఇలాంటి చర్యలు జరగే అవకాశం వుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వంకాయను అతిగా కాకుండా వారానికి ఒక్కసారి వంకాయను ఆహారంగా తీసుకున్నా చాలు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు మాత్రం వంకాయలకు దూరంగా ఉండటమే మంచిది. ఐతే మార్కెట్లో లభించే మంచి వంకాయలు దాదాపు ఎలాంటి హాని కలిగించవు.