Home Health పెరుగు తినటం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగు తినటం వలన కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు

0

పెరుగు మన ఆరోగ్యానికి మేలు చేసే అతి ముఖ్యమైన ఆహార పదార్ధాల్లో ఒకటి.. ఎముకల ఆరోగ్యానికి అవసరమైన పొటాషియం, సోడియం, కాల్షియం, ఐరన్ మరియు మాంగనీస్ కూడా ఇందులో లభిస్తాయి. అలాగే మన శరీర ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఒమేగా- 12 మరియు ఒమేగా- 4 లు కూడా ఇందులో ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో పెరుగు క్యాన్సర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని కనుగొనబడింది. ముఖ్యంగా ఆడవారిలో వచ్చే రొమ్ము క్యాన్సర్‌ను నివారిస్తుంది.. పెరుగు తినటం మన శరీరానికి రక్షణ కవచం.. మరి పెరుగు తినటం వలన కలిగే మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి మనం ఇపుడు తెల్సుకుందాం..

Health Benfits of Curdపెరుగు ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. ఇది బరువును పెంచుతుంది, శరీరానికి పుష్టిని కలిగిస్తుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది. ఆరోగ్యాన్నివ్వటంలో పెరుగుని మించిన పదార్థం మరొకటి లేదు. ఆహార పదార్థాలలో దీనిని అమృతంగా పోలుస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. పాలలో ఉండే ప్రోటీన్స్ కంటే పెరుగులో ఉండే ప్రోటీన్స్ ని మన శరీరం త్వరగా జీర్ణం చేసుకుంటుంది. మనం తీసుకున్న తర్వాత 1 గంటలో పెరుగు 91 శాతం జీర్ణం అయితే అదే సమయంలో పాలు 32 శాతం మాత్రమే జీర్ణం అవుతాయని పరిశోధకులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.. పాలు పెరుగుగా మారడానికి జరిగే ప్రక్రియలో బాక్టీరియా పాలలో ఉండే ప్రోటీన్ ని తేలికగా అరిగేలా చేస్తుంది. ఈ రకమైన మార్పు వలన పెరుగు త్వరగా జీర్ణం అవుతుంది. అంతే కాకుండా జీర్ణకోశంలో పెరిగే హానికర బాక్టీరియాలని పెరగనివ్వకుండా చేస్తుంది. అలాగే మనకి మంచి చేసే బాక్టీరియాని పెరిగేలా కూడా చేస్తుంది. ఈ బాక్టీరియా పెరుగులో ఉండే మినరల్స్ త్వరగా రక్తంలో కలిసేలా చెయ్యడం, బి కాంప్లెక్స్ విటమిన్ ని తయారుచేయటం లాంటి పనులు కూడా చేస్తుంది. చర్మం నిగనిగలాడుతూ కనిపించే అందుకు పెరుగు ఉపయోగపడుతుంది. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది. పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.

ముఖంపై మొటిమలున్నవారు పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్ గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది..

విరోచనం సాఫీగా అవ్వని వారికి పెరుగు ఎంతో ఉపయుక్తం. అలాగే అధిక విరేచనాలతో బాధపడేవారికి కూడా ఉపయోగమే. అదే పెరుగులో ఉండే మహత్యం. కడుపులో అల్సర్ ఉండే వారిలో, గ్యాస్ట్రిక్ ఇరిటెషన్ తో బాధపడేవారికి, హైపర్ ఎసిడిటీతో బాధపడేవారికి పెరుగు అత్యద్భుతమైన ఫలితాన్నిస్తుంది. దీని కారణం ఏమంటే పెరుగు పుల్లగా ఉన్నా అది క్షారగుణం కలది. కాబట్టి జీర్ణం అయ్యేటప్పుడు అది కార్బన్ డయాక్సైడ్, నీరుగా మారిపోతుంది. దాంతో హైపర్ ఎసిడిటి, అల్సర్ లాంటివి తగ్గుతాయి. అంతే కాకుండా పెరుగు జీర్ణాశయంలోని గ్యాస్ ని కూడా తగ్గిస్తుంది. జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే పెప్సిన్ అనే ఎంజైం విడుదల అయ్యేలా కూడా చేస్తుంది. పెరుగు తినే వారికీ ఎపెండిసైటిస్ రాదు. అలాగే ఎమీబియాసిస్ ఉన్నా తగ్గి పోతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారు అయితే రోజూ పెరుగుని వాడటం మంచిది. పెరుగుని రోజూ తీసుకోవటం వల్ల రోగ నిరోధక శక్తి పెంచటం ద్వారా ఈ ప్రక్రియను అరికట్టవచ్చునంటూ ఎన్నో శాస్త్రీయ పరిశోధనలు చెపుతున్నాయి.

కామెర్లు వచ్చిన వారికి పెరుగు ఒక చక్కని ఔషథం. ఎందుకంటే హెపటైటిస్ వచ్చినవారికి రక్తంలో అమ్మోనియా శాతం పెరిగి కోమాలోకి వెళ్ళే అవకాశం ఉంది. పెరుగు వాడటం వలన దాని బారిన పడకుండా ఉండవచ్చు. పెరుగులో ఉండే లాక్టిక్ ఆసిడ్ అమ్మోనియా నుంచి వచ్చే చెడు లక్షణాలను నిరోధిస్తుంది. కామెర్లు వచ్చిన వారికి పెరుగు, మజ్జిగ అధిక మొత్తంలో ఆహారంగా ఇస్తూ దాంట్లో కొద్దిగా తేనె కూడా కలిపి ఇస్తే మరింతగా త్వరగా కోలుకొనే అవకాశం ఉంది. చర్మ వ్యాధులున్నవారికి కూడా పెరుగు, మజ్జిగ ఉపయోగం అమోఘం. సొరియాసిస్, ఎగ్జిమా ఉన్నవారికి పెరుగుగానీ, మజ్జిగ గాని పై పూతగా వాడితే మంచి ఫలితాలుంటాయి. పలుచని పెరుగులో ముంచిన బ్యాండేజి క్లాత్ చర్మ వ్యాధి ఉన్న ప్రాంతంపై కొద్ది సేపు ఉంచితే తొందరలోనే ఆ ప్రాంతం ఆరోగ్యవంతమైన చర్మంగా రూపొందుతుంది..

అయితే పెరుగు రాత్రి వేళల్లో తినకూడదని ఆయుర్వేదంలో చెప్పబడింది.. పెరుగుని వేడి చేసి కూడా తినకూడదు. అలాగే పూర్తిగా తోడుకోని పెరుగును కూడా అస్సలు తినవద్దు.. అలా తింటే వాత సమస్యలు కలిగే అవకాశముంది..

Exit mobile version