ఆరోగ్యమైన, అందమైన చర్మాన్ని అందరూ కోరుకుంటారు. అందుకోసం ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు. రక రకాల క్రీములు రాస్తూ, ఫేస్ ప్యాక్‌లు వేసుకుంటూ మెరుపులు అద్దుతుంటారు . అలా కాకుండా ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం మీ సొంతమవుతుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు మొటిమలు పోయి ఆరోగ్యంగా కనిపించాలంటే ఏం తినాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.
పాలకూర:
విటమిన్– ఎ, బీటా కెరటిన్‌లు పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తాయి. పాలకూరను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో పాలకూర బాగా పనిచేస్తుంది.
క్యారెట్స్:
విటమిన్ –ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఇన్‌ఫెక్షన్లు దరిచేరవు. ఇందులో ఉండే బీటా కెరటిన్ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా,కాంతివంతంగా ఉంచుతుంది.
విటమిన్ బి–6:
విటమిన్–బి6 ఎక్కువగా ఉండే క్యారెట్, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌నట్స్, అవకాడో హార్మోన్లలోని తేడాల వల్ల వచ్చే మొటిమలను నివారిస్తాయి. అలాగే హార్మోన్ల సమతుల్యత సరిగా జరిగేలా చూసి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
బొప్పాయి:
బొప్పాయిలో విటమిన్– సి, ఇ , బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చర్మంపైన ఉండే డెడ్ స్కిన్ సెల్స్ దూరమై అందంగా మారతారు.
ఒమేగా త్రీ ఫ్యాటీ:
చేపలు, సోయా ఉత్పత్తు ల్లో ఒమెగా– 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్ లాంటివి దూరమవుతాయి. చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది. తాజా చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి చర్మంలోని తేమను బయటకు వెళ్లనివ్వకుండా కాపాడి చర్మాన్ని మెరిపిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్:
యాపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌ను తొలగిస్తాయి. అందుకే చర్మం యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి. అలాగే పల్లీలు, బీట్ రూట్, కివీ పండ్లను తరచూ తింటే చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.
బాదం పప్పు:
విటమిన్– ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం పప్పుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ 4బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. అలాగే కీరదోసకాయను తొక్కతో తినడం మంచిది. అందులోని విటమిన్ –ఎ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు కీరదోస కాయ ముక్కల గుజ్జును ముఖానికి పట్టిస్తే నల్లటి మచ్చలు దూరమవుతాయి.
టొమాటోలు:
టొమాటోలో విటమిన్– ఎ, కె, బి1, బి3, బి5, బి6, బి7 ఫుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని తాజాగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే టొమాటోలో ఉండే లైకోపిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. యాంటీ ఏజింగ్ గుణాలు కూడా టొమాటోల్లో ఎక్కువగా ఉంటాయి. ఇవి కాలుష్యం, సూర్య కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి ఆరోగ్యంగా ఉంచుతాయి.
డార్క్ చాక్లెట్స్:
యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే డార్క్చాక్లెట్స్ చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.అలాగే ముడిబియ్యం, పొట్టుతీయని ధాన్యాలు, బార్లీ, పొట్టు తీయని గోధుమలతో చేసిన బ్రెడ్స్‌లో పీచు పదార్థాలు ఎక్కువ. ఇవి చర్మాన్ని బిగుతుగా చేసి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.