Home Unknown facts Here Are a Few Things about Telugu Valor Who Created Our National...

Here Are a Few Things about Telugu Valor Who Created Our National Tricolor Flag

0

ఆయన ఒక గొప్ప స్వాత్యంత్ర సమరయోధుడు, దేశభక్తితో 19 ఏళ్ళ వయసులనే దక్షిణాఫ్రికాలో జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు, స్వాత్యంత్ర సమరయోధుడే కాదు అయన ఒక భూగర్భ శాస్త్రవేత్త. ఇక బ్రిటిష్ వారి జెండాని చూసి మనకంటూ ఒక జెండా ఉండాలని భావించి జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన తెలుగు తేజం శ్రీ పింగళి వెంకయ్య గారు. మరి పింగళి వెంకయ్య గారిని పత్తి వెంకయ్య, జపాన్ వెంకయ్య, వజ్రాల వెంకయ్య అని పలు పేర్లతో పిలవడం వెనుక కారణం ఏంటి? ఆయన జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడం వెనుక కారణం ఏంటి? భారతదేశానికి స్వాత్యంత్రం వచ్చిన తరువాత ఆయన జీవితంలో చోటు చేసుకున్న చేదు సంఘటనలు ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Few Things about Telugu Valor

పింగళి వెంకయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, మచిలీపట్టణం సమీపాన  ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామంలో 1878 ఆగస్టు 2న పింగళి హనుమంతరాయుడు, వెంకటరత్నమ్మ దంపతులకు పింగళి వెంకయ్య గారు జన్మించారు. ఈయన చిన్నతనం నుండి కూడా చాలా చురుకైన విద్యార్ధి. మచిలీపట్నంలోని హిందూ ఉన్నత పాఠశాలలో చదివిన అయన సైన్యంలో చేరాలనే ఆశతో 19 ఏళ్ళ వయసులు ముంబై వెళ్లి అక్కడి సైన్యంలో చేరి దక్షిణాఫ్రికాలో జరుగుతున్న బోయర్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఇలా ఆఫ్రికా వెళ్లిన అయన అక్కడ గాంధీ ని కలిశారు. ఆవిధంగా దక్షిణాఫ్రికాలో వెంకయ్య గారికి గాంధీ గారితో పరిచయం ఏర్పడి వీరి సాన్నిహిత్యం 50 సంవత్సరాల పాటు అలానే కొనసాగింది.

ఇక యుద్ధం ముగిసిన తరువాత తిరుగు ప్రయాణంలో అరేబియా, ఆఫ్ఘనిస్తాన్ లని చూసి వచ్చారు. అయితే మద్రాస్ లో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు  ప్లేగ్ ఇన్‌స్పెక్టరు శిక్షణ పూర్తి చేసి, కొంతకాలం బళ్ళారిలో ప్లేగ్ ఇన్‌స్పెక్టర్ గా పని చేశారు. ఇక చదువు పైన ఇష్టంతో శ్రీలంక వెళ్ళి కొలంబోలోని సిటీ కాలేజీలో పొలిటికల్ ఎకనమిక్స్  చదివి కేంబ్రిడ్జి సీనియర్ పరీక్షలో నెగ్గారు. ఆ తరువాత కొంతకాలం రైల్వేలో గార్డుగా పనిచేశారు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లాహోర్ లోని డి.ఏ.వి. కాలేజీలో చేరి, సంస్కృతం, ఉర్దూ, జపాన్ భాషల్లో మంచి పాండిత్యం సంపాదించారు. జపాన్ భాషలో అనర్గళంగా మాట్లాడే వెంకయ్యగారిని జపాన్ వెంకయ్య  అనేవారు.

ఇక వ్యవసాయం అంటే ఇష్టంతో అయన అమెరికా నుండి కంబోడియా ప్రత్తి విత్తనాలు తెప్పించి ప్రత్తిని పండించి అధిక లాభాలు వచ్చేలా చేసిన ఘనత వెంకయ్యగారికే చెల్లుతుంది. ఇంకా 1907 నుండి 1910 వరకు మునగాలలో ఉంటూ వ్యవసాయ శాస్త్రం అనే గ్రంథాన్ని వ్రాశారు. అప్పుడు అందరు ఆయన్ని ప్రత్తి వెంకయ్య అనేవారు. వెంకయ్యగారికి, బ్రిటన్ లోని రాయల్ అగ్రికల్చరల్ సొసైటీ సభ్యత్వం కూడా లభించింది. వెంకయ్యగారు బందరులోని జాతీయ కళాశాలలో 1911 నుండి 1919 వరకు అధ్యాపకులుగా పని చేశారు. వ్యవసాయ శాస్త్రం, చరిత్రలతో పాటు విద్యార్థులకు గుర్రపుస్వారీ, వ్యాయామం, సైనిక శిక్షణ ఇచ్చేవారు. ఈనాడు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఎన్.సి.సి. శిక్షణోద్యమానికి 75 ఏళ్ళ క్రితమే శ్రీకారం చుట్టిన మహనీయుడు పింగళి వెంకయ్యగారు. అప్పట్లోనే చైనా జాతీయ నాయకుడైన సన్‌యెట్ సేన్ జీవిత చరిత్ర వ్రాశారు.

ఇక జాతీయ జెండా విషయానికి వస్తే, 1906 సంవత్సరంలో కలకత్తాలో జరిగిన కాంగ్రెస్ సభలలో ఇంగ్లీషు వారిని ఒక పక్క మన దేశాన్ని వదలి పొమ్మంటూనే మరొకపక్క వారి జెండాను ఉపయోగించడం పింగళి వెంకయ్యగారిలో సరికొత్త ఆలోచనకు నాందీ పలికింది. ఆ తరువాత 1916లో భారతదేశానికొక జాతీయ జెండా అనే పుస్తకాన్ని ఇంగ్లీషులో రాసి ప్రచురించాడు. 1916లో లక్నోలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో వెంకయ్య తయారు చేసిన జాతీయ జెండానే ఎగురవేశారు. 1919లో జలంధర్ వాస్తవ్యులైన లాలా హన్స్ రాజ్ మన జాతీయపతాకంపై రాట్న చిహ్నముంటే బాగుంటుందని సూచించగా గాంధీజీ దాన్ని అంగీకరించాడు. 1921లో అఖిలభారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరిగాయి. గాంధీజీ వెంకయ్యను ఆ సమావేశానికి పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు. ఈవిధంగా ఆంధ్రప్రదేశ్ లో గాంధీజీ ప్రోద్బలంతో త్రివర్ణపతాకం రూపొందింది. అయితే  కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారత దేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం. కానీ ఆ తరువాత 1947, జూలై 22 వ తేదీన భారత రాజ్యాంగ సభలో నెహ్రూ జాతీయ జెండా గురించి ఒక తీర్మానం చేస్తూ, మునుపటి త్రివర్ణ జెండాలోని రాట్నాన్ని తీసేసి, దాని స్థానంలో అశోకుని ధర్మచక్రాన్ని చిహ్నంగా ఇమిడ్చారు. చిహ్నం మార్పు తప్పితే పింగళి వెంకయ్య రూపొందించిన జెండాకు నేటి జెండాకు తేడా ఏమీ లేదు. అశోకుని ధర్మచక్రం మన పూర్వ సంస్కృతికి సంకేతం.

పింగళి వెంకయ్య 1906 నుంచి 1922 వరకు భారత జాతీయోద్యమంలోని వివిధ సంఘటనలలో పాల్గొనటం జరిగింది. వందేమాతరం, హోమ్‌రూల్ ఉద్యమం, ఆంధ్రోద్యమంలాంటి ప్రసిద్ధ ఉద్యమాలలో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. ఆ తరువాత క్రమంగా రాజకీయాలకు దూరం అయినా వెంకయ్యగారూ మద్రాసు వెళ్ళి ప్రెసిడెన్సీ కాలేజీలో భూగర్భ శాస్త్రంలో పరిశోధనలు చేసి డిప్లమో తీసుకున్నారు. ఆ తర్వాత నెల్లూరు చేరి 1924 నుండి 1944 వరకు అక్కడే ఉంటూ మైకా గురించి పరిశోధన చేశారు. వజ్రకరూరు, అనంతపురం జిల్లా, హంపీ కొన్ని చోట్ల ఖనిజాలను అన్వేషిస్తూ ప్రభుత్వానికి ఖనిజాల ఉనికిని గురించిన నివేదికలు పంపారు. అంతవరకు బొగ్గు వజ్రంగా మారుతుందనుకొనేవారు. ప్రపంచంలో మొదటిసారిగ వజ్రపుతల్లి రాయిని కనుగొన్న పరిశోధకులు వెంకయ్యగారే. ఈ తల్లిరాయిని గురించి వెంకయ్యగారు ఆంగ్లంలో గ్రంథం వ్రాశారు. పాశ్చాత్య శాస్త్రజ్ఞులు వెంకయ్యగారి ప్రతిభా విశేషాలను ఎంతగానో కొనియాడారు. అందుకే ప్రజలు వెంకయ్యగారిని వజ్రాల వెంకయ్య అని పిలిచేవారు.

దేశానికి స్వాతంత్ర్యం లభించిన తరువాత ప్రభుత్వం వెంకయ్యను ఖనిజ పరిశోధక శాఖ సలహాదారుగా నియమించింది. ఆ పదవిలో ఆయన 1960 వరకు పనిచేసాడు. అప్పటికి ఆయన వయస్సు 82 సంవత్సరాలు. ఇక వృద్ధాప్యంలో ఆర్థిక బాధలు ఆయనను చుట్టుముట్టాయి. మిలటరీలో పనిచేసినందుకు విజయవాడ చిట్టినగరులో ప్రభుత్వం ఇచ్చిన స్ధలంలో ఆయన గుడిసె వేసుకొని దారిద్ర్యంలో బతకవలసి వచ్చింది. ఆయన ఏనాడూ ఏ పదవినీ ఆశించలేదు. కాని ఆయన నిస్వార్థ సేవను ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం. తన చివరి రోజుల్లో కనీసం తినడానికి తిండి కూడా ఉండేది కాదంటూ ఎన్నో కష్టాలు అయన అనుభవించాడని త్రివేణి సంపాదకులు డా. భావరాజు నరసింహారావు పేర్కొన్నారు.  ఇక అయన మరణించే ముందు తన చివరి కోరిక ఏమని కోరారంటే, నా అంత్య దశ సమీపించింది. నేను చనిపోయిన తర్వాత త్రివర్ణ పతాకాన్ని నా భౌతిక కాయంపై కప్పండి. శ్మశానానికి చేరిన తర్వాత ఆ పతాకం తీసి అక్కడ ఉన్న రావి చెట్టుకు కట్టండి. ఇది నా తుది కోరిక అని చెప్పి 1963 సంవత్సరం జులై 4 వ తేదీన మరణించారు.

ఇలా తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన గొప్ప దేశ భక్తుడు పింగిళి వెంకయ్య గారికి జనజాగృతి సంస్థ కన్వీనర్‌ సికినం కాళిదాసు కోరిక పై తపాలాశాఖ పింగళి వెంకయ్య చిత్రంతో రూ.5 స్టాంపును విడుదల చేశారు.  జాతీయ త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడు, స్వాత్యంత్ర సమరయోధుడు, తెలుగు జాతి గర్వకారుడు శ్రీ పింగళి వెంకయ్య గారికి జోహార్లు.

Exit mobile version