హిజ్రాలు సాధారణంగా గుడికి రావడం ఎక్కువగా మనం చూసి ఉండము. కానీ ఈ ఆలయం ప్రత్యేకంగా వీరి కోసమే అన్నట్లుగా ఉంటుంది. ఎందుకంటే ఈ ఆలయంలో హిజ్రాల పండుగ అనేది ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే హిజ్రా అనే వారు పెళ్లి అనేది చేసుకోరు కానీ ఈ పండుగ రోజున వారు పెళ్లికూతురై మనకి కనిపిస్తారు. మరి ఈ దేవాలయం హిజ్రాలకు పవిత్ర ఆలయం ఎందుకు అయింది? ఆ ఆలయం ఎక్కడ ఉంది? హిజ్రాల పండుగ అనేది ఏవిధంగా ఉంటుందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని, విల్లాపురం జిల్లాలోని కూవాగం అనే గ్రామంలో కూతాండవర్ దేవాలయం ఉంది. ఇక వీరు పెళ్లి చేసుకునేది ఎవరినో కాదు ఆలయంలో ఉన్న స్వామివారిని వివాహం చేసుకుంటారు. ఇక వివాహం చేసుకున్నాక కూతాండవర్ మరణిస్తాడని ఆ తరువాతి ఆడవారి వేషంలో వారు రోజు గాజులు పగలకొట్టుకొని అక్కడ ఉన్న కోనేటిలో స్నానము చేస్తారు. ఇలా వీరు ఆచరించడం వెనుక ఒక పురాణ గాథ ఉంది. కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు గెలవాలంటే ఒక గొప్ప యోధుని బలిదానం జరగాలట. అలాంటి యోధుడు అర్జునుడే అని గుర్తిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ, అర్జునుణ్ణి బలివ్వడం ఇష్టంలేక ప్రత్యామ్నాయంకోసం ఆలోచించగా అర్జునుడికీ, నాగకన్య ఉలూపికీ జన్మించిన ఇరావంతుడు గుర్తొచ్చి బలిదానానికి ఒప్పిస్తాడు. అయితే, బలయ్యే ముందు పెళ్లి చేయాలని షరతు పెడతాడు ఇరావంతుడు. అప్పుడు కృష్ణుడే మోహినీ రూపంలో అతణ్ణి పెళ్లిచేసుకున్నాడట. శ్రీకృష్ణుడి మోహినీ అంశతోనే తాము జన్మించామనీ, మోహినికి భర్త అయిన ఇరావంతుడే తమ దైవమనీ చెబుతారు హిజ్రాలు. ఇలా ఇప్పటికీ కూవగంలో 18 రోజులు ఉత్సవాలు చేస్తారు. వారు శ్రీకృష్ణుని అవతారంగా భావించి కూతాండవర్‌ను ఆరాధిస్తారు. 17 వ రోజున మంగళసూత్రధారణ చేస్తారు. 18వ రోజు మంగలసూత్రాన్ని, గాజులను, పువ్వులను తీసివేసి రోదిస్తారు. అయితే ఇరావంతుడు, మోహినిల వివాహానికి సూచికగా ఏటా హిజ్రాలు తమ ఇష్టదైవాన్ని పెళ్లిచేసుకుంటారు. ఆ సందర్భంగా జరిగే జాతరే కూతాండవర్ ఆలయ ఉత్సవం అని అంటారు. ఈ ఉత్సవం సందర్బంగా కొన్ని వేల మంది హిజ్రాలు ఇక్కడికి తరలివస్తుంటారు. ఇలా వచ్చిన హిజ్రాలకు అక్కడి గ్రామస్థులు ఆశ్రయం కల్పించడం విశేషం. ఇక కల్యాణోత్సవం రోజు రాత్రి పట్టుచీరలు కట్టుకుని వధువుల్లా మారతారు. ఇరావంతుడి దర్శనానికి వెళ్లి పూజారులతో పసుపుతాడు కట్టించుకుంటారు. అయితే ఆలయ నియమానుసారం మగవాళ్లు కూడా తాళికట్టించుకోవచ్చట. అందుకే, సమీప గ్రామాల్లోని చాలామంది పురుషులు చేతికి రెండుమూడు గాజులు ధరించి, మల్లెపూలు మెడకు చుట్టుకుని పూజారులతో తాళికట్టించుకుంటారు. అంతేకాదు, చిన్నవాళ్త్లెన మగపిల్లలకు తాళికట్టించుకుని తీసుకెళతారు తల్లిదండ్రులు. ఇక్కడ తాళి కట్టించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరతాయని నమ్మకం. మహిళలు దైవదర్శనం చేసుకోవచ్చుగానీ తాళి కట్టించుకోవడానికి అనర్హులని చెబుతారు. ఇలా తాళి కట్టించుకున్న హిజ్రాలు రాత్రంతా ఆలయం వద్దే ఆడుతూ పాడుతూ గడుపుతారు. చెక్కలతో ఇరావంతుని విగ్రహం చేసి వూరంతా వూరేగిస్తారు. ఇరావంతుడి బలికి సూచకంగా చెక్కవిగ్రహం తలను తెల్లవారుజామున తీసేస్తారు. అంతవరకూ ఆనందోత్సాహాలతో గడిపిన హిజ్రాలు ఇరావంతుని బలి జరిగిందని తెలుసుకుని ఏడవడం మొదలుపెడతారు.ఈవిధంగా వివాహం బలిదానం ముగిసాక వితంతువు అయినా హిజ్రాలు తెల్లటి చీర ధరించి అక్కడి నుండి వెళ్లిపోవడం తో ఆ ఉత్సవం అనేది ముగుస్తుంది.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.