Home Unknown facts వైశాఖ మాస వ్రతం వలన కలిగే ఫలితాలు ఏంటి ?

వైశాఖ మాస వ్రతం వలన కలిగే ఫలితాలు ఏంటి ?

0

వసంత ఋతువులో రెండవ మాసం వైశాఖ మాసం. దీనికి వైదిక సాంప్రదాయంలో ‘మాధవ’ మాసం అంటారు. ‘మధు’ అని చైత్ర మాసానికి పేరు. వైశాఖ మాసం లక్ష్మీ నారాయణుల ఆరాధనకి చాలా ప్రసిద్ధమైనది. వైశాఖంలో రకరకాల వ్రతాలు చేస్తారు. అందులో ముఖ్యమైనది వైశాఖ మాస వ్రతం. వ్రత కథను తెలుసుకుందాం.

How Important is Vaishakha Masamపూర్వం పాంచాలదేశంలో పురుయశుడనే రాజు ఉండేవాడు. అతడు పుణ్యశీలుడు అనే మహారాజు పుత్రుడు. అతను తండ్రి మరణించిన తరువాత రాజు అయ్యాడు. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచేత విశాల భూమిని పరిపాలించాడు. పూర్వజన్మ దోషాల చేత కొంతకాలానికి సంపదను కోల్పోయాడు. అతని అశ్వాలు, ఏనుగులు మొదలైన బలం నశించింది. అతని రాజ్యంలో కరువు తాండవించింది. ఇలా తన రాజ్యం చాలా బలహీనపడింది.

అతని బలహీనత తెలిసి శత్రువులందరు కలసి తన రాజ్యం మీదికి దండెత్తి వచ్చారు. యుద్ధంలో ఓడిపోయాడు. అలా ఓడిపోయి భార్య శిఖినితో కలిసి పర్వతగుహలో దాక్కొని యాభైమూడు సంవత్సరాలు గడిపాడు. ఆ రాజు తనలో తాను ఇలా విచారించాడు. “నేను ఉత్తమ వంశంలో జన్మించాను. మంచి పనులను చేసాను. పెద్దలను గౌరవించాను. జ్ఞానవంతుడిని. దైవభక్తి, ఇంద్రియాలపై నిగ్రహం ఉన్న వాడిని. నవారు కూడా నాలాగే సద్గుణవంతులు. నేనేమి పాపం చేశాను నాకు ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చియి? నేను ఇలా అడవిలో ఎంత కాలం ఉండాలి అని విచారించి తన గురువులు అయిన యాజుడు, ఉపయాజకుడిని తలుచుకున్నాడు. సర్వజ్ఞులయిన వారిద్దరు రాజు తలుచుకోగానే ప్రత్యక్షం అయ్యారు.

రాజు వారిద్దరికి నమస్కరించి యధాశక్తి ఉపచారాలు చేసాడు. వారిని ఆశీనులను చేసి దీనంగా వారి పాదాల మీదపడి నాకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? నాకు తరణోపాయము చెప్పండి అని వారిని ప్రార్థించాడు. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను విన్నారు. రాజు బాధను అర్ధం చేసుకున్నారు. ఒక్క క్షణం ధ్యానంలో ఉండి ఇలా అన్నారు. రాజా! నీ దుఃఖానికి కారణం విను . నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడివి. నీలో ధర్మప్రవృత్తి కొంచమైనా లేదు. మంచి గుణాలేవి లేవు. శ్రీహరికి నమస్కరించలేదు. శ్రీహరిని కీర్తించలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మలో నీవు సహ్యపర్వతంలో కిరాతకుడిలా ఉంటూ అందరిని బాధించుతూ, బాటసారులను దోచుకుంటూ కఠినమైన జీవితాన్ని గడిపావు. నీవు గౌడ దేశంలో భయంకరమైన వ్యక్తిలా అయిదు సంవత్సరాలు గడిపావు.

బాలులను, మృగాలను, పక్షులను, బాటసారులను చంపినందుకు నీకు సంతానం లేదు. నీకు ఈ జన్మలో కూడా సంతానం లేకపోవడానికి నీ పూర్వ జన్మ కర్మలే కారణం. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడు కూడా లేరు. అందరిని పీడించడం చేత దానమన్నది చేయకపోవడం చేత నీవు దరిద్రునిగా ఉన్నావు. అప్పుడు అందరిని భయపెట్టినందుకు నీకిప్పుడు ఈ భయం కలిగింది. ఇతరులను నిర్దయగా పీడించుటచేత ఇప్పుడు నీ రాజ్యం శత్రువుల ఆధీనంలో ఉంది. ఇన్ని పాపాలను చేసినా నీవు రాజకులంలో పుట్టడానికి ఒక కారణం ఉంది.

నీవు గౌడదేశంలో అడవిలో కిరాతుడవై గత జన్మలోఉండగా ధనవంతులైన ఇద్దరు వైశ్యులు కర్షణుడు అనే ముని నీవున్న అడవిలో ప్రయాణించారు. నీవు వారిని అడ్డగించి బాణాన్ని ప్రయోగించి ఒక వైశ్యుని చంపావు రెండవ వైశ్యుని చంపబోయావు. అతడు భయపడి ధనాన్ని పొదలో దాచి ప్రాణరక్షణకోసం పారిపోయాడు. కర్షణుడు అనే ముని నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుతు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లాడు. నీవు కర్ష్ణణుని దగ్గరికి వచ్చి అతని ముఖం మీద నీటిని చల్లి ఆకులతో విసరి అతనికి సేవచేసి అతని సేదతీర్చావు. అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వల్ల భయం లేదు. నీ దగ్గర ధనం లేదు నిన్ను చంపితే ఎం వస్తుంది? కాని పారిపోయిన వైశ్యుడు ధనాన్ని ఎక్కడ దాచాడో చెప్పు. నిన్ను విడిచిపెడతాను. లేకపోతే నిన్ను కూడా చంపేస్తాను అని బెదిరించావు. ఆ ముని భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనాన్ని దాచిన పొదను చూపించాడు.

అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటికి పోవడానికి మార్గాన్ని చెప్పావు. దగ్గరలోఉన్న నిర్మల జలం ఉన్న సరస్సును చూపించి నీటిని తాగి కొంతసేపు సేదతీరి వెళ్ళు అని చెప్పావు. రాజభటులు నాకోసం రావచ్చు కాబట్టి నీ వెంట వచ్చి మార్గాన్ని చూపించలేను అని చెప్పావు. ఈ ఆకులతో విసురుకో చల్లనిగాలి వీస్తుంది అని మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కున్నావు. నీవు పాపాత్ముడవైనా వైశ్యుని ఆ మునికి సేవలు చేయడం వల్ల అతను అడవి నుండి పోవడానికి మార్గాన్ని చెప్పడం వల్ల జలాశయ మార్గాన్ని చెప్పడం వల్ల ఆ కాలం వైశాఖమాసం అవడం చేత నీవు తెలియకచేసినా, స్వార్థముతో చేసినా ఆ మునికి చేసిన సేవ ఫలించింది. ఆ పుణ్యము వల్ల నీవిప్పుడు రాజ వంశంలో జన్మించావు.

నీవు నీ రాజ్యాన్ని పూర్వ సంపదలతో వైభవాన్ని కావాలనుకుంటే వైశాఖ వ్రతాన్ని ఆచరించు. ఇది వైశాఖమాసం. నీవు వైశాఖశుద్ద తదియలో ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు దానమిస్తే నీ కష్టాలు తీరుతాయి. గొడుగును ఇస్తే రాజ్యాన్ని తిరిగి పొందుతావు. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతం ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి ధానాలను చేయి. లోకములన్ని నీకు వశమవుతాయి. నీకు శ్రీహరి సాక్షాత్కరిస్తాడు అని వారిద్దరు రాజుకు వైశాఖ వ్రత విధానాన్ని చెప్పి తమ నివాసాలకు వెళ్లిపోయారు.

రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతాన్ని భక్తిశ్రద్దలతో ఆచరించాడు. యధాశక్తిగా దానాలను చేసాడు. వైశాఖవ్రత ప్రభావంతో ఆ రాజు బంధువులందరు మళ్ళి అతని దగ్గరికి వచ్చారు. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురానికి పోయాడు. శ్రీహరి దయవల్ల అతని శత్రువులు పరాజితులై నగరాన్ని విడిచి వెళ్లిపోయారు. రాజు సులభంగా తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. పోగొట్టుకొని సంపదలకంటే అధికంగా సర్వసంపదలను పొందాడు. వైశాఖవ్రత మహిమ వల్ల సర్వ సంపన్నమై సుఖశాంతులతో ఆనందంగా ఉన్నాడు. అతనికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామిఅంతటి సమర్థులు కలిగారు. రాజును రాజ్యవైభవం సంతానం కలిగినా కూడా భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతం ఆచరించి యధాశక్తి దానధర్మాలను చేస్తూ ఉన్నాడు. ఆ రాజుకు గల నిశ్చలభక్తికి సంతోషించిన శ్రీహరి అతనికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ప్రత్యక్షమయ్యాడు. చతుర్బాహువులలో శంఖచక్రగదా ఖడ్గాలను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన అచ్యుతునిచూసి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించాడు.

 

Exit mobile version