Home Unknown facts శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి?

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి?

0

దుష్ట శక్తుల పీడనుండి, గ్రహాల దుస్థితినుండి రక్షిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. అంతేకాదు, కొందరు పిల్లలకు పుట్టుకతో బాలారిష్ట దోషాలు వస్తాయి. ఈ దోషాలు పిల్లలు పదమూడో ఏట అడుగు పెట్టేవరకూ అనేక రకాలుగా పీడిస్తాయి. ఇలా బాలారిష్ట దోషాలు ఉన్న చిన్నారులు ఏదో ఒక జబ్బు బారిన పడుతుంటారు. కొందరు పిల్లలు బుద్ధిమాంద్యంతో బాధపడతారు. ఇంకొందరు చిన్నారులు చీటికిమాటికి అనారోగ్యం చేసి అవస్త పడుతూ, బాగా చిక్కిపోతారు. కొందరు బాలలు స్కూలుకు వెళ్ళమని మారాం చేస్తారు. మరికొందరు పిల్లలు మంచి తెలివి ఉండి కూడా చదువుకోరు. సోమరులుగా తయారౌతారు. ఆరోగ్యం దెబ్బ తినడం, చదువుకు దూరం కావడమే కాకుండా కొందరు చిన్నారులు భయాందోళనలకు గురవుతారు. ఈ రకమైన బాలారిష్టాల నుండి గట్టేక్కిస్తాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి. దెయ్యాలు, భూతాలు అనే మాటలు మనకు తరచూ వినిపిస్తుంటాయి. గాలి సోకడం, దెయ్యం పట్టడం, చేతబడులు లాంటి తాంత్రిక శక్తుల లాంటి దుష్ట శక్తుల బారినుండి శ్వేతార్క ఆంజనేయ స్వామి కాపాడతాడు. మరి శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.

Swetarka Anjaneya Swamiతెల్ల జిల్లేడు మొక్క కాండం మీద ఆంజనేయ రూపాన్ని చెక్కి శ్వేతార్క ఆంజనేయ స్వామిని రూపొందిస్తారు. శ్వేతార్క ఆంజనేయ స్వామిని చెక్కేవారు ఆ సమయంలో నియమనిష్టలతో ఉండాలి. స్వామివారికి ఇష్టమైన కాషాయరంగు దుస్తులు ధరించాలి. బ్రహ్మచర్యం పాటించాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ ప్రారంభించే రోజున పొద్దున్నే స్నానం చేసి, పూజాస్థలంలో కడిగిన పీట ఉంచాలి. ఆ పీటకు పసుపు రాసి, కుంకుమ బొట్లు పెట్టాలి. పీటమీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, దానిమీద ఒక పళ్ళాన్ని ఉంచాలి. ఆ పళ్ళెంలో అక్షింతలు, పూలు, సింధూరం జల్లి, వాటిమీద శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఉంచాలి. శ్వేతార్క ఆంజనేయ స్వామికి సింధూరం అలంకరించి, పూలమాల వేసి, దీపారాధన చేయాలి. ధ్యాన, ఆవాహనాది విధులతో శ్వేతార్క ఆంజనేయ స్వామిని ఆరాధించాలి. తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తిపూర్వకంగా ప్రార్ధించాలి. జపమాల చేత ధరించి :

  • ”ఓం ఆంజనేయాయ విద్మహే
  • వాయుపుత్రాయ ధీమహి
  • తన్నో హనుమాన్ ప్రచోదయాత్”
  • అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.

జపం ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పించాలి. నీరాజనం, మంత్రపుష్పం మొదలైన సేవలు ముగిసిన తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామి పాదాల వద్దనున్న అక్షింతలు తీసి, తలమీద జల్లుకోవాలి. ఆ తర్వాత శ్వేతార్క ఆంజనేయ స్వామికి ఉద్వాపన చెప్పి, విగ్రహం తీసి, పూజా మందిరంలో ప్రతిష్టించుకోవాలి.

శ్వేతార్క ఆంజనేయ స్వామిని ”హనుమజ్జయంతి” నాడు పూజించడం శ్రేష్టం. లేదా అక్షయతృతీయ నాడు శ్వేతార్క ఆంజనేయ స్వామి పూజ జరుపుకోవడం ఉత్తమం. ఈ రోజుల్లో వీలు కుదరకపోతే, మంగళవారం లేదా శనివారం నాడు ప్రార్ధించవచ్చు. ఆవేళ దశమి తిధి గనుక కలసివస్తే మరీ మంచిది. ఇలా శ్వేతార్క ఆంజనేయ స్వామిని భక్తి ప్రపత్తులతో పూజించేవారికి ఎలాంటి బాధలు, భయాలు ఉండవు. ఏ విధమైన చీడలు, పీడలు సోకవు. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరతాయి.

 

Exit mobile version