రావి లేని ఊరు, వేపలేని వీధి ఉండకూడదనేది పెద్దలు చెప్పే మాట. మన పూర్వీకులు ఈ చెట్లకు అంత ప్రాధాన్యత ఇచ్చారు. భారతదేశంలో రావిచెట్టు పవిత్రంగా పరిగణించబడుతుంది. హిందువులు, బౌద్ధులు, జైనులు, ఈ వృక్షాన్ని ఎంతో పవిత్రంగా పూజిస్తారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేను వృక్షముల్లో అశ్వద్ధ వృక్షమునని చెప్పుకున్నాడు. బుద్ధుడికి రావి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. అందుకే ఈ వృక్షాన్ని బోది వృక్షమని పిలుస్తారు. భారతీయ సంప్రదాయంలో రావి చెట్టుకు అంతటి ప్రాధాన్యముంది. అయితే రావి చెట్టు పవిత్రతోపాటు తనలో ఎన్నో రకాల ఆయుర్వేద సుగుణాలను ఇముడ్చుకుంది.
రావి చెట్టులోని ప్రతి భాగం ఎన్నో ఆయుర్వేద గుణాల సమాహారం. రావి చెట్టు నుంచి వచ్చే గాలి ఎంతో శ్రేష్టమైనది. దీని ఆకుల నుంచి ప్రాణవాయువు వస్తుంది. ఈ గాలిని పీల్చితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే వీధుల్లో, దేవాలయాల ప్రాంగణాల్లో రావి చెట్టును పెంచుతారు. పైగా రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది.
ఇది ఆక్సిజన్‌ను విడుదల చేయడమే కాకుండా చాలా ముఖ్యమైన ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. రక్తంలో చక్కెర స్థాయిలు, మలబద్ధకం మరియు ఉబ్బసం వంటి సమస్యలను అడ్డుకునేందుకు రావిచెట్టు యొక్క వివిధ భాగాలైన వేర్లు, బెరడు, కాండం బెరడు, మూలాలు, ఆకులు మరియు పండ్లు ఉపయోగించబడతాయి. రావి చెట్టు పండ్లు తింటే జీర్ణశక్తి పెరిగి మలబద్దక సమస్య దూరమవుతుంది.
రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఓ వైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే.. మరోవైపు దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు. డయాబెటిస్ నివారణకు రావిచెట్టు ఆకులు ఎంతగానో ఉపయోగపడుతాయి. రావి చెట్టు బెరడు మరియు వేరులలో ఉండే β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో కూడా సహాయపడుతుందని పరిశోధనలలో తేలింది. రావి చెట్టు ఆకులను తీసుకుని పొడిచేసి రెండు గ్లాసుల నీటిలో ఓ స్పూన్ పొడిని వాడాలి. ఆ నీటిని బాగా మరిగించి.. వడగట్టాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే… డయాబెటిస్ చాలా వరకూ నయం అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.
చర్మ వ్యాధుల నివారించేందుకు రావిచెట్టు ఉపయోగపడుతుంది. లేపనం రూపంలో రావి ఆకు సారాన్ని గాయంపై రాస్తే గాయం నయం చేయడంలో సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా తామరకు సంబంధించిన మంటను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. రావి చెట్టు వివిధ భాగాలలో ఉండే ఇథనాలిక్ సారాలు స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టైఫి వంటి అనేక బాక్టీరియాలకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి. రావి చెట్టు బెరడు మరియు పండ్లలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యడంలో కూడా సహాయపడతాయి.
రావి చెట్టు యొక్క అన్ని భాగాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఒక పరిశోధన ప్రకారం రావి చెట్టులో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని కూడా తెలిసింది. అంతేకాక అవి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి. రావి బెరడు శ్లేష్మ కణాలు లేదా ఇతర శరీర కణజాలాలను సంకోచించడం ద్వారా విరేచనాల లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రావి బెరడు యొక్క ఎండిన పొడిని దాని అలెర్జీ నిరోధకశక్తి కారణంగా శ్వాసకోశ సమస్యలను అడ్డుకోవడంలో ఉపయోగిస్తారు.
ఆస్తమా తగ్గాలంటే.. రావి ఆకు, పండ్లు, బెరడును విడివిడిగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. వీటిని సమాన పరిమాణంలో కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు వాడితే, ఆస్తమా సమస్య తగ్గుతుంది. రావి ఆకు పొడిని మూడు గ్రాములు తీసుకొని, నీటిలో కలిపి రోజుకు రెండుసార్లు తాగినా చక్కగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
పరిశోధనల ప్రకారం రావిచెట్టు బెరడు సారాలు యాంటీబాడీ ప్రతిచర్యలు/ప్రతి స్పందనలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయని కూడా తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని బాగా మెరుగుపరుస్తుంది. రావి చెట్టు బెరడు యొక్క మేథనోలిక్ సారాలలో శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరేస్ అనే ఎంజైమ్ ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అసిటైల్ కోలిన్ యొక్క బ్రేక్ డౌన్ కి అవసరం అవుతుంది. రావి చెట్టు సారాలకు ఉన్న ఈ లక్షణం అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో బాగా ఉపయోగపడుతుంది.
రావి పుల్లలతో దంతాలు తోముకుంటే దంతాలు గట్టిపడి దంగ సమస్యలు తగ్గుతాయి. రావి చిగుళ్లను పాలలో ఉడికించి వడకట్టి తాగితే మెదడు చైతన్యమై చురుగ్గా పనిచేస్తుంది. దీని పండ్లను తింటే గుండె సంబంధ వ్యాధులు నయమవుతాయి. రావి పళ్లను నీడలో ఎండబెట్టి చూర్ణం చేసుకుని దానికి సరిసమానంగా పటిక బెల్లం కలిపి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శృంగార సామర్ధ్యం పెరగడంతోపాటు వీర్యం వృద్ధి అవుతుంది. సంతానం కలగని స్త్రీలు ఈ మిశ్రమాన్ని బహిష్టి అయిన నాల్గవ రోజు నుంచి 14 రోజులపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.