ముఖ్యమైన దేవతా మూర్తులలో సరస్వతిదేవి చదువుల తల్లిగా ఆరాధింపబడుతుంది. ఈ దేవి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మ దేవుని భార్యా సరస్వతీ దేవి చదువుల తల్లి ఈ ఆమ్మవారి వాహనం హంస, నెమలి. వేదాలు, పురాణాలలో విపులంగా సరస్వతీ దేవి గురించి ప్రస్తావించబడింది. సరస్వతీ దేవి, పేరుతో సరస్వతీ నది కుడా ఉంది. అక్షరాలకు ఆధిదేవత, సకల విద్యల రాణి, జ్ఞాన ప్రదాయిని- సరస్వతీదేవి. ఆ వాగ్బుద్ధి వికాస స్వరూపిణి. మానవజాతి మనుగడకు, అక్షయ సంపదకు మూలమైన ప్రణవ స్వరూపిణి సరస్వతి. ఆమె జ్ఞానానంద శక్తిగా, వేదజ్ఞాన మాతృకగా వెలుగొందుతోంది. గాయత్రిగా, లౌకిక-అలౌకిక విజ్ఞాన ప్రదాతగా భాసిస్తోంది. పరిపూర్ణ అనుగ్రహంతో స్వరాన్ని, వరాన్ని ఆ దేవి ప్రసాదిస్తోంది.
విజ్ఞాన నిధులు అనేకం. వాటిలో ప్రతిభ, మేధ, శ్రద్ధ, స్ఫురణ, ధారణ ఉంటాయి. చైతన్యం, కళా నైపుణ్యం, జ్ఞాన రహస్యం, సంస్కారం సైతం నెలకొంటాయి. వాటితో పాటు సత్కీర్తి, తర్కం, వ్యాకరణం, మీమాంస, వ్యాఖ్యానం, భాష్యం. ఇలా విభిన్న రీతుల్లో సాగిపోతుంటాయి. అన్ని విజ్ఞాన నిధులూ ఆ చల్లని తల్లి కటాక్ష వీక్షణ ఫలితాలే! శుంభ, నిశుంభులను సంహరించిన వీర నారి ఆమె. మహా సరస్వతిగానే కాదు- సిద్ధ, నీల, ధారణ, అంతరిక్ష సరస్వతిగా ఆ దేవికి అనేక రూపాలున్నాయని ‘మంత్ర శాస్త్రం’ చెబుతోంది.
పూర్వకాలంలో ఒక సారి సనత్కుమారుడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని గురించి విపులంగా తెలుపమని కోరాడు. అప్పుడు బ్రహ్మ శ్రీకృష్ణుని సూచన మేరకు సరస్వతిని స్తుతించి బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఆ తరువాత ఆయన బ్రహ్మజ్ఞాన సిద్ధాంతం చేసి సనత్కుమారుడికి చెప్పాడు. పూర్వం భూదేవి అనంతుడిని తనకు జ్ఞానాన్ని ఉపదేశించమని కోరింది. అనంతుడు కష్యపుతి ఆజ్ఞతో పలుకుల తల్లిని స్తుతించాడు. ఆ తరువాతనే అనంతుడు నిర్మలమైన జ్ఞానాన్ని సిద్ధాంతీకరించి భూమాతకు చెప్పగలిగాడు. పూర్వం వ్యాస భగవానుడు పురాణ సూత్రాలను గురించి వాల్మీకిని అడిగాడు. వాల్మీకి జగదంబ సరస్వతిని స్మరించాడు. అలా ఆయన సరస్వతీదేవి దయను పొంది పురాణసూత్ర జ్ఞానాన్ని పొందాడు.
వ్యాసుడు కూడా వంద సంవత్సరాలపాటు పుష్కర తీర్థంలో సరస్వతి గురించి తపస్సు చేసి వరాన్ని పొంది సత్కవీంద్రుడు అయ్యాడు. తరువాతనే ఆయన వేదం విభాగాన్ని, పురాణ రచనను చేశాడు. ఒకసారి ఇంద్రుడు తనకు తత్వజ్ఞానాన్ని ఉపదేశించమని శివుడిని ప్రార్థించగా శివుడు కూడా దివ్యవాణిని తలచుకొని ఆ శక్తి ప్రభావంతో ఇంద్రుడికి జ్ఞానోపదేశం చేశాడట. ఆ ఇంద్రుడే బృహస్పతి దగ్గరికి వెళ్ళి శబ్ద శాస్త్రాన్ని చెప్పమన్నాడు. అప్పుడు బృహస్పతి వెంటనే పుష్కర క్షేత్రానికి వెళ్ళి వేయి దివ్య సంవత్సరాల పాటు వాగ్దేవిని ధ్యానించి ఆ తల్లి కరుణాకటాక్షాలతో శబ్దశాస్త్రం పొందగలిగాడు.
అలాగే పొరపాటున గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్క మహర్షి తాను చదువుకున్న చదువంతా కోల్పోయాడు. అప్పుడు ఆయన శోకార్తుడై పుణ్యప్రతమైన సూర్యస్థానానికి వెళ్ళి సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యుడు ప్రత్యక్షమై ఆ మహర్షి భక్తికి మెచ్చి వేదంవేదాంగాలను చదివించాడు. కానీ జ్ఞాపకశక్తి లేని యాజ్ఞవల్క్యుడిని చూసి సూర్య భగవానుడు సరస్వతీ స్తోత్రాన్ని భక్తితో నిరంతరం పఠించమని తెలిపాడు. యాజ్ఞవల్క్య మహర్షి భక్తితో సరస్వతీ స్తుతిని క్రమం తప్పకుండా స్తుతించాడు. ఆ స్తుతిలో తాను గురుశాపం వల్ల విద్యాహీనుడుగా అయినట్లు, జ్ఞాపకశక్తిని కోల్పోయినట్లు చెప్పాడు. తన మీద దయచూపి జ్ఞాన, జ్ఞాపక శక్తులను ప్రసాదించమని, విద్యను చక్కగా శిష్యులకు భోధించే శక్తిని, గ్రంథరచనా శక్తి, ప్రతిభగల శిష్యులను తనకు ప్రసాదించమని సరస్వతీదేవిని ప్రార్థించాడు. సత్సభలలో మంచి విచారణ శక్తిని, సత్య స్వరూపిణి, వ్యాఖ్యాన రూపిణి, వ్యాక్యాదిష్టాతృరూపిణి అయిన సరస్వతీదేవిని పదేపదే స్తుతించడంతో ఆ మాత యాజ్ఞవల్క్య మహర్షిని మళ్ళీ సంపూర్ణ జ్ఞానవంతుడిగా, సుకవిగా వెలుగొందమని ఆశీర్వదించింది. ఇలా సకల దేవతలు, మునులు, ఋషులు సరస్వతి దేవిని ఆరాధించిన వారే.