Home Unknown facts లక్ష్మీదేవి జననం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు

లక్ష్మీదేవి జననం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు

0

“లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగాధామేశ్వరీం
దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురామ్
శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్రగంగాధరం
త్వాం త్రైలోక కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్”

ప్రతీ దేవుడికి, దేవతకు వారి పుట్టుక వెనుక ఏదో ఒక ప్రాముఖ్యత, బలమైన కారణాలు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే హిందువులు అందరూ ఎంతో ఇష్టపడి, అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే లక్ష్మీ దేవి పుట్టుక వెనుక కూడా ఓ కథ ఉంది. లక్ష్మీ దేవికి ఆ పేరు లక్ష్య అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది. అష్ట ఐశ్వర్యాలకు, సిరి సంపదలకు, విజయానికి లక్ష్మీ దేవీ పెట్టింది పేరు. లక్ష్మీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు, సుఖశాంతులతో పాటు చేసే పనిలో విజయం వరిస్తుందని పురాణేతి హాసాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో జన్మించిందని పురాణాలు తెలుపుతున్నాయి.

Surprising Things Behind The Birth Of Lakshmideviస్వాయంభువ మన్వంతరంలో – భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం.
సార్వోచిష మన్వంతరంలో – అగ్ని నుండి అవతరణ.
జౌత్తమ మన్వంతరంలో – జలరాశి నుండీ,
తామస మన్వంతరంలో – భూమి నుండీ,
రైవత మన్వంతరంలో – బిల్వవృక్షం నుండీ,
చాక్షుష మన్వంతరంలో – సహస్రదళ పద్మం నుండీ,
వైవస్వత మన్వంతరంలో క్షీర సాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది.

స్వాయంభువ మన్వతరం :

భృగుమహర్షి, ఖ్యాతిలకు పుత్రసంతానం ఉన్నప్పటికీ కుమార్తెలు కూడా కావాలనే కోరిక అమితంగా ఉండడంతో, భర్త అనుమతితో ఖ్యాతి పుత్రికను ప్రసాదించమని దేవీని ప్రార్ధిస్తూ తపస్సు చేసింది. ఆ తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రసాదించిన వరం చేత భృగుమహర్షి దంపతులకు పుత్రికగా లక్ష్మీదేవి జన్మించింది.

ఇది ఇలా ఉండగా, దక్షప్రజాపతి స్తన ప్రదేశం నుంచి ఉద్భవించినవాడు ధర్ముడు. ఈ ధర్ముడనే ప్రజాపతి భార్యల్లో ఒకరైన సాధ్య వల్ల నలుగురు పుత్రసంతానం కలగగా, ఆ సంతానంలో ఒకరు నారాయణుడు. నారాయణుడు తన సోదరులైన నరుడు, హరి, కృష్ణులతో కలిసి తపస్సు చేస్తుండగా, ఆ తపస్సును భంగం చేయడానికి అప్సరసలు రాగా, నారాయణుడు తన విశ్వరూపాన్ని చూపడంతో వారు (అప్సరసలు) వెళ్ళిపోయారు. ఇది విన్న భృగుమహర్షికుమార్తె లక్ష్మీదేవి నారాయణుడే తన భర్త కావాలని తపస్సు చేసింది. అది మెచ్చిన నారాయణుడు ప్రత్యక్షమై, ఆమె కోరిక ప్రకారం తన విశ్వరూపాన్ని చూపించి, వివాహానికి సిద్ధం కాగా, దేవేంద్రుడు మధ్యవర్తిగా, ధర్ముడు పురోహితుడిగా కళ్యాణం జరిపించినట్లుగా విష్ణుపురాణ కధనం. ఇదొక్కటే అమ్మవారు గర్భం నుండి జన్మించిన మన్వంతరం.

వైవస్వత మన్వంతరం :

పూర్వం ఒకసారి దుర్వాసమహాముని కల్పవృక్షమాలను దేవేంద్రునికి బహుకరించగా, దేవేంద్రుడు ఆ మాలను తనవాహనమైన ఏనుగుకు వేసాడు. ఆ ఏనుగు ఆ మాలను క్రిందపడవేసి కాళ్ళతో తొక్కి ముక్కలు చేయగా, ఇది చూసిన దుర్వాసుడు కోపోద్రిక్తుడై – ‘నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక’ అని శపించాడు.

శాపఫలితంగా స్వర్గలోక ఐశ్వర్యం నశించగా, రాక్షసులు దండయాత్ర చేసి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు. దేవేంద్రాదులు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలు మొరపెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు ఇంద్రాది దేవతలను వెంటబెట్టుకొని విష్ణువు దగ్గరికి వెళ్ళి వివరించగా, అమృతాన్ని స్వీకరించి బలాన్ని పొంది రాక్షసులను ఓడించవచ్చని, అందుకోసం క్షీరసాగరాన్ని మధించాలని విష్ణువు సలహా ఇవ్వగా, దేవతలకొక్కరికి క్షీరసాగరాన్ని మధించడం సాధ్యం కాదు కాబట్టి రాక్షసుల సహాయాన్ని తీసుకొని అందుకు సిద్ధమయ్యారు.

మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని త్రాడుగా చేసుకొని చిలుకుతుండగా, మందరగిరి పట్టుతప్పి మునిగిపోతున్న తరుణంలో శ్రీకూర్మమై తన మూపుపై పర్వతాన్ని నిలుపుకొని, ఇక క్షీరసాగరమధనం కొనసాగించమని ఆనతిచ్చిన ఆర్తత్రాణపరాయణుడు “శ్రీ మహావిష్ణువు”.క్షీరసాగర మధనం జరిగినప్పుడు ముందుగా ఉద్భవించిన హాలాహలాన్ని లోకశ్రేయస్సు కోసం ‘శివుడు’ స్వీకరించి ‘నీలకంఠుడు’ కాగా, లోకకల్యాణం కోసం, భర్తను విషం మింగమన్న పార్వతీదేవి ‘సర్వమంగళ’ గా ప్రసిద్ధి పొందారు. ఈ ఘటన మాఘబహుళ చతుర్దశినాటి రాత్రి జరిగింది. విషాన్ని హరించి, శివుడు లోకానికి మంగళం కల్గించినందున, ఈ దినం “శివరాత్రి” అయింది. ఇదే రోజున శివలింగ ఆవిర్భావం జరిగినట్లు, అందుచేత ఈ దినం శివరాత్రి పర్వదినం అయినట్లు లింగపురాణం ద్వారా తెలుస్తుంది.

ఆ తర్వాత మళ్ళీ కొనసాగిన సముద్రమధనంలో ‘సురభి’ అనే కామదేనువు జన్మించగా ఋషులు యజ్ఞకర్మల నిమిత్తం దీనిని స్వీకరించారు. తర్వాత ‘ఉఛ్వైశ్రవం’ అనే తెల్లని అశ్వం జన్మించగా దానిని బలి స్వీకరించాడు. ఆ తరువాత ఐరావతం, కల్పవృక్షం మొదలగునవి జన్మించగా ఇంద్రుడు వాటిని స్వీకరించాడు. అనంతరం క్షీరాబ్ధి నుంచి శ్రీ మహాలక్ష్మి ఉద్భవించింది. ఆ శుభదినం ఉత్తరపల్గునీ నక్షత్రంతో వున్న పాల్గుణ శుద్ధపూర్ణిమ.

ఈ శుభదినం లక్ష్మీదేవి ఉద్భవంతో పాటు పరిణయం కూడా జరిగినరోజు. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే తనకి తగిన వరుడెవ్వరా అని అందర్నీ చూస్తూ, సకలసద్గుణవంతుడు, అచ్యుతుడు, ప్రేమైక హృదయుడు, ఆర్తత్రాణ పరాయణుడు విశ్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును చూసి, పుష్పమాలను విష్ణువు మెడలో వేసి, వరించింది.

లక్ష్మీదేవి విష్ణువు వక్షస్థలాన్నే తన నివాసంగా చేసుకుంది. లక్ష్మి అనుగ్రహమంటే సిరిసంపదలే కాదు, ఆమె అనుగ్రహం ప్రధానంగా ఎనిమిదిరకాలుగా ఉంటుంది. అవి – ధనం, ధాన్యం, గృహం, సంతానం, సౌభాగ్యం, ధైర్యం, విజయం, మోక్షం!శుచి శుభ్రతలను పాటిస్తూ, భక్తిశ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాదిస్తే ఆమె అనుగ్రహం పొందగలం. తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతోనే సిరిసంపదలతో పాటు కీర్తి, మతి, ద్యుతి, పుష్టి, సమృద్ధి, తుష్టి, స్మృతి, బలం, మేధా, శ్రద్ధ, ఆరోగ్యం, జయం ఇత్యాదివి లభిస్తాయి.

Exit mobile version