Home Unknown facts ఆంజనేయుడు మాత్రమే చేయగలిగిన పనులు ఏమిటి?

ఆంజనేయుడు మాత్రమే చేయగలిగిన పనులు ఏమిటి?

0

రామాయణం అంటే, రాముడు ఎంత సుపరిచయమో హనుమంతుడు కూడా అంతే గొప్పదనాన్ని కలిగి ఉన్నాడని లోకవిదితం. అలాంటి హనుమంతుని కథలు వినడం, లేదా చదవడం ద్వారా మానసిక ధైర్యo, ఆత్మ విశ్వాసం పెంపొందడానికి సహాయపడుతుంది. రాముని బంటుగా ఆంజనేయుడు అపజేయమన్నదే లేకుండా విరాజిల్లాడు. అటువంటి ధీశాలి, శివుడి అవతారమైన హనుమంతుడు మాత్రమే చేయగల కొన్ని విషయాలు ఉన్నాయని అనేక లేఖనాలు పేర్కొన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. సముద్రాన్ని సైతం అవలీలగా దాటడం:

Interesting Facts About Hanumaహనుమంతుడు, అంగధుడు, జాంబవంతుడు తదితరులు, సీతా దేవిని వెతికే క్రమంలో సముద్రం వద్దకు వచ్చారు. వారు సముద్రం యొక్క తీవ్ర రూపాన్ని, పరిమాణాన్ని చూసి ఆలోచనలో పడ్డారు. వీరిలో ఏ ఒక్కరికీ సముద్రాన్ని దాటడానికి ధైర్యం చాలలేదు. కానీ హనుమంతుని శక్తి యుక్తులపై నమ్మకం ఉన్న జాంబవంతుడు, హనుమంతుడు మాత్రమే సముద్రాన్ని దాటి వెళ్లి, తిరిగిరాగల సమర్దునిగా సూచించాడు. మొదట్లో తన సామర్ధ్యం మీద తనకే నమ్మకం లేని హనుమంతుడు, జాంబవంతుడు వంటి పెద్దల ప్రోత్సాహంతో సముద్రాన్ని సైతం దాటగలిగి, సీత జాడను కనిపెట్టగలిగాడు.

2. సీతా దేవి ఆచూకీ తెలపడం:

హనుమంతుడు సీతాదేవిని అన్వేషిస్తూ లంకను చేరినప్పుడు, రావణ సామ్రాజ్యానికి కాపలా కాస్తున్న రాక్షసి లంకిణీతో తలపడవలసి వచ్చింది. హనుమంతుడు దైవ బలాన్ని కలిగి ఉండడం చేత, లంకిణీ తలవంచక తప్పలేదు. హనుమంతుడు తప్ప ఎవరు కూడా అప్పటి వరకు ఆమెను ఓడించలేకపోయారు. ఈ పోరాటంలో హనుమంతుడు, తన మానసిక మరియు శారీరక బలాన్ని సరైన స్థాయిలలో ఉపయోగించి లంకిణీని ఓడించాడు. ఓటమిని అంగీకరించిన లంకిణీ, సీతాదేవి ఆచూకీని చెప్పగా, అశోకవనంలో సీతాదేవిని గుర్తించడం జరిగింది.

3. అక్షయ కుమారుని సంహరించడం:

శ్రీరాముడు ఇచ్చిన సందేశాన్ని సీతాదేవికి చేరవేసిన తర్వాత, హనుమంతుడు లంకలోని అనేక ప్రాంతాలను నాశనం చేశాడు. రావణుడు తన కుమారుడు అక్షయ కుమారుని పరిస్థితిని చక్కబెట్టేందుకు పంపగా, హనుమంతుడు అక్షయ కుమారుని హత్య గావించాడు. అది క్రమంగా రాజ్యంలో ఉద్రిక్తలకు కారణమైంది. ఇంద్రజిత్తు సహాయంతో హనుమంతుని తన సభకు పిలిపించి, తోకను ముట్టించగా, అక్కడనుండి వెళ్ళిన హనుమంతుడు చివరకు లంక మొత్తాన్ని దహనం చేసాడు. రాముడి పరాక్రమాలను అతనికి పరిచయం చేయడానికే హనుమంతుడు ఈ చర్యకు ఒడిగట్టాడు.

4. సంజీవని పర్వతాన్ని తీసుకుని రావడం:

శ్రీరామ, రావణ సైన్యానికి మధ్య యుద్ధం జరిగే సమయంలో, రావణాసురుని కుమారుడు ఇంద్రజిత్ లక్ష్మణునిపై బ్రహ్మస్త్రాన్ని ప్రయోగించగా, లక్ష్మణుడు స్పృహతప్పి పడిపోవడం జరుగుతుంది. దీనికి సంజీవని మొక్క మాత్రమే పరిష్కారమని తెలియడంతో, హిమాలయాలలో సంజీవని గుర్తించడం కష్టసాధ్యమవడంతో పర్వతాన్నే పెకలించుకుని తీసుకుని వచ్చాడు హనుమంతుడు. ఈ పని ఆంజనేయుడు తప్ప ఏ ఇతరులూ చేయలేరు.

5. రావణుని కూడా ఓడించిన హనుమ:

యుద్ధ సమయంలో హనుమంతుడు దుమ్రాక్ష్, అంక్పన్, దేవాంతక్, త్రిసుర, నికుక్భ్ వంటి అనేకమంది రాక్షసులను సంహరించాడు. ఈక్రమంలో హనుమంతుడు, రావణునికి మద్య కూడా భీకరయుద్ధం జరిగింది. రావణుని ఓడించిన హనుమంతుడు, చంపకుండా విడిచిపెట్టాడు. దీనికి కారణం, రావణాసురుడు రాముడి చేతిలో మాత్రమే సంహరించబడాలన్న ఆలోచన. హనుమంతుడు అంత యుక్తి కలవాడని ఇంతకన్నా ఋజువేముంటుంది.

అంతటి అఘటిత ఘటనా చతురుడు, అతి వీర పరాక్రముడు అయినందువలనే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా హనుమంతుడు అంటే ఒక ధైర్యం అనే నమ్మకాన్ని ప్రజలు కలిగి ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా, ఒక్కసారి హనుమంతుని తలచుకోవడం మూలంగా మానసిక ధైర్యాన్ని పెంచుకుని, పరిస్థితులను అధిగమించే శక్తిని పొందగలరని భక్తుల నమ్మకం.

 

Exit mobile version