Home Unknown facts పుష్పగిరి ఆలయ సముదాయం వెనుక ఉన్న పురాణ కథ

పుష్పగిరి ఆలయ సముదాయం వెనుక ఉన్న పురాణ కథ

0

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో పురాతన శైవ క్షేత్రాలు ఉన్నాయి. అత్యంత వైభవోపేతమైన వైష్ణవాలయాలు కూడా ఉన్నాయి. ఒక్కో ఆలయానిది ఒక్కో ప్రత్యేకత. అయితే శివుడు, విష్ణువు కలిసి పూజలందుకునే క్షేత్రాలు చాలా అరుదు. అటువంటిదే పుష్పగిరి గిరి ఆలయం. ఈ ఆలయ విశిష్టత ఏంటో చూద్దాం.

Pushpagiri Templeకడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క మార్గంలో వెళితే పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంటుంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని ‘మధ్య అహోబిలం’ అనీ, శైవులు దీనిని ‘మధ్య కైలాసం’ అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం. పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీ క్షేత్రమంటారు. శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

పరీక్షిత్తు వంశాన్ని నిర్విర్యం చెయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశం పై పుష్పగిరి కొండ పై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు.

పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి. వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపుకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్టించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

పుష్పగిరి ఆలయ సముదాయం చరిత్ర పురాతనమైనది. దీని గురించి స్కందపురాణంలో మొదట పేర్కొన్నారు. ఆతరువాత ఇక్ష్వాకుల శిలాశాశనాలలో పుష్పగిరిని ‘శ్రీశైలమల్లికార్జున జ్యోతిర్లింగ క్షేత్రానికి దక్షిణ ద్వారము’ గా పేర్కొన్నారు. కరికాలచోళుని కాలంలో ఈ స్థలం అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పేర్కొనబడింది. పుష్పగిరి ఆలయ సముదాయం మరియు దాని చుట్టుప్రక్కల ఉన్న ఆకర్షణలను గమనిస్తే దేవాలయ సముదాయం ఇంచుమించు 7.5 చ.కి.మీ. ల దూరంలో వ్యాపించి ఉంది. ఈ సముదాయం చుట్టూ కళకళలాడే పంటపొలాలు, పెన్నా నది ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. ఇక్కడి పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది. ప్రతి ఏడాది ఏప్రియల్ 15 నుండి 24 వరకు దేవాలయంలో బ్రహ్మోత్సవాలను జరుపుతారు. ఆ సమయంలో శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామి, వైద్యనాదేశ్వరస్వామి వార్లను అలంకరించి అంగరంగ వైభవంగా ఊరేగిస్తారు. బ్రహ్మోత్సవాల సమయంలో జాతర జరుగుతుంది.

పుష్పగిరి గ్రామానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడప వసతి సదుపాయాలకు అన్ని విధాలా అనుకూలం. ఇక్కడ అనేక హోటళ్ళు, లాడ్జీలు కలవు. కనుక పర్యాటకులకు కడప సౌకర్యవంతంగా ఉంటుంది. పుష్పగిరి కడప జిల్లా కేంద్రమైన కడప నుండి 16 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి చేరుకోవటానికి పట్టణం నుండి జీపులు, ఆటో రిక్షాలు వెలుతాయి.

 

Exit mobile version