ఎవరికైనా పదే పదే ఇబ్బందులు ఎదురవుతుంటే ఏలినాటి శని ప్రభావం అంటారు. ఇంతకీ శని దేవుడు ఎందుకు ఇబ్బందుల పాలు చేస్తాడు? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం. శని గ్రహం అంటే అందరికీ చెప్పలేని భయం. శని క్రూరుడనీ, కనికరం లేనివాడనీ, మనుషుల్ని పట్టుకుని పీడిస్తాడనీ అనుకుంటారు. కానీ ఈ అభిప్రాయం సరికాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. శనిదేవుడు మహా శివభక్తుడు.
జనానాం కర్మఫలోం గ్రహరూప జనార్దనః-వారి వారి కర్మానుసారం, ప్రజలకు వారికి తగ్గ ఫలాన్నిచ్చే వాడు జనార్దనుడు. ఆయనే మహావిష్ణువు. ఆయన గ్రహాల ద్వారా ఆయా ఫలాల్ని ప్రజలకు అనుగ్రహిస్తుంటాడు. అయితే ఎవరు ఎలాంటి కర్మలు చేశారు.. వారికి లభించవలసిన కర్మఫలం ఏ రూపంలో ఉండాలి అని నిర్ణయించేందుకు జనార్దనుడు ప్రధానమైన ఏడు గ్రహాలతో కలిసి ఒక న్యాయస్థానాన్ని ఏర్పరచాడట. ఆ కోర్టుకు అధ్యక్షుడే శనిదేవుడు.
ఆ న్యాయస్థానం నిర్ణయించే కర్మఫలాన్ని అందజేసే బాధ్యత శనిదేవుడిదే. అందుకే తమకేం చెడు జరిగినా, ప్రజలు ముందు శనిని తిట్టుకుంటారు. శనీశ్వరుడి న్యాయస్థానంలో అందరూ ఒక్కటే. మనం చేసే మంచిపనులే మనకు శ్రీరామరక్ష. ఒక వ్యక్తి జన్మరాశి చక్రంలో చంద్రుడికి ముందు, పన్నెండో ఇంట, లగ్నంలో చంద్రుడితో, చంద్రుడికి తరువాత రెండో ఇంట శని ఉంటే ఆ వ్యక్తికి ఏలిననాటి శని ఆరంభమైనట్టే లెక్క.
శని ప్రభావం రెండున్నర సంవత్సరాల వంతున మూడుసార్లు, మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలం ఉంటుంది. దానాలు, ధర్మాలు, సత్కార్యాలు సత్కాలక్షేపాలు చేస్తే శని ఆ వ్యక్తికి మేలే చేస్తాడు కానీ చేసిన తప్పులకు వారి కర్మ ఫలం అనుభవించక తప్పదు.