వరుణ భగవానుడు వర్షాలు కురిపిస్తాడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఆయన గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయి. పచ్చని వర్ణంలో ఉండి, బంగారు కత్తి ధరించి పాముతో తయారయిన ‘ఉచ్చు’ లేదా ‘పాశం’ ఒక చేత పట్టుకుని, మొసలి మీద కూర్చుని స్వారీ చేస్తూ దర్శనమిస్తాడు, ఆయనే వరుణుడు. వేద కాలంలో వరుణ భగవానుని ఆకాశానికి, నీటికి అధిపతిగా కొలిచేవారు. సృష్టిని నాశనం చేసే అంశాల కంటే అభివృద్ధి చేసే అంశాలే వరుణుడిలో ఎక్కువ.
వేదాల ప్రకారం… వరుణుడు స్వర్గాన్ని, భూమిని, గాలిని సృష్టించాడు. వానలు కురవడానికి, నదులు ప్రవహించడానికి, గాలి వీచడానికి ఈయనే కారకుడు. ఆకాశంలో బంగారు భవంతిలో కూర్చుని, భగవంతుడు చేసే సృష్టిని వీక్షిస్తాడు. న్యాయానికీ, నిజాయితికి మూలాధారం. పడమటి దిక్కుకు అధిపతి. ఈయన దగ్గర నాగులు ఉంటాయి. ఈయనకు దక్షిణాన యముడు, ఉత్తరాన కుబేరుడు ఉంటారు. వీరిద్దరి సాన్నిహిత్యంతో ఈ లోకంలో జీవులు సంపదలతో బతుకుతున్నారు, అదేవిధంగా లోకాన్ని విడిచిపోతున్నారు. అలాగే వరుణుడికి ఒక పక్క వాయవ్యం, ఒకపక్క నైఋతి మూలలు ఉంటాయి. వరుణుడు…. కోపం, దయ రెండురకాల స్వభావాలను ప్రదర్శించగలడు.
తప్పు పనులు చేసేవారిని వరుణుడు ‘వల’ వేసి పట్టుకుంటాడని, ఆకాశంలో ఉండే నక్షత్రాలు వరుణుడికి ఉండే వెయ్యి కళ్లనీ, వీటి సహాయంతో వరుణుడు నిరంతరం మనుషుల ప్రతి కదలికను రహస్యంగా గమనిస్తూ ఉంటాడని వేదాలు చెబుతున్నాయి. ప్రజలు సాయంసంధ్యలో చేసే సంధ్యావందనంలో వరుణ భగవానుని ఉద్దేశించి, తాము చేసిన తప్పులను క్షమించమని కోరుకుంటారు. నీటిలో మునిగిపోయినవారిని కూడా సంరక్షించి, వారికి అమరత్వాన్ని ప్రసాదించే వానిగా పూజలందుకున్నాడు.
పునర్జన్మ ఉన్న మానవులు మరణించాక ఫలితాలను అనుభవించడానికి చంద్రలోకానికి వెళ్లి అక్కడి నుంచి ద్యు (ఆకాశం) లోకానికి వెళతారు. అక్కడి నుంచి పర్జ్యనుడిని చేరతారు. అక్కడి నుంచి వర్షం సహాయంతో భూమికి సస్యరూపంలో వచ్చి, పంటలలో ఉండే ఆహారంలో ‘జీవం’గా మారుతారు.
ఆ జీవం పురుషుడిలోకి ప్రవేశించి, అక్కడ నుంచి స్త్రీలోకి ప్రవేశించి శిశువు రూపంలో భూమి మీదకు వస్తుందని వేదం చెబుతోంది. నిరాకారంగా ఉన్న ఆ జీవిని మనకు అందచేస్తున్న వరుణుడు సంతాన ప్రదాత.