పురాతన ఆలయాలకు, ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. మన దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన హిందూ దేవాలయాలు అన్ని రాష్ట్రాల్లోనూ మనకు దర్శనం ఇస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఆలయాలను ఎక్కువగా చూడవచ్చు. రాజుల కాలంలో నిర్మించబడి ఇప్పటికీ చెక్కు చెదరకుండా అద్భుత శిల్పకలలతో ఈ ఆలయాలు వెలిసాయి. అంతటి చరిత్ర కలిగిన ఆలయాల్లో ఈ శ్రీ గోలింగేశ్వర ఆలయం ఒకటి. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో బిరుదాంకపురంగా పేరు గాంచి ఉన్న దేవాలయం.
పచ్చటి ప్రకృతి రమణీయత నడుమ, పంట పొలాల మధ్య ఈ ఆలయం వెలసింది. ఈ ఆలయాన్ని సందర్శించినంతటే భక్తుల కోరికలు తీరుతాయని చాలా మంది భక్తులు చెపుతుంటారు. అసలు ఈ ఆలయం ఎప్పుడు వెలసింది ఈ ఆలయ విశేషాలు చూసేద్దాం.
పూర్వ కాలంలో బిరుదాంకుడు అనే రాజు కానేటి కోటలో వుండి ఈ ప్రాంతాన్నంతా పరిపాలించేవాడు. ప్రస్తుతం ఈ కోట పూర్తిగా శిథిలమైపోయింది.ఇప్పుడు మిగిలివున్నది ఆకోటలోని మహాలక్ష్మి అమ్మవారి గుడి మాత్రమే. బిరుదాంక మహారాజు పాలనలో బిరుదాంకపురం బిక్కవోలులో 118 దేవాలయాలు నిర్మించి 118 చెరువులు త్రవ్వించాడు. శ్రీ గోలింగేశ్వరస్వామి మొదట బిరుదాంకపురంలో మంద బయలు భూమిలో కప్పబడి వుండేది. గ్రామంలో ఉన్న ఓ రైతు యొక్క ఆవు ప్రతి రోజు తన పాలు ఈ లింగాకారం వున్న ప్రదేశములో కార్చి వెళ్ళిపోయేది. ఆవు పాలు ఇవ్వకపోవడంతో రైతు అనుమానంతో తన పాలికాపుని ఆవుని కంటకనిపెట్టి వుండమని చెప్పాడు.
పాలికాపు ప్రతి రోజులాగే ఆవుల మందలో ఆవును వదిలాడు. తర్వాత పాలికాపు ఆ ఆవుని గమనించాడు అక్కడక్కడ మేత వేస్తూ తిన్నగా లింగాకారంవున్న ప్రదేశానికి వచ్చి అక్కడ పాలుకార్చిన తరువాత మేత మేస్తూ ప్రక్కలకు పోయింది. అది చూసిన పాలికాపు ఆ ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆవు కార్చిన పాలు ఉన్నాయి. ఆవులకాపరి సాయంకాలం దూడలను తిరిగి ఇండ్లకు తోలుకొచ్చి వాటి స్థానాల్లో వాటిని కట్టేసి తన రైతుకు జరిగింది అంతా చెప్పాడు. రైతు ఈ విషయాన్ని గ్రామంలో ఉన్న వారికి చెప్పాడు. గ్రామస్థులు అంతా పాలుకార్చిన ప్రదేశానికి వెళ్ళి, అక్కడ పాలు కట్టిన చిన్నమడుగుని చూశారు. దానితో పాలు మడుగుకట్టిన భూమిలోపల ఏ దేవుడో, దేవతో ఉండవచ్చు అనీ భావించి గ్రామస్తులంతా మంచి ముహూర్తంలో అక్కడ త్రవ్వారు అక్కడ పానమట్టంతో సహా లింగం బయటపడింది.
బిరుదాంక మహారాజు గుడి కట్టించడానికి ముందుకొచ్చి పునాదులు త్రవ్వుతుంటే ఆ పునాదుల్లో పుట్టబయటపడింది. దాన్ని త్రవ్వితే కొద్ది మరోపుట్ట పుట్టింది. అలా ఎన్ని సార్లు త్రవ్వినా పుట్టపుట్టుకొస్తూనే వుంది ఆ పుట్టను అలాగే వుంచి తిరిగి పునాదులు త్రవ్వుతుండగా కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి విగ్రహం బయటపడింది. మొదట బయల్పడిన లింగాన్ని శ్రీ గోలింగేశ్వర స్వామి అని పిలిచారు.
భారతదేశంలో కుమార సుబ్రమణ్యేశ్వర స్వామి వారి విగ్రహాలు రెండుచోట్ల మాత్రమే ఉన్నాయి. ఒకటి దక్షిణ దేశంలో ‘ఫలణి’లోను రెండవది బిరుదాంకపురంగాలో వెలిశారు. ఈ ఆలయం చక్కటి శిల్పకలలతో కట్టించబడింది. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విశేషాలు ఏవంటే ఆలయ గోడలపై ఎన్నో రచనుల చెక్కి ఉంటాయి. ఇవి సాక్షాత్ ఈ పరమశివుడు వెలసిన గర్భగుడి లో భక్తులకు దర్శనం ఇస్తుంటాయి. ఈ ఆలయంలో శివ పార్వతుల శిల్పం, కూర్చొని ఉన్న వినాయకుని ప్రతిమ రెండూ శిల్ప కళా నైపుణ్యానికి ప్రతీకలు. ప్రతి సంవత్సరం షష్టి రోజు నుండి అయిదు రోజుల పాటు గ్రామస్థులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.