Home Unknown facts ఆలయ గోపురం గురించి ఆసక్తికరమైన విషయాలు

ఆలయ గోపురం గురించి ఆసక్తికరమైన విషయాలు

0

భగవంతుడు సదా నివాసముండే చోటే ఆలయం. అక్కడ సకలదేవతలు కొలువుంటారని భక్తుల నమ్మకం. ఆలయం లేని ఊరిలో క్షణం కూడా ఉండరాదంటున్నాయి మన ఆగమాలు. ఆలయానికి అంత ప్రాముఖ్యత ఉంది మరి. ఆలయంలోని ప్రతి భాగంలోనూ అనేక విశేషాలు ఉన్నాయి. వాటికి కొందరు అధిదేవతలు కూడా ఉన్నారు. ఆలయానికి వెళ్లే ప్రతి భక్తుడు ఆలయాన్ని, ఆలయ భాగాలనూ సాకల్యంగా తెలుసుకోవడం వలన మరింత ఆధ్యాత్మికత అలవడి భగవదనుగ్రహాన్ని పొందగలుగుతాడు.

ఆలయ గోపురంఉదాహరణకు గోపురం, ధ్వజస్తంభం, బలిపీఠం, వాహన మండపం, రంగమండపం, పరివారదేవతలు, కోష్ఠదేవతలు, శిఖరం, విమానం ఇలా అనేక భాగాలున్నాయి. వాటిలో ముందుగా ఆలయ గోపురం గురించి తెలుసుకుందాం.ఆలయంలోని అణువణువునా భగవంతుని ఉనికిని గుర్తించాలి. అయితే, ఆలయం అనగానే ముందుగా గుర్తుకొచ్చేది గోపురం. చాలా ఎత్తుగా, అనేక అంతస్తులతో, అనేక శిల్పాలతో, చూడగానే భక్తుడికి ఒక పవిత్ర భావాన్ని కల్పించి, మరికాసేపట్లో దేవుడిని దర్శనం చేసుకుంటామనే ఆనందాన్ని కలిగిస్తుంది గోపురం.

గోపురాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఆలయానికి తొలివాకిలి గోపురం. దీనికే ద్వారశాల అనే పేరు కూడా ఉంది. ద్వారం పైన నిర్మించే నిర్మాణం కనుక ఇది ద్వారశాల. మరికొందరు గాలిగోపురం అని చెబుతుంటారు. గోపురం లోపలికి రాగానే వాతావరణం ఎంత వేడిగా ఉన్నా చల్లటిగాలి వీస్తుంది. బహుశా అందువలన అందరూ ఇలా అంటారని భావించవచ్చు.

కానీ నిజానికి ఆలయంలోని ప్రతిభాగం భగవంతుని శరీరభాగంగా కీర్తిస్తున్నాయి ఆగమాలు. అలా గోపురం భగవంతుని పాదాలుగా కీర్తించబడుతున్నాయి. కాలిగోపురం కాలక్రమేణా గాలిగోపురం అయిపోయింది. మనం ప్రయాణాలలో ఉన్నప్పుడు దూరంగా ఆలయం ఉనికిని తెలిపేది ఆలయగోపురమే. అలా గోపురం కనిపించిన వెంటనే చాలా మంది నమస్కారం చేస్తారు. ఆ నమస్కారం భగవంతునికి తప్పక చేరుతుందని పెద్దలు చెబుతారు.

ఎందుకంటే, గోపురానికి నమస్కరిస్తే భగవంతుని పాదాలకు నమస్కరించినట్లే. గోపురం ఒక నిర్మాణం మాత్రమే కాదు. అది పౌరాణిక విజ్ఞానాన్ని తెలిపే పాఠశాల. గోపురంపై అనేక పురాణ ఘట్టాలు శిల్పాలుగా నయనానందకరంగా చెక్కబడి ఉంటాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తే పురాణాల్లో మనకు తెలియని ఎన్నో ముఖ్య ఘట్టాల గురించి తెలుస్తుంది.

 

Exit mobile version