చాలామందికి అరచేతులకు తరచుగా చెమటలు పడుతూ ఉంటాయి. చల్లటి వాతావరణంలో కూడా అరచేతులకు చెమట పట్టడం చూస్తూ ఉంటాం. ఇలా ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? సాధారణంగా శరీరానికి సంబంధించిన ఎలాంటి సమస్యలైన చేతుల్ని బట్టి అంచనా వేస్తారు వైద్యులు. వీటి రంగు, చర్మం తీరును బట్టి శరీరంలోని కొన్ని రకాల వ్యాధులను అంచనా వేయవచ్చు. మరి అరచేతులు ఎందుకు చెమటలు పడుతాయో తెలుసుకుందాం.
సమస్య చేతుల్లోనే అయితే దాన్ని పామర్ హైపర్ హిడ్రోసిస్ అంటారు. కొంతమందికి ఈ సమస్య దానంతకు అదే తగ్గిపోతుంది. మరి కొందరికి చికిత్స అవసరం. మీ సమస్యకు కారణాలు, దాని తీవ్రతను బట్టి మీకందించే చికిత్స ఆధారపడి వుంటుంది. కొంతమందికి ఇంజేక్షన్లతో, మరి కొందరికి శస్త్ర చికిత్సతో తగ్గవచ్చు.కొంతమందికి అరచేతుల్లో చెమటలు పడుతూనే ఉంటాయి. తుడుచుకున్న కొద్దిసేపటికే మరలా చేతులు తడిగా ఉంటాయి.
అలా జరిగితే వారు ఒత్తిడికి గురవుతున్నారాని అర్థం చేసుకోవచ్చు. లేదా జీవక్రియ రేటుని ప్రేరేపించే ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ విడుదలయినప్పుడు కూడా అరచేతులు చెమటపడుతాయి. ఈ రెండు సమస్యలు దీనికి కారణం కాకుండా ప్రతిరోజూ ఇలానే అరచేతులు చెమట పడుతుంటే మాత్ర తప్పనిసరిగా డాక్టర్‌ను సంప్రది సలహా తీసుకోవాలి.
వృద్దుల్లో ఎక్కువగా చేతులు వణకడం చూస్తుంటాం. వయసు మీద పడితే చేతులు వణుకుతాయి అనుకుంటే పొరపాటే. కెఫిన్ ఎక్కువగా తీసుకునే వారికి చేతులు వణుకుతుంటాయి. వీరు మాత్రమే కాదు ఆందోళనలో ఉండేవారికి, ఆస్తమా వ్యాధి కలిగిన వారికి అప్పుడప్పుడు చేతులు వణకడం గమనించవచ్చు. మానసిక రోగాలకు సంబంధించిన మందులు వాడేవారిలో ఈ రకమైన సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నరాల బలహీనత ఉండేవారిలోనూ ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. చేతులు వణుకుతున్నప్పుడు వారి అరచేతులకు చెమట పడుతుంటుంది.
చేతివేళ్లపై నీలిరంగులో కనిపిస్తున్నా, మచ్చలు ఉన్నా రక్తప్రసరణ సరిగ్గా జరుగడం లేదని అర్థం. దీన్నే రేనూడ్ సిండ్రోమ్ అంటారు. ఇది అంత ప్రమాదకరమైనదేమీ కాదు. కానీ, దీనివల్ల చేతివేళ్లు, అరికాళ్లు ఎరుపు, నీలం, తెలుపు రంగులోకి మారుతాయి. అప్పుడు మంటతో పాటు దురద కూడా పుడుతుంది. అంతేకాదు దీనివల్ల అప్పుడప్పుడు జ్వరం కూడా వస్తుంది.
ఇక మహిళల్లో చాలామందికి పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపునొప్పి వస్తుంటుంది. ఆ సమయంలో శరీరమంతా చెమటలు పట్టడంతో పాటు కళ్లు తిరుగుతాయి. చుట్టూ ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. అంతా కమ్మేసినట్టు ఉంటుంది. అరచేతులు చెమటపట్టడంతో మరింత ఆందోళనకు గురవుతుంటారు. అలాంటి పరిస్థితుల్లో కొబ్బరినీళ్లుగాని, స్రైట్‌గాని తాగితే కొంతమేరకు కోలుకుంటారు.