Home Unknown facts రాక్షస సంహారిణి అవనాక్షమ్మ అవతార రహస్యం ఏంటో తెలుసా?

రాక్షస సంహారిణి అవనాక్షమ్మ అవతార రహస్యం ఏంటో తెలుసా?

0

ఆమ్నాం అంటే వేదమనీ, అక్షి అంటే కన్నులు అనీ అర్థం. వేదాలను కన్నులుగా ఉన్న అమ్మవారు కాబట్టి ఆ తల్లికి ఆమ్నాయాక్షి అనే పేరువచ్చింది. ఆ పేరే కాలక్రమంలో అవనాక్షమ్మగా మారింది. మరి ఈ అమ్మవారు ఎలా వెలిశారు? ఈ అమ్మవారిని ఎవరు కులదైవంగా భావిస్తారు? ఈ ఆలయానికి సంబంధించిన స్థల పురాణం విషయాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

vedhanaluఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా, నారాయణపురం గ్రామానికి కొంత దూరంలో అరుణానది సమీపంలో అవనాక్షమ్మ ఆలయం ఉంది. ఈ అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకుంటున్నారు. ఈ తల్లి ఆకాశరాజుల కులదైవం అని చెబుతారు. ఈ అమ్మవారి విగ్రహం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ ఆలయంలో రాక్షస సంహారిణిగా అమ్మవారు దర్శనమిస్తారు. యుద్ధంలో కత్తిడాలు ధరించిన రాక్షసుని కుత్తికపై కాలుంచి వాడిని సంహరిస్తున్న ఈ శక్తి స్వరూపిణి రుద్రమూర్తిగా దర్శనం ఇస్తుంది.

ఇక పురాణవిషయానికి వస్తే, పూర్వం సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వేదాలు తస్కరించాడట. అప్పుడు పార్వతీదేవీ అతణ్ణి సంహరించి వాటిని బ్రహ్మకి అప్పగించి నారాయణవనంలో ఆమ్నాయాక్షిగా వెలసింది. అందుకే ఈ అమ్మవారిని వేదాలను పరిరక్షించి వెలసిన అమ్మవారిగా కొలుస్తారు.

ఇది ఇలా ఉంటె ఈ ఆలయానికి సంబంధించి మరొక కథ ఉంది, లక్ష్మీదేవి అవతారంగా చెప్పే పద్మావతీ దేవి తండ్రి ఆకాశరాజు. వాళ్ల కులదేవతే అవనాక్షమ్మ. అప్పట్లో ఆకాశరాజు కోట ముందుభాగంలో ఆలయం ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఆకాశరాజు ఎక్కడికైనా వెళ్లేముందు తప్పకుండా అమ్మవారిని దర్శించుకునేవాడట. ఆయనకు చాలాకాలం వరకూ పిల్లలు పుట్టలేదు. సంతానం కోసం అమ్మవారికి ఎన్నో పూజలు చేశాడట. ఫలితంగా పద్మావతీదేవి జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. పద్మావతీదేవి తండ్రితో సహా రోజూ ఆలయానికి వచ్చి అమ్మవారికి పూజలు చేసేదట. నారాయణవనంలోని ఉద్యానవనంలో ఓరోజు శ్రీనివాసుణ్ణి చూసి మోహించింది పద్మావతి. ఆ శ్రీనివాసుణ్ణే తనకు భర్తను చేయమని అవనాక్షమ్మను కోరుకుందట. శ్రీనివాసుడు, పద్మావతిలకు పెళ్లి నిశ్చయమయ్యాక వాళ్లిద్దరూ ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. పద్మావతి ఈ ఆలయంలో గౌరీవ్రతం చేసిందని చెబుతారు. ఇక వివాహం తరువాత వాళ్లిద్దరూ తిరుమలకు వెళ్తూ అమ్మవారిని దర్శించుకున్నారని స్థల పురాణం.

ఈ అమ్మవారు పది హస్తాలు కలిగి ఉండి, అభయ వరద హస్తాలుగా క్రింది చేతులుంటాయి. మిగిలిన ఎనిమిది హస్తాలతో వివిధ రకాలైన ఆయుధాలు ధరించి ఉంటుంది. ఇలా ఈ ఆలయంలో వెలసిన అమ్మవారికి పూజలు చేస్తే పెళ్లి కానీ వారికీ పెళ్లి జరుగుతుందని, పిల్లలు లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.

ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో 18 రోజుల పాటు జరిగే జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version