భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో కాశి నగరం ఒకటి. మహా శివుడు కొలువైన ఈ నగరానికి దేశ విదేశాల నుండి భక్తులు తరలివస్తుంటారు. అయితే కాశి నగరానికి ఏ మాత్రం తీసిపోకుండా ప్రతికాశి అని పిలువబడే శివుడి క్షేత్రం ఒకటి ఉంది. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? దానిని ప్రతికాశి అని ఎందుకు పిలుస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్న మహారాష్ట్రకు చెందిన నందుర్బార్ జిల్లాలో కేదారేశ్వరాలయం ఉంది. అయితే తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలంలో ఈ ఆలయం నెలకొని ఉంది. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ప్రతికాశీని నిత్యం సందర్శిస్తూ ఉంటారు.పురాణ విషయానికి వస్తే, ఒకప్పుడు పగలు ఆరునెలలు, రాత్రి ఆరునెలలుగా కాలం నడిచేదట. ఆ కాలంలో శివుడు ఓ భక్తునికి కలలో కనిపించి, ఒకే రాత్రి 108 దేవాలయాలు నిర్మించే ప్రాంతంలో తాను నెలకొని ఉంటానని చెప్పాడట. అందుకనే 108 ఆలయాలను ఒకే చోట నిర్మించడానికి తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలాన్ని పూర్వీకులు ఎంపిక చేశారట. తర్వాత శివ భక్తులు ఒకే రాత్రిలో 107 ఆలయాలను కట్టారట. మరునాడు ఉదయానికి 108వ ఆలయం నిర్మించబడింది. అందుకే సూర్య కాంతి కిరణాలు నేరుగా పడిన ఈ 108వ ఆలయానికి ప్రకాశ అని పేరు స్థిరపడింది. మొత్తంమీద 108 ఆలయాలు నిర్మించబడిన తర్వాత కాశిలో నెలకొన్న శివుడు అప్పటినుంచి కాశీ విశ్వేశ్వరుడి రూపంలో ఉండిపోయాడు.ఇక్కడి ఆలయంలో కాశీ విశ్వేశ్వరుడు, కేదారేశ్వరుడు ఒకే ఆలయంలో ఉంటారు. అంతేకాకుండా ఇక్కటి పుష్పదంతేశ్వరాలయానికి తనదైన ప్రాముఖ్యత ఉంది. ఇది కాశీలో లేదు.
అయితే కాశీని సందర్శించిన తర్వాత పుష్పదంతేశ్వరాలయానికి వచ్చి ఉత్తర పూజలు జరపకపోతే వారికి పుణ్యలోకాలు ప్రాప్తించవు అని ఇక్కడి వారి నమ్మకం. ఇంకా కేదారేశ్వరాలయం ముందు దీపస్తంభం ఉంటుంది. ఈ ఆలయం సమీపంలో అస్థికలను సమాధి చేసేందుకు, నదిలో వదిలి పెట్టేందుకు నది పక్కన గట్లు ఉన్నాయి. తపతి, పులుంద, గోమై నదుల సంగమస్థలంలో 108 ఆలయాలు ఉండటం కారణంగా దీనికి ప్రతికాశి అని పేరు వచ్చింది.