Home Unknown facts కాంగడా లోయలో అమ్మవారు ఎలా వెలిశారు? ఆలయ చరిత్ర ఏంటి ?

కాంగడా లోయలో అమ్మవారు ఎలా వెలిశారు? ఆలయ చరిత్ర ఏంటి ?

0

కాంగడా లోయలో ఉన్న అతి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. అయితే ఇక్కడ వెలసిన అమ్మవారికి ఒక చరిత్ర అనేది ఉంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిశారు? ఇక్కడ వెలసిన ఆ అమ్మవారు ఎవరనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Chamunda Deviహిమాచల్ ప్రదేశ్ లోని కాంగడా లోయలో పాలంపూర్ కు వాయువ్యంగా సుమారు 17 కి.మీ. దూరంలో చాముండా అనే గ్రామంలో చాముండా దేవి ఆలయం ఉంది. ఇక్కడ వెలసిన చాముండా దేవిని నవదుర్గలలో ఒకరిగా స్థానికులు భావిస్తారు. ఈ ఆలయం ఒక విశాలమైన ప్రాంగణంలో ఉంది. ప్రాంగణం మొత్తానికి బయట ప్రహరీ గోడ, పెద్ద ప్రవేశ ద్వారం దాటి లోపలకి వెళితే, కుడివైపున ఆలయం లోపలకి ప్రవేశ ద్వారం ఉంది.

ఈ ఆలయం మొత్తం మూడు అంతస్థులతో ఒక భవనంలాగా ఉంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ముఖ మండపము, చివర ఒక గదిలా ఉన్న గర్భాలయం ఉంది. గర్భగుడి పై భాగాన ఒక చిన్న విమానము, దానిపైగా పొడుగాటి కలశము ఉన్నాయి.

ఈ ఆలయంలోని అమ్మవారు కొబ్బరిబొండం ఆకారంలో ఉండే శిలామూర్తిగా భక్తులకి దర్శనమిస్తుంది. ఆ శిలా ప్రతిమ మీదనే కళ్ళు, కను బొమ్మలు నోరు మొదలగు ముఖం ఆకారం ఒక రూపు ఏర్పరచి అలంకరణ చేస్తారు.

ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే, ఇక్కడ వెలసిన అమ్మవారు చండ – ముండ అనే ఇద్దరు రాక్షసులను సంహరించిన కారణంగా ఈమెకు చాముండా అనే పేరు ఏర్పడిందని స్థల పురాణం. అయితే ఈ అమ్మవారు చండిక అనే పేరుతో అవతరించిన పార్వతీదేవి అంశ అని కొన్ని పురాణాలలో తెలియచేయబడింది. కానీ వివిధ ప్రదేశాలలో, పలు విధాలా పేర్లతో ఉన్న శక్తి రూపాలను గురించి పురాణాలలో మనకి వేరువేరుగా కథనాలు చెప్పబడ్డాయి.

ఈ ప్రాంతంలోని చండి ఉపాసకులు బల్లెములతో వచ్చి అమ్మవారిని పూజిస్తారు. ఈ ఆలయం రెండు గ్రామాల స్మశానముల మధ్య ఉన్నది. అమ్మవారు స్వామివారు రాత్రులందు ఈ శ్మశానంలో సంచరిస్తారని స్థానికులు నమ్ముతారు. చాముండా ఆలయానికి అనుకోని ఒక కోనేరు ఉంది. ఈ కోనేటి మధ్యలో సరస్వతీదేవి, పరమశివుని సిమెంటుతో చేసిన విగ్రహ మూర్తులు, నీటి మట్టానికి పైగా ఉండే పీఠములపైనా అమర్చబడి ఉన్నాయి. ఇక్కడ సంకట మోచన్ అనే పేరుతో పది అడుగుల ఆంజనేయుని విగ్రహం ఉంది.

ఇలా కొండ లోయలో వెలసిన ఈ అమ్మవారు ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.

Exit mobile version