Home Unknown facts ఖ‌డ్గంతో రుద్ర‌రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయ రహస్యం

ఖ‌డ్గంతో రుద్ర‌రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి ఆలయ రహస్యం

0

మన దేశంలో అమ్మవారి ఎంతో అతిపురాతన చరిత్ర కలిగిన అద్భుత ఆలయాలు అనేవి ఉన్నవి. ఇంకా ప్రతి గ్రామంలో గ్రామదేవతలు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే  నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబిక దేవి భక్తులకి దర్శనమిస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

nimishambikaకర్ణాటక రాష్ట్రంలో శ్రీరంగపట్నానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో గంజాం అనే గ్రామంలో నిమిషాంబిక దేవి ఆలయం ఉంది. ఇక్కడ దర్శనమిచ్చే నిమిషాంబిక దేవి పార్వతీదేవి అంశగా చెబుతారు. ఈ ఆలయ గర్భగుడిలోని అమ్మవారు చేతిలో ఖ‌డ్గంతో రుద్ర‌రూపంలో భక్తులకి దర్శనమిస్తుంటారు. ఈ అమ్మవారిని కోరుకుంటే నిమిషంలో ఫలితం ఉంటుందని భక్తుల విశ్వాసం. కృష్ణరాజ ఒడియార్‌ అనే రాజు ఈ ఆలయాన్ని 400 సంవత్సరాల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తుంది.

ఇక పురాణానికి వస్తే,  పూర్వం ఇక్కడ ముక్తకుడు అనే ఒక ఋషి ఉండేవాడు. ఆయన శివుడి అంశ అని చెబుతారు. అయితే ముక్తకుడు లోక కల్యాణార్థం ఒక యాగాన్ని తలపెట్టగా, ఆ యాగం వలన తమకి ముప్పు అని భావించిన రాక్షసులు ఆ యాగాన్ని చెడగొట్టడానికై ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక యాగం జరుగుతుండగా రాక్షసులు అడ్డుకోగా వారిని ఎదిరించడం ముక్తకుడి వలన అవ్వకపోవడంతో పార్వతీదేవి యజ్ఞకుండంలో నుండి ఉద్బవించి ఆ రాక్షసులను అంతం చేసినదట. ఆవిధంగా ఇక్కడ వెలసిన పార్వతిదేవికి నిమిషాంబిక దేవి అనే పేరు వచ్చినది స్థల పురాణం.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, అమ్మవారి విగ్రంతో పాటు శ్రీచక్రాన్ని కూడా ఆరాధిస్తుంటారు. ఇక్కడ శివుడు మౌక్తికేశ్వరునిగా పూజలను అందుకుంటున్నాడు. ఇక ఆలయానికి వచ్చిన భక్తులు అమ్మవారికి గాజులు, దుస్తులను, నిమ్మకాయల దండలను సమర్పిస్తుంటారు. అయితే అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయల దండలను ఇంటికి తీసుకువెళితే శుభం జరుగుతుందని భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో ఉన్న మరొక విశేషం ఏంటంటే, బలిపీఠం మీద అన్నం పెట్టి గంటలను మోగిస్తే ఎక్కడెక్కడి నుండో కాకులు వచ్చి ఆ ఆహారాన్ని స్వీకరిస్తాయి. ఇలా రోజు కాకులకి ఆహారాన్ని పెట్టడాన్ని బలిభోజనం అని పిలుస్తారు.

Exit mobile version