Home Unknown facts నాగదేవుడు దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

నాగదేవుడు దర్శనమిచ్చే ఈ ఆలయాల దర్శనం ఒక అద్భుతం

0

హిందూపురాణాలలో నాగుపాముకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమశివుడు తన మెడలో నాగుపాముని ధరించగా, శ్రీ మహావిష్ణువు సర్ప రాజైన ఐదు తలలు కలిగిన ఆదిశేషువుపై పవళిస్తాడు. ప్రతి సంవత్సరం నాగులచవితి, నాగపంచమి రోజున భక్తులు పూజలు చేస్తుంటారు. మరి మన దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నాగదేవత ఆలయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. సుబ్రహ్మణ్యస్వామి ఆలయం – నాగులమడక 

Subramanya Swamy Templeఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లా, పెనుగొండ వద్ద ఉన్న నాగులమడక అనే గ్రామంలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో ఏడు పడగలు గల నాగేంద్రస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం పడగలు పైకి ఎత్తి ఉండగా శరీరం మూడు చుట్టాలు చుట్టి ఆసన శిలపై కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత అరుదైన శిల్పం అని చెబుతారు. గర్భాలయంలో ఉన్న ఒక వెండి నాగ ప్రతిమను తెచ్చి అన్నం రాశిపైన ఉంచగానే అన్నం రాశి సర్పాకార ఆకృతిగా మారి నివేదనకు గుర్తుగా సంతర్పణకు అనుమతి లభిస్తుంది. ఈ అద్భుతాన్ని ఇప్పటికి చూడవచ్చని చెబుతున్నారు. ఇక ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది, స్వామివారి రథోత్సవంలో బ్రాహ్మణ సంతర్పణ ముగిసాక భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి ఆ ఎంగిలి విస్తరాకుల మీద పొర్లాడి, ఆ తరువాత ఆ విస్తరాకులను తలపైన ధరించి నదిలోకి వెళ్లి మునిగి ఆ తడిబట్టలతోనే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం నేటికీ ఇక్కడ జరుగుతున్న ఒక ఆచారం.

2. ముక్తినాగక్షేత్రం – కర్ణాటక: 

కర్ణాటక రాష్ట్రం, బెంగుళూరు  మైసూర్ హైవే దారిలో ముక్తినాగక్షేత్రం ఉంది. దేశంలో ఉన్న అత్యంత ప్రసిద్దిగాంచిన నాగక్షేత్రాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, ఆలయ గర్భగుడిలో 16 అడుగుల ఎత్తు, 36 టన్నుల బరువు కలిగి ఉండి, ఏడు పడగలతో చుట్ట చుట్టుకొని, ఏకశిలా నాగేంద్రుడి విగ్రహం భక్తులకి దర్శనమిస్తుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద నాగేంద్రుడి విగ్రహం ఇదేనని చెబుతారు. ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజలు నిర్వహిస్తుంటారు. ఇంకా ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులచే ప్రతిష్టించబడిన కొన్ని వందల నాగప్రతిమలు దర్శనమిస్తుంటాయి.

3. నాగదేవత ఆలయం: 

తెలంగాణ రాష్ట్రంలోని, రంగారెడ్డి జిల్లాలోని, తిరుమలగిరిలో శ్రీ నాగదేవత ఆలయం ఉన్నది. గర్భాలయంలో నాగదేవత అమ్మవారు కొలువై ఉన్నారు. అమ్మవారి మూర్తి పంచలోహాలతో నిర్మితమై ఉన్నది. అమ్మవారి మూలస్థానంగా ఈ గర్బాలయాన్ని చెబుతారు. ఈ ఆలయ ప్రాంగణంలో మహాగణపతి సన్నిధి ఉంది. ఆలయ ప్రాగణంలో ఉన్న మంటపంలో వివిధ వర్ణాకృతులు కలిగిన స్తంభాలపై నాగమ్మ, నారాయణస్వామి, జయలక్ష్మి మాత శిల్పాలతో పాటు నాగబంధాలు ఉన్నాయి. ఈ ఆలయంలో తిసంవత్సరం శ్రావణమాసంలో వచ్చే శుక్ల నాగపంచమి మహోత్సవ సందర్భంగా రథోత్సవం నిర్వహిస్తారు.

4. కుక్కే సుబ్రమణ్య ఆలయం – కర్ణాటక:

కర్ణాటక రాష్ట్రానికి పడమటి అంచున ఉన్న పశ్చిమ కనుమలు అనే పర్వతాల వరుసల నడుమ దట్టమైన అడవుల మధ్యలో మారుమూలుగా మంగుళూరు నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో కుక్కే సుబ్రమణ్య ఆలయం ఉంది. నాగలోకానికి అధిపతి అయినా వాసుకి తపస్సుకు మెచ్చి దేవసేనా సమేత సుబ్రమణ్య స్వామి వాసుకిలో ఒక అంశమై నిలిచి, అనంతరం ఇక్కడ ఉన్న గుహలో వెలిశాడని అంటారు. నాగదేవత ఎప్పుడు ఇక్కడి ఆలయంలో కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా నాగదోషం ఉన్నవారు ఎక్కువగా ఈ ఆలయాన్ని సందర్శించి వారి దోషాన్ని పోగొట్టుకుంటారని ప్రతీతి.

5. మన్నార్‌శాల నాగరాజ ఆలయం – కేరళ: 

కేరళ రాష్ట్రంలోని అళప్పుజకి సమీపంలోని మన్నార్‌శాల నాగరాజ ఆలయం ఉంది. ఈ ఆలయంలో పౌరోహిత్యం చేసేవాళ్లంతా స్త్రీలే కావడం విశేషం. ప్రధాన గుడిలో నాగరాజ విగ్రహం కొలువుదీరుతుంది. ఆలయ ప్రాంగణంలోనూ అక్కడ ఉన్న చెట్ల చుట్టూ ఉన్న గట్లుమీదా సుమారు 30 వేల నాగదేవత శిలావిగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో పూజలు చేస్తే సంతానం కలుగుతుందన్నది భక్తుల విశ్వాసం. పిల్లలు పుట్టాక ఆ పిల్లలతో సహా వచ్చి స్వామికి సర్పరూపంలోని విగ్రహాన్ని కానుకగా ఇస్తారు.

6. కుడుపు – కర్ణాటక: 

కర్ణాటక రాష్ట్రం, మంగళూరుకు కొన్ని కిలోమీటర్ల దూరంలో కుడుపు  గ్రామం ఉంది. ఈ గ్రామంలో వెలసిన శ్రీ అనంతపద్మనాభుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే కుడుపు అనగా తుళు భాషలో పాముతో ఉన్న బుట్ట అని అర్ధం. ఈ ఆలయంలో శ్రీ అనంతపద్మనాభుడు పాము ఆకృతిలో, ఐదు తలలతో ఉంటాడు. ఈ ఆలయంలో నాగపంచమి రోజున జరిగే ఉత్సవం చాలా కోలాహలంగా నిర్వహిస్తారు. అయితే ఈ గ్రామస్థులు ఆవు పేడ, ఆవుపాలు ఉపయోగించి ఇంటి గోడలపైన పాముల చిత్రాలు గారు. ఇలా చేయడం వలన పాములు వారిని కాటువేయని వారి నమ్మకం. ఇంకా శ్రావణం ఐదవ రోజున నాగపంచమి సర్పోత్సవ వేడుకలలో ఎడ్లబండ్లని అలంకరించి, శివాలయం దగ్గరికి తీసుకు వెళ్లి పూజిస్తారు. అక్కడే జరిగే ఉత్సవంలో స్త్రీలు నేలపై రకరకాల పాముల ఆకృతుల్ని రంగవల్లులుగా తీర్చిదిద్దుతారు. ఇంకా బంకమట్టితో పాముల్ని తయారు చేసి వాటికీ పసుపు, నలుపు రంగులు వేసి అలంకరణకు పెడతారు.

7. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం – మోపిదేవి:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, కృష్ణాజిల్లా దివిసీమకు చెందిన ఒక మండలం మోపిదేవి. ఇది మచిలీపట్నం నుండి 30 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడే ప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ఉంది. దీనికి మోపిని పురమని సర్పక్షేత్రమని పేరు. కాలక్రమేణా అది మోపిదేవిగా నామాంతరం చెందింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలసిన ఈ ఆలయంలో స్వామివారి పానపట్టం వద్ద ఉన్న ఒక కన్నం లో నుండి సంవత్సరంలో ఒకసారి నాగుపాము బయటికి వచ్చి భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయంలోని స్వామివారికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందని, మ్రొక్కిన మ్రొక్కులు నెరవేర్చే మహత్యం కలదని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలోని గర్భగుడిలో పాము చుట్టలమీద లింగం ఉంటుంది. ఇదే పానమట్టం, స్వామివారికి వేరే పానమట్టం ఉండదు.

8. సర్పదేవాలయం – నాగోబా: 

తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం, కేస్లాపూర్ అనే గ్రామంలో నాగోబా అనే సర్పదేవాలయం ఉంది. నాగోబా దేవత గిరిజనుల ఆరాధ్యదైవంగా పూజలను అందుకుంటుంది. గిరిజనులు కొన్ని వందల సంవత్సరాల క్రితం నుండి సర్పదేవతని ఆరాధిస్తూ సంవత్సరానికి ఒకసారి జరుపుకునే అద్భుత జాతర నాగోబా జాతర. ఈ జాతర గిరిజనులు జరుపుకునే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందింది.

9. నాగచంద్రేశ్వర ఆలయం – ఉజ్జయిని: 

మధ్యప్రదేశ్ రాష్ట్రం లోని ఉజ్జయిని ప్రాంతంలో ఈ ఆలయం కలదు.  ఈ ఆలయంలో పడగ విప్పిన పాముని ఆసనంగా చేసుకొని కూర్చొని ఉన్న శివపార్వతులు భక్తులకి దర్శనంఇస్తుంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రపంచం మొత్తంలో ఎక్కడ లేనివిధంగా శివుడు శయన రూపంలో దర్శనమిస్తుండగా, శివపార్వతులతో పాటు వినాయకుడు కూడా భక్తులు దర్శమిస్తుంటాడు. అయితే శ్రావణ శుక్ల పంచమి అంటే నాగపంచమి రోజు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. సర్పరాజుగా భావించే తక్షుడు నాగపంచమి రోజున ఈ ఆలయంలో ఉంటాడని నమ్మకం.

Exit mobile version