Home Entertainment A Fan’s Tribute To One Of The Most Striking Books That Has...

A Fan’s Tribute To One Of The Most Striking Books That Has Ever Been Written ‘Sasirekha’

0
sasirekha novel

శశిరేఖ… మనలో చాలా మందికి పేరుగానే తెలుసు, ఇంకొంతమందికి మహాభారతం ఇతిహాసం ద్వారా గానీ, లేక మాయాబజార్ సినిమా ద్వారా తెలిసి ఉండవచ్చు. కానీ సాధారణ జనాల్లో చాలా తక్కువ మందికి, పుస్తకాలన్నా, నవలలన్నా ప్రాణం పెట్టే వాళ్ళలో చాలా ఎక్కువ మందికి మాత్రం ‘శశిరేఖ’ ఒక అద్భుతమైన నవల. గుడిపాటి వెంకట చలం అనే వ్యక్తి యొక్క అతీత, అద్వితీయ ఆలోచనల నడుమ ఉద్భవించిన కథ. నిజానికి, స్వేచ్ఛకి ప్రతీక ‘శశిరేఖ’. ఎన్నో ప్రశ్నల, సమాధానాల అమరిక ‘శశిరేఖ’. సరిగ్గా 100 ఏళ్ళ క్రితం, అంటే 1921 లో పురుడు పోసుకుంది ఈ ‘శశిరేఖ’.

నేను ఈ నవల గురించి చాలా చోట్ల విన్నా, కొందరు ‘ఆరెంజ్’ సినిమా ఇందులో అమ్మాయి(శశిరేఖ)ని ఆధారంగా తీసుకొని రాసారు అని, అలానే చలం గారి ‘మైదానం’ మాత్రమే కాకుండా మరో గొప్ప నవల ఉందని, ఇంకా ఏవో కొన్ని కొన్ని విషయాలు. ఏదైతేనేం, మొత్తానికి 2021 లో, అంటే సరిగ్గా వందేళ్ళకి ఈ నవల నా కళ్ళకి చిక్కింది, చేతికి దక్కింది, మెదడుకి ఎక్కింది.

ఈ నవల చదివాక నాకు ఏదో ఒక కథ చదివినట్టు కాకుండా శశిరేఖ అనే అమ్మాయి గురించి చదువుతున్నట్టు అనిపించింది. సంఘ పెద్దల నోట తిట్టించుకున్నా, సమాజం వ్యతిరేకించినా, ఏకంగా బహిష్కరణకే గురైనా కూడా చలం గారి మాటలు, వాక్యాలు మాత్రం ఇప్పటికీ సమాజ సాంప్రదాయాలు గురించి వల్లించే వారికి చురకలు పెడుతూనే ఉంటాయి. శశిరేఖని అర్థం చేసుకొని, ఆ వ్యక్తిత్వాన్ని అంచనా వేసుకొని, అది మనం జీర్ణించుకోవాలంటే చదివితే సరిపోదు, మనసు పెట్టాలి. నిజం చెప్పాలంటే, ఖచ్చితంగా చదివేవాళ్ళు ఆమె మాయలోకి వెళ్ళిపోవడం ఖాయం. అయితే ఒక విషయం చెప్పుకోవాలి, నచ్చనివాళ్ళు తొందరగానే మూసేస్తారు, నచ్చినవాళ్ళు తొందరగానే ముగించేస్తారు, ఎందుకంటే ఒకసారి శశిరేఖతో ప్రయాణం మొదలుపెడితే చివరి వరకు ఆపాలనిపించదు.

శశిరేఖ జీవితంలో ప్రేమ, వాంఛ, కామం, ఇష్టం, స్వేచ్ఛ, బంధనం, భయం, ధైర్యం, కోపం, జాలి, అసహ్యం, ఆదరణ ఇలా ఒక్కటేంటి ఒక మనిషి పరిపూర్ణ జీవితంలో ఉండాల్సిన అన్ని భావోద్వేగాలు కనిపిస్తాయి. అందరి జీవితాల్లో ఉండేవే కదా, ప్రత్యేకత ఏముంది అని మీరు అడగవచ్చు, దానికి నేను చెప్పే సమాధానం, ఒక చిన్న బేధం, అదే ‘తీవ్రత’. ప్రతీ భావోద్వేగం తీవ్రతతో నిండి ఉంటుంది. అనుభవం వయసు వలన రాదు, చుట్టూ ఉన్న పరిస్థితుల తీవ్రత వలన వస్తుంది. అందుకే 50 ఏళ్ళ వ్యక్తికి అర్థంకాని కొన్ని జీవిత సత్యాలు 25 ఏళ్ళ కుర్రాడి నోటి నుండి వినబడతాయి. అలాంటి తీవ్రతే శశిరేఖ జీవితంలో ఉంటుంది. అందుకేనేమో, నాకు 4-5 రోజుల పాటు శశిరేఖ ఆలోనల్లో నుండి పోలేదు.

చదివే చాలామంది ఆమె వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపించచ్చు, తప్పు అనను, కానీ దానికి గల కారణాలు గుర్తించినపుడే అసలు విషయం అర్థమవుతుంది. అయితే నాకు రెండు రకాలు కనిపించాయి, చలం గారు అందరినీ అలా ఉండమని గానీ, ఉంటారని గానీ, అదే నిజం అని గానీ చెప్పారా? లేదా ఆయా కారణాల చేతనే శశిరేఖ ఆలోచనలు అలా ఉన్నాయి అని చెప్పారా? అని. చదివిన ఒక్కొక్కరికి వారి వారి విజ్ఞత బట్టి అర్థం అవుతుంది అనేది మాత్రం వాస్తవం. అసలు ఎందుకు చదవాలి అని అంటే, ప్రేమ, మోహం, సత్యం అనే మూడే మూడు విషయాలు నిష్కల్మషంగా, పుష్కలంగా ఉంటాయి.

ఇక నా వరకు అయితే ముఖ్యంగా మూడు అంశాలు బాగా తలకెక్కేశాయి. అవే, అందం, ప్రేమ, బాల్య వివాహం.

అందం… శశిరేఖ అందాన్ని వర్ణించిన తీరు వర్ణణాతీతం. ఒక అమ్మాయిని చూసి ఇష్టపడటం వేరు, ఒక అమ్మాయి గురించి విని ఇష్టపడటం వేరు, కానీ ఒక అమ్మాయి అందాన్ని తలుచుకుంటూ ఇష్టపడటం ఇక్కడే సాధ్యం. ఆయన వర్ణణలను ఆధారంగా చేసుకొని ఎవరి ఊహాశక్తి ఎంత మనోహరంగా ఉంటే, ఆ శశిరేఖ అంత అందంగా స్ఫురిస్తుంది. ఒక కథలో ఒక పాత్ర అందంగా ఉండటం సహజం, కానీ అందమే పాత్ర పోషిస్తే అది శశిరేఖే అనడంలో అతిశయోక్తి లేదని నాకు అనిపిస్తుంది. శశిరేఖని ప్రేమించినా, ద్వేషించినా, సహించినా, మోహించినా, ఏదైనా చెయ్యండి, మీ భావోద్వేగం ఏమైనా కానివ్వండి, కానీ తన అందాన్ని వివరించలేం, విమర్శించలేం. చివరగా ఆ అందం గురించి ఒక్క మాట, ఆ బ్రహ్మ ఇంతటి అందాన్ని ఈ ఇలపై సృష్టించాడో లేదో గానీ, చలం అనే వ్యక్తి మాత్రం శతాబ్దాలు గడిచినా ఆరాధించే అందాన్ని శశిరేఖ రూపంలో సృష్టించాడు.

ప్రేమ… నిర్వచనం లేని భావన. కానీ ప్రేమ గురించి చలం గారి కలం నుండి కలబడి దూకిన సంభాషణలు ఎంతోమందిని సంభ్రమాశ్చర్యాల ప్రవాహంలోకి నెట్టేస్తాయి. ఒకరి మీద ప్రేమకు గడువు ఉంటుందా? ప్రేమకు గడువు పెట్టలేం కదా! ప్రేమ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎవరి మీద కలుగుతుంది అన్నది మనకు తెలియదు, అలానే ఎప్పుడు , ఎక్కడ, ఎలా, ఎవరి మీద నుండి పోతుందో కూడా మనకు తెలియదు కదా! ప్రేమకి అందంతో పనిలేదు, వ్యక్తిత్వంతో పనిలేదు, ఆస్తితో పనిలేదు, అసలు దేనితోనూ పనిలేదు; ఎందుకుంటే దానికి నియమం, నిష్ఠ, నిజం అనే కొలమానాలు, ప్రమాణాలు అంటూ ఏమీ లేవు, ఉండవు కూడా. ఆకారం లేని అమీబా ప్రేమ, తత్వం లేని సత్యం ప్రేమ, అర్థం చేసుకోలేనంత అపారమైన అద్వైతం ప్రేమ. నిత్య జీవితంలో అబద్దం అనేది మన అవసరం, ఆ అవసరానికి ఈ ప్రేమను కూడా బలి చేసింది ఈ సమాజం, ఇదే చలం చెప్పిన నిజం..

బాల్య వివాహం… ఎందరో మహానుభావులు ఎంతో కష్టపడి, వాళ్ళ జీవితంలోని కొన్నేళ్ళను ఖర్చు చేసి ఈ బాల్య వివాహాలను రూపుమాపారు, ఆ ఉత్తముల వరుసలో ఉద్దండ ప్రేమండితుడైన గుడిపాటి వెంకట చలంను నిలబెట్టడానికి ఎంత మంది సందేహించినా, ఆయన నిస్సందేహంగా కాలు మీద కాలేసుకొని మరీ దర్జాగా కుర్చీలో కూర్చోవచ్చు. చలం గారి మాటలు, బాల్య వివాహం వివేకహీనం అని విమర్శించుకోలేనటువంటి అవివేకుల గూబలు పెళ్ళుపెళ్ళుమని అదిరేలా చరుస్తాయి, భయపడేలా తరుముతాయి, ధైర్యంగా గర్జిస్తాయి, నేరుగా నిందిస్తూ నిలదీస్తాయి. బాల్య వివాహం ఎందరో జీవితాల్ని తారుమారు చేస్తుంది, ఎందరో ఆశలను, ఆశయాలను, ఆలోచనలను చిదిమేస్తుంది. ఏది కావాలో తెలియని వయసులో జీవితానికి సరిపడా మనిషిని ఇచ్చేసి, బ్రతుకుకి బంధనాలు విధిస్తే, అర్థం కాని అర్థవంతమైన అనర్థాలు జరగకమానవు అనేదే చలం మనవి అనేది నా తెలివి.

ఇందులో నా ప్రతీ మాట ‘శశిరేఖ’ ప్రభావం వలనే
, చలం గారి సూటి ప్రశ్నల వలనే ఉద్భవించాయి. మీకేమైనా చెప్పాలనిపించినా చెప్పవచ్చు.

“జై శ్రామిక్”

Exit mobile version