Home Health ప్రయాణంలో వికారం, వాంతులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి

ప్రయాణంలో వికారం, వాంతులు రాకుండా ఉండాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి

0

కొంతమంది ప్రయాణమంటే భయపడిపోతుంటారు. బస్సెక్కగానే తల తిరుగుతున్నట్టు అనిపించడం, వాంతి చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ప్రయాణమంతా ఇలాగే ఉంటే ఎంత చిరాకుగా అనుభవించే వారికే తెలుస్తుంది. మోషన్ సిక్నెస్ (ప్రయాణంలో వికారం, వాంతులు)తో బాధపడేవారిలో ఒళ్లంతా చిరు చెమటలు పట్టడం, తల తిరగడం, వికారం, నోట్లో లాలాజలం ఎక్కువ స్రవించడం, చర్మం పాలిపోయినట్టుగా మారడం, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Motion Sickness Prevention Tipsఈ మోషన్ సిక్నెస్ తక్కువ సమయమే ఉన్నప్పటికీ దాని ప్రభావం మాత్రం బలంగానే ఉంటుంది. మోషన్ సిక్నెస్ రావడానికి ప్రధాన కారణాలు నిద్ర సరిగ్గా లేకపోవడం, గర్భం దాల్చడం, పొగ త్రాగే అలవాటు ఉండటం. అలాగే మైగ్రైన్ సమస్య ఉన్నవారికి కూడా ప్రయాణ సమయంలో వికారంగా అనిపిస్తుంది. అయితే కొన్ని సహజమైన చిట్కాలు పాటించడం ద్వారా ప్రయాణంలో వికారం, వాంతులు రాకుండా చూసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

బస్సు లేదా రైల్లో ఇలా కూర్చోవాలి:

మోషన్ సిక్నెస్ తో బాధపడేవారు తాము ప్రయాణిస్తున్నవాహనం ఏ దిశలో ప్రయాణిస్తుందో.. అదే దిశలో ఉన్న సీట్లలో కూర్చోవాల్సి ఉంటుంది. రైలు, బస్సుల్లో కొన్ని సీట్లు వ్యతిరేక దిశలో ఉంటాయి. అలాగే కిటికీ పక్కన ఉన్న సీట్లలో కూర్చుని తాజా గాలి పీల్చుకుంటూ ఉన్నా వికారం సమస్య రాకుండా ఉంటుంది.

ఖాళీ కడుపుతో ప్రయాణం వద్దు:

ఎలాగూ వాంతులవుతాయి కదా అని చాలామంది ఏమీ తినకుండానే ప్రయాణం చేస్తుంటారు. ఏమీ తినకపోవడం వల్ల నీరసంగా అనిపిస్తుంది. దీనికి తోడు మోషన్ సిక్నెస్ కూడా తోడైతే.. ఆ నీరసం మరింత ఎక్కువ అవుతుంది. కాబట్టి ఏమీ తినకుండా ప్రయాణం మాత్రం చేయద్దు. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే మంచిది.

నిమ్మ:

మీకు మోషన్ సిక్నెస్ ఉంటే నిమ్మకాయను మీ దగ్గర ఉంచుకోండి. అప్పుడప్పుడూ నిమ్మకాయ వాసన చూడటం లేదా నిమ్మ చెక్కను చప్పరించడం ద్వారా వికారం తగ్గించుకోవచ్చు. నిమ్మకున్న ఆమ్లత్వం స్టమక్ యాసిడ్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది. అలాగే నిమ్మకాయ నుంచి వచ్చే వాసన కూడా వికారాన్ని తగ్గిస్తుంది.

అల్లం:

ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు మీ వెంట అల్లం ముక్కను తీసుకెళ్లండి. మీరు బస్సు ఎక్కగానే.. చిన్న అల్లం ముక్కను మీ బుగ్గన పెట్టుకుని దాన్నిరసాన్ని కొంచెం కొంచెంగా పీల్చండి. అల్లంలో ఉన్న జింజరోల్ వికారం తగ్గిస్తుంది.

సోడా:

చల్లటి సోడా(కార్బొనేటెడ్ డ్రింక్) తాగడం ద్వారా మోషన్ సిక్నెస్ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. జింజర్ సోడా, లెమన్ సోడా తాగితే వికారం తగ్గుతుంది. అలాగే కాఫీ, టీ వంటివి తాగకుండా ఉండటమే మంచిది. ఇవి మోషన్ సిక్నెస్ తీవ్రతను మరింతగా పెంచుతాయి.

చామంతి టీ:

చామంతి టీ (Chamomile tea) కూడా ప్రయాణంలో వచ్చే వికారాన్ని తగ్గిస్తుంది. ఇది జీర్ణాశయంలో ఆమ్లాల విడుదలను తగ్గిస్తుంది. అలాగే పొట్ట కండరాలను రిలాక్సయ్యేలా చేస్తుంది.

 

Exit mobile version