Home Life Style 7 Must Read Books Of Yandamoori Veerandranath That Will Lift Your Spirits

7 Must Read Books Of Yandamoori Veerandranath That Will Lift Your Spirits

0

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణుడు. ఇతడు తెలుగులో సుప్రసిద్ధ నవలా రచయిత. యండమూరి గారు వ్రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని నవలలు మీ కోసం…

1) అంతర్ముఖం

Antharamukamముఖం మనిషి మనసుకి ప్రతిరూపం అంటారు. ప్రతీ మనిషికీ రెండు ముఖాలు ఉంటాయి. పైకి కనిపించేది కృత్రిమమైన చిరునవ్వుని పులుముకున్న అందమైన ముఖం. రోజు రోజుకీ కుళ్ళిపోయి వికృత రూపం దాల్చేది లోపలి ముఖం – అదే అంతర్ముఖం. మనిషి యొక్క అంతర సౌందర్యాన్ని చూపించేదే అంతర్ముఖం. యండమూరి వీరేంద్రనాథ్ రాసిన అనేక నవలల్లో ఇది కచ్చితంగా ఎంతో ఎత్తున నిలబడ గల నవల ఇది.

మనిషి బాహ్య ప్రవర్తననీ, అంతర్లీనంగా మనిషిలో జరిగే సంఘర్షణనీ, అతని చుట్టూ అల్లుకున్న బంధాలనీ, ప్రేమ గొప్పతనాన్ని, ప్రేమిస్తున్నావన్న భ్రమలో తమని తమే మోసం చేసుకునే వ్యక్తుల్నీ, నిజాయితీ చచ్చిపొతే మనుషుల మధ్య పెరిగే దూరాలనీ ఇవన్నీ సమగ్రంగా ఒక కథా రూపంలో కూరిస్తే ఆ నవల కచ్చితంగా గుండె లోతుల్ని తాకుతుంది అన్న దానికి నిదర్శనం “అంతర్ముఖం”.

2) వెన్నెల్లో ఆడపిల్ల

వెన్నెల్లో ఆడపిల్ల యండమూరి వీరేంద్రనాథ్ రచించిన ఒక ప్రముఖ నవల. అత్యద్భుతంగా సాగే నవల ఇది.ఒక అందమైన భావాన్ని మది నిండా నింపే రసభరిత నవల. క్లుప్తంగా తన ఫోన్ నెంబర్ కనుక్కోవడానికి ఆమె ఇచ్చిన నెల రోజుల గడువు పుర్తవడానికి సరిగ్గా 118 నిముషాలు మాత్రమే ఉంది. విమానం బయల్దేరటానికి రన్ వే మీద సిద్ధంగా ఉంది. అప్పుడొచ్చింది అతనికి ప్లాష్ లాంటి ఆలోచన.

ఫలితం…?కదుల్తున్న విమానం ఆగిపోయింది. అతడికోసం మైక్ లో ప్రకటనల మీద ప్రకటనలు వినివస్తున్నాయి. అతడు మాత్రం తాపీగా ఫోన్ చేస్తున్నాడు.

మొత్తం టెలిఫోన్ డిపార్టుమెంటంతా వలవేయబడింది. చివరి క్షణంలోనైనా ఆమె (నెంబరు) అతడికి దొరికిందా? ఆక్స్ ఫర్ట్ అమ్మాయికి చదరంగం ఛాంపియన్ కి జరిగిన నాజూకు పోరాటం – చిరు చిరు లెక్కల గిమ్మిక్కుల నుంచి పైథాగరస్ సిద్ధాంతం వరకూ..టెలిఫోన్ డిపార్టుమెంట్ తీరు తెన్నుల బ్యాక్ డ్రాప్ తో….క్షణక్షణం మిమ్మల్ని సన్నెన్స్ లో పెట్టి, పూర్తయ్యాక ఒక మధుర భావాల్ని మీ మనసులో కలకాలం నిలబెట్టే నవల.

3) డేగ రెక్కల చప్పుడు

ఈ కథ విషయానికి వస్తే రామకృష్ణ శాస్త్రి భారత సైన్యంలో పనిచేసిన ఒక మాజీ ఉద్యోగి. నరనరాన దేశభక్తిని జీర్ణించుకున్న అసలు సిసలు సిపాయి. తల్లి తండ్రిని పోగొట్టుకున్న ఇతనికి ఉన్న ఏకైక తోడు ప్రేమించిన అమ్మాయి వైదేహి. అనుకోని పరిస్థితుల్లో అల్-ఖైదా దృష్టి ఇతని మీద పడుతుంది. వాళ్ళకి అవసరమయిన ఒక ఫైల్ కోసం ఇతన్ని ఉపయోగించుకోవాలనుకుంటారు. ఈ విషయం అతనికి ఆఖరి నిమిషంలో తెలుస్తుంది. వాళ్ళు అనుకున్న పని పూర్తి చేసి వాళ్లకి సహాయపడతాడు. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చెయ్యని రామకృష్ణ ఎందుకు ఈ పనిచేసాడు, అతని అసలు mission ఏంటి అన్నది అసలు కథాంశం. ఇందులో మొదటి భాగం అంతా ఆఫ్ఘనిస్తాన్ భౌగోళిక, చారిత్రక నేపథ్యం, తాలిబాన్ల ఆవిర్భావం, ఆఫ్ఘనిస్తాన్ లోని గిరిజన తెగల ఆచార వ్యవహారాలూ,రష్యా-అమెరికాల మధ్య నలిగిపోయిన ఆఫ్ఘన్ పౌరుల హక్కుల గురించి వుంటుంది.

స్వార్థపూరిత రాజకీయ నాయకుల ఎత్తుగడలనీ, మత చాంధస వాదుల మూర్ఖపు ఆలోచనలనీ, సామన్యుల బ్రతుకులని నేల రాస్తున్న ఉగ్రవాద సంస్థల అరాచకత్వాన్నీ, వాటికి కొమ్ము కాచే దేశాధినేతల కుయుక్తులనీ, సమాజంలో పాతుకు పోయిన స్వార్థాన్ని, కరడు గట్టిన మానవత్వాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. రచనా స్వేచ్ఛ ఎక్కువగా తీసుకున్నప్పటికీ నవల మొత్తం చదివాక అవసరమే అనిపిస్తుంది. కొన్ని యథార్థ సంఘటనలు, కొన్ని కల్పితాలు కలగలిపి రాసిన ఈ పుస్తకం ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద కలాపాలకు అద్దం పడుతుంది.

4) చీకట్లో సూర్యుడు

ఈ నవల మొదట ఉదయం (పత్రిక) వారపత్రిక లో వచింది. ఇది యండమూరి వ్రాసిన మొదటి సైన్స్‌ ఫిక్షన్ నవల. భవిష్యత్తులో గ్రహాంతర వాసులతో వచ్చే ఘర్షణ ఈ నవలకు ప్రేరణ. కొంతమంది గ్రహాంతర వాసులు సూర్యుణ్ణి తమ గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తుంటారు. వారి ప్రయత్నాలను శాస్త్రజ్ఞుడైన కథానాయకుడు ఎలా ఆపగలిగాడన్నది ముఖ్య కథాంశం.

భూమికి కొన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న మరో గెలాక్సీలోని ఒక గ్రహం వారు తమ ఇంధన కొరతను తీర్చడానికి సరైన నక్షత్రం కోసం వేటాడుతుంటారు. వారికి మన విశ్వంలో ఉన్న సూర్యుడు తారసపడతాడు. దాన్ని వాళ్ళ అద్భుత సాంకేతిక పటిమతో సరాసరి గ్రహానికి చేరువగా తీసుకెళ్ళాలనుకుంటారు. ఈ పరిస్థితిని ఊహించి భూమ్మీద నుంచి కొంతమంది శాస్త్రవేత్తలను రాయబారం పంపుతారు. వారి వ్యోమ నౌక కాంతి వేగంతో ప్రయాణించి సుదూరంలో ఉన్న గ్రహాన్ని చేరుకుని కార్యాన్ని పూర్తి చేసుకుని తిరిగి కాంతివేగం కంటే ఎక్కువ వేగంతో తిరిగి భూమిని చేరుతుంది. ఈ ప్రయాణంలో వారికి ఎన్నో అవాంతరాలు ఎదురౌతాయి. ఈ ప్రయాణంలో భాగంగా ఓ ప్రేమకథ అంతర్లీనంగా సాగుతుంటుంది.

5) తులసిదళం

తులసి దళం అత్యంత ప్రజాదరణ పొందిన యండమూరి వీరేంద్రనాథ్ నవల. ఆంధ్రభూమి వారపత్రికలో 1980లో సీరియల్‌గా వచ్చింది. తరువాత సినిమాగా కూడా నిర్మించబడింది. ఈ నవల విడుదలైన సమయం నుండి అనేక సార్లు ప్రచురితమై యండమూరి రచనలలోకెల్లా అధికంగా అమ్ముడుపోయిన నవలలో ఒకటి. కన్నడంలో కూడా ఇతోధికంగా జనాదరణ పొందింది.

తులసి అనే పాప ఒక ఆస్తిపరుని కుమార్తె. అతనిపై కక్ష కట్టిన కొందరి కుతంత్రం వల్ల ఆ బిడ్డపై కాష్మోరా అనే దుష్ట శక్తి ప్రయోగమౌతుంది. ఇందులో కాద్రా అనే మాంత్రికుడి పట్టుదల ఉంది. అందువల్ల తీవ్రమైన అనారోగ్యానికి గురైన ఆ పాప రోజురోజుకూ మరణానికి దగ్గరవుతుంది. ఆ బిడ్డను రక్షించుకొనే క్రమంలో నలుగురు మనుషుల ప్రయత్నం ఈ కథలో చాలా పట్టుగా చెప్పబడింది. ఇస్మాయిల్ అనే సాధకుడు చేతబడికి విరుగుబడి చేయిస్తాడు. ఆధునిక ధృక్పథం కల తులసి తండ్రి చేతబడిని నమ్మి అందుకు విరుగుడు చేయించడానికి తంటాలు పడుతాడు. వారి శ్రేయోభిలాషి అబ్రకదబ్ర (అబ్బూరి కేదారేశ్వరరావు) అతనికి సాయపడతాడు. సంప్రదాయాలను నమ్మే తులసి తల్లి, క్రమంగా వైజ్ఞానిక ధృక్పథంలో ఆలోచించసాగింది.

6) నల్లంచు తెల్లచీర

చీరలు… చీరలు…. పిఠాపురం, ధర్మవరం చీరలు. నారాయణపేట నేత చీరలు… అంటూ వీధుల వెంట తిరుగుతూ చీరలమ్ముకునే ఆ కుర్రవాడు బడా వస్త్రవ్యాపారుల వెన్నులో చలిపుట్టించాడు. వస్త్రవ్యాపార ప్రపంచంలో ఎదురులేకుండా దూసుకుపోయాడు. కానీ రవంత జీవన మాధుర్యం కోసం అర్రులు సాచి ప్రత్యర్ధుల వలలో చిక్కుకుపోయాడు.

ధీరుభై అంబానీ జీవితం ఆదరంగా చేసుకొని రాసిన పుస్తకం ఇది…

7) థ్రిల్లర్‌

చిన్నప్పుడు ఇంట్లో – తల్లి – తండ్రి – పనిమనిషి – పెద్దయ్యాక బాస్‌ – ఇంటి యజమాని – అతడికొడుకు – అందరూ తమ స్వార్ధం కోసం తమ జీవిత విధానానికి అనుగుణంగా కొన్ని -రీజనింగ్‌’లు సమకూర్చుకుని ఆమెకి మనష్యులంటే అసహ్యం పుట్టేలా చేశారు. ప్రేమకన్నా పెద్ద స్వార్ధం లేదనే సినికల్‌ భావానికి లోను చేశారు. ఆమె విద్యాధరి. అటువంటి పరిస్థితుల్లో ఆమెకి పరిచయమయ్యాడు ఓ విచిత్రమైన యువకుడు ….. అనుదీప్‌.

ఆమె శరీరం మీదే ఆమెకి తెలియకుండా ప్రేమలేఖ రాసి ప్రజెంట్‌ చేశాడు. ఆమె కోసం, కుడి చేతిని భుజం వరకూ కోసేసుకున్నాడు. ప్రేమకన్నా గొప్ప శక్తి లేదని నిరూపించటం కోసం ప్రపంచం మొత్తం మీద విద్యుచ్ఛక్తి సరఫరాని ఇరవైనాలుగ్గంటల పాటు నిలిపివేశాడు. ఆమె కంగారు పడింది. కంగార్లోంచి ప్రేమ పుడుతుందా ? థ్రిల్లర్‌…. థ్రిల్లర్‌…. థ్రిల్లర్‌…. చదువుతున్నంతసేపూ ఉద్వేగమూ ఉత్కంఠా… చదివాక మనస్సంతా మధురమైన బాధా తియ్యటి వేదనా…. మనుషుల్లోని ప్రేమ రాహిత్యాన్ని ఎత్తి చూపిన నవల మాత్రమే కాదు. ఇది తెలుగులో ‘అబ్సర్డ్‌- రచనలు లేని లోటుని తీర్చిన నవల కూడా.

ఇంకా ఎన్నో జీవితాలు మార్చేశా పుస్తకాలు రాశారు యండమూరి గారు…తెలుగు చదవడం మర్చిపోతున్న తరానికి మళ్ళీ యండమూరి పుస్తకాలు పట్టుకునే సమయం వచ్చింది.

Exit mobile version