మనం గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకున్న తరువాత పంతులు గారు శఠగోపం పెట్టి హారతి ఇస్తారు. తరువాత తీర్థ ప్రసాదాలు ఇస్తారు. అన్ని దేవాలయాల లోను తీర్థం, పూజారి స్వాములు తాము తయారు చేసిన తీర్థం భక్తులకు ఇవ్వడం ఆనవాయితి. ఈ ఆచారం మన పూర్వం నుండి వస్తుంది. కానీ దేవుడే తీర్థం ఇవ్వడం ఎక్కడైనా చూసారా? దేవుడు ఎలా తీర్థం ఇస్తాడు! అని ఆశ్చర్య పోతున్నారా అయితే ఆ తీర్థం విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.
శివుడే ఉత్పన్నం చేసి ఇచ్చే తీర్థం ఇక్కడ ప్రత్యేకం. అది పుచ్చుకోవాలి అన్నా, ఆ తీర్థం శివుడు ఇవ్వాలన్న, మకర సంక్రమణము జరుగవలసిందే. కర్ణాటక లో శివగంగ అనే క్షేత్రం ఉంది. సముద్ర మొత్తానికి 3000 అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడి కొండ. ఈ కొండ తూర్పు నుంచి చూస్తే పడుకున్న నందిలా కనిపిస్తుంది. పడమటి నుంచి చూస్తే కూర్చొన్న వినాయకుడిలా కనిపిస్తుంది. ఉత్తరం నుంచి చూస్తే పెద్ద పాములా, దక్షిణము నుండి లింగాకారంలో కనిపిస్తుంది.
ఈ కొండపైకి చేరడం చాలా కష్టం. ట్రెక్కింగ్ అంటే ఇష్టపడే వారికి ఇది ఒక వరం అనే చెప్పుకోవాలి. అక్కడ ఒక రాతి స్థంభం ఉంటుంది. స్థంభం క్రింద ఒక పాదులో ఒక చిన్న రాతి తొట్టి ఉంటుoది. ఈ తొట్టిలో మకర సంక్రాంతి నాడు, ఉదయాన నలభై ఔన్సుల నీరు ఉద్భవిస్తుంది. ఈ నీటి రహస్యం తెలుసుకోవడానికి ఎంత ప్రయత్నించినా ఇప్పటి వరకు చేధించలేకపోయారు.
సంక్రాంతి రోజు కాకుండా మరెప్పుడు ఇక్కడ నీటి జాడ కూడా ఉండదు. ప్రక్కనే మరో రాతి స్థంభం ఉంటుంది. దాని పై అఖండ జ్యోతిని వెలిగిస్తారు. అక్కడికి కొద్ది సమీపంలో ఒక కొండ బీటలో ఊట బావి ఒకటి ఉంటుంది. దీనినే పాతాళ గంగ అంటారు. వింత ఏమిటంటే వర్షా కాలంలో బాగా వర్షం కురిసే రోజులలో నీరు పొంగే బదులు అడుగంటి పోతుంది. ఎండా కాలంలో మాత్రం మట్టం కంటే పైకి నీరు ఉబుకుతుంటింది. ఈ పవిత్ర ప్రదేశంలో ఉన్న ఆలయం గంగాధరేశ్వరుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది.
ఇక్కడ శివుడి దేవేరి హున్నాదేవి. ఆమెకు అక్కడే ప్రత్యేక దేవాలయం ఉంది. ఈ రెండు ఆలయాలకు ఇటుక, సున్నంతో కట్టిన పెద్ద పెద్ద గోడలు ఉన్నాయి. ఇక్కడ మకర సంక్రాంతి ఉదయాన కొండమీద స్థంభం మొదటి భాగంలో ఉన్న పై తొట్టిలో నీరు ఉద్భవించుకాలాన్ని గంగోత్పత్తి కాలమంటారు. ఆలా ఉద్భవించిన ఆ నీటికి ప్రత్యేక పూజ చేస్తారు. తరువాత మరెప్పుడు ఇక్కడ నీరు ఊరదు.
ఆ నీటిని ఏటా, స్వర్ణ పాత్ర లో పట్టి శివగంగ దేవాలయం నీటితో కలిపి, సగం పాత్ర నీరు, మైసూర్ మహారాజు దర్బారుకు పంపుతారు. మిగిలిన తీర్థం అక్కడికి వచ్చిన భక్తులకు పంచుతారు. మకర సంక్రాంతి రోజు శబరిమలలో శంకరుడి తనయుడు జ్యోతి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తే, శివగంగ లో శివుడు భక్తులకు తీర్థం ఇస్తాడు.
మన దక్షిణ భారతదేశంలో మకర జ్యోతిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు శబరిమలై వెళ్తుంటారు. అదే రోజున శివగంగ లో తీర్థాన్ని స్వీకరించాలని అనుకుంటారు. అందరికి ఈ రెండు సాధ్యం కావు. కొంతమంది పుణ్య భక్తులు ఉదయం ఇక్కడ తీర్థం పుచ్చుకొని, ఆకాశ మార్గాన ప్రయాణించి, పొంన్నంబలమేడు లో హరిహర పుత్రుని జ్యోతి స్వరూపం దర్శించుకుంటారు. వారు కదా పుణ్యాత్ములు. హరుడు, హర పుత్రుని కరుణా కటాక్షాలను నోచుకున్నవారు.
రవాణా సదుపాయం: శివగంగ క్షేత్రానికి వెళ్ళాలంటే కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు జిల్లాకు వెళ్లాల్సిందే పూనా నుండి బెంగుళూరుకు రైలు మార్గం నుండి కొద్ది దూరం మాత్రమే ఉంటుంది.