ఈ ఆలయం కొండ గుహల్లో వెలసింది. పూర్వం ఇక్కడే నవనాథ సిద్దులు ఈ కొండ గుహల్లో సంచరించేవారని స్థానికులు చెబుతారు. మరి ఆ నవనాధాసిద్దులు ఎవరు? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, నిజామాబాద్ జిల్లా, ఆర్మురు మండలంలో ఒక గుట్ట పైన నవనాథ సిద్దేశ్వరాలయం ఉంది. పూర్వం నవనాథ సిద్దేశ్వరులు గోరఖ్ నాథ్, జలంధర్ నాథ్, రపట్ నాథ్, అపభంగ నాథ్, కాన్షి నాథ్, మచ్చింద్ర నాథ్, చౌరంగీ నాథ్, రేవ నాథ్, బర్దారీ నాథ్ ఈ నవనాథ సిద్దేశ్వరులు దేశవ్యాప్త సంచారం చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చి, ఈ వాతావరణానికి ముగులై ఇక్కడే గుట్టపైన తపస్సు చేసుకుంటూ ఉండేవారని తెలియుచున్నది. ఈ కొండపైకి వెళ్లి భక్తులు నవనాథులను ఆరాధించేవారు. ఈ కొండమీద నవనాధులు వెలసిన తరువాత కొండ క్రింద దిగువన ఉన్న గ్రామం వారి పేరు మీదుగానే ఆరు మూడుగా వెలిసిందని తెలుస్తుంది. ఆరు + మూడు అనగా తొమ్మిది అన్న పేరు మీదుగా వెలసిన ఈ గ్రామం తరువాత క్రమంగా అది ఆర్మురుగా పిలువబడుతుంది. ఇక్కడ కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం వాతావరణ ప్రభావం వలన కొన్ని రాళ్ళూ శిలలవలె రూపుదాల్చి, సందర్శకులకు ఎంతగానో ఆకర్షిస్తాయి. అయితే ఈ ఆలయం పక్కనే ఒక జలాశయం ఉన్నది. ఈ జలాశయంలో నీరు దీర్ఘవ్యాదుల్ని నయం చేస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. ఇంకా ఈ గుహాలయం నుండి కొంచం పైకి వెళ్లగా అచట రామాలయం ఒకటి ఉంది. అంతేకాకుండా గుహలో శివాలయం, పురాతన ఏకశిలాస్తంభం, పాలగుండం, జలగుండం, పాతాళగంగ ఉన్నాయి. అయితే ఇక్కడ గుట్టపై నుండి పాతాళగంగ నిరంతరం పడుతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సమయంలో జరిగే ఉత్సవాలలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు.