మన దేశంలో ఉండే అమ్మవారి ఆలయాలు చాల ప్రత్యేకం. అందులో తెలుగు రాష్ట్రాలలో వెలసిన మంగమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ, పోలేరమ్మ, పారమ్మ ఇలా ఎన్నో రకాలుగా వెలసిన అమ్మవారి ఆలయాలకు భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఎందుకంటే కోరిన వరాలను తప్పకుండ ఈ అమ్మవార్లు నెరవేరుస్తారని భక్తుల విశ్వాసం. అలా కోరిన కోర్కెలు నెరవేరుస్తూ కొంగు బంగారమై దట్టమైన అరణ్యంలో ఎల్లప్పుడు నీటి ధారలు ఆలయం పైనుండి పడుతూ రాతి గుహలో వెలసిన ఆలయమే మన ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? అక్కడ అమ్మవారిని గుబ్బల మంగమ్మ తల్లి అనడం వెనుక కారణం ఏంటి? అమ్మవారు అక్కడ ఎలా వెలిశారనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.పచ్చిమగోదావరి మరియు ఖమ్మం జిల్లాల సరిహద్దులలో బుట్టాయగూడెం మండలం కోర్సావారిగూడెం దగ్గరలోని గోగులపూడి గ్రామంలో శ్రీశ్రీశ్రీ మాతృశ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఉంది. అమ్మవారు అరణ్యంలో వెలిశారు కనుక అక్కడి గ్రామీణ గిరిజనులు ఆ తల్లిని వన దేవతగా కొలుస్తారు. ఇక ఆలయ విషయానికి వస్తే, దట్టమైన అరణ్యప్రాంతంలో ఎటు చుసిన ప్రకృతి అందాల నడుమ కొండలు, కోనలు మధ్య ఒక రాతి కొండ మధ్యలో గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో వెలిసింది ఆ తల్లి, అందుకే ఆమెను గుబ్బల మంగమ్మ తల్లిగా పిలుస్తారు. మొదట్లో గిరిజనులకు మాత్రమే తెలిసిన ఈ ఆలయం వారి పూజలందుకుంటూ వస్తూ కొన్ని సంవత్సరాల నుండి తెలుగు రాష్ట్రాల భక్తుల తాకిడి క్రమ క్రమంగా పెరుగుతూ వస్తుంది. ప్రతి ఆదివారం, మంగళవారం పెద్దసంఖ్యలో భక్తులు ఇక్కడకు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఇంకా ఇక్కడి విశేషం ఏంటి అంటే, గుడి పై భాగం నుండి నీటి ధార అనేది ఎల్లప్పుడు పడుతూ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక ఆలయ పురాణానికి వస్తే, బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కరటం కృష్ణమూర్తి అనే అసామికి 32 ఏళ్ల కిందట వెదురు కోసం అడవికి వెళ్లారు. సేకరించిన వెదురుతో, ఎడ్లబండిపై తిరుగు ప్రయాణమవుతుండగా తోవలో బండి తిరగబడింది. బండి తిరగబడిన దాని గురించి ఎంత ఆలోచించిన కృష్ణ మూర్తికి అంతు చిక్కలేదు. ఇక బండి ఎత్తుకొని తిరిగి ఇంటికి చేరుకొని, ఆ రాత్రి నిద్రిస్తున్నప్పుడు మంగమ్మ తల్లి కలలో కనిపించి, అడవిలో సెలయేటి మధ్యనున్న గుబ్బలు గుబ్బలుగా ఉండే రాతి గుహలో తాను కొలువై ఉన్నట్లు చెప్పిందని, వెంటనే ఆ కలలో నుంచి మెళకువలోకి వచ్చిన కృష్ణమూర్తి తెల్లవారు జామునే గ్రామస్థులతో కలసి అడవికి వెళ్లి గుహలో చూడగా మంగమ్మ తల్లి కొలువై ఉంది. ఇలా స్వయంభువుగా వెలసిన అమ్మవారి ఆలయానికి కాల క్రమేణా విశేష ఆదరణ లభించింది. ఈ ఆలయ స్థల పురాణం వెనుక మరొక కథ వెలుగులో ఉంది. ఈ అటవీ ప్రాంతంలో గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలోనే వెలిసినట్లు ప్రతీతి. సీతా రామలక్ష్మణులు వనవాస కాలంలో ఈ అడవిలో గడిపినట్లు చెబుతారు. గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి చేరువలోని పురాతనమైన రెండు మామిడి చెట్లను రామలక్ష్మణులని భక్తులు పిలుచుకుంటారు. అంతేకాకుండా ద్వాపరయుగంలో పాండవులు కూడా అరణ్యవాస కాలంలో ఈ అడవిలో సంచరించినట్లు చెబుతారు. అయితే అప్పట్లో ఇక్కడ కొందరు రాక్షసులు సంచరించేవారట. రాక్షసులు వారిలో వారు కలహించుకున్నప్పుడు పెద్ద యుద్ధం జరిగిందట. రాక్షసుల పోరులో గుబ్బల మంగమ్మ తల్లి నివసిస్తున్న గుహ కూలిపోయిందట. దీంతో కోపగించిన మంగమ్మ తల్లి రాక్షసులను సంహరించిందని, ఆమె ఆగ్రహజ్వాలలకు ప్రకృతి అల్లకల్లోలం కాగా, దేవతలంతా దిగివచ్చి, ప్రార్థనలు చేసి ఆమెను శాంతింపజేశారని స్థలపురాణం చెబుతోంది. నాటి నుంచి గలగల పారే సెలయేటి నడుమ గుబ్బలు గుబ్బలుగా ఉన్న గుహలో మంగమ్మ తల్లి వెలిసిందని, అందుకే గుబ్బల మంగమ్మ తల్లిగా ప్రసిద్ధి పొందిందని చెబుతారు. మంగమ్మ తల్లికి తోడుగా ఇక్కడ గంగమ్మ, నాగమ్మ తల్లులు కూడా వెలిసినట్లు చెబుతారు. ఇలా దట్టమైన అరణ్యంలో ఆహ్లదకరమైన ప్రకృతి నడుమ ఎల్లప్పుడు ఆలయం పైనుంచి నీటి ధార పడుతూ రాతి గుహలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి దర్శనానికి ప్రతి ఆదివారం, మంగళవారం వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.