Home Unknown facts ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథుడి రథోత్సవం గురించి కొన్ని నిజాలు

ప్రపంచ ప్రసిద్ధి పొందిన పూరీ జగన్నాథుడి రథోత్సవం గురించి కొన్ని నిజాలు

0

పూరి జగన్నాథ రథయాత్ర కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ప్రతి ఆలయంలో గర్భ గుడిలోని విగ్రహాలు రాతి తో చేయబడితే ఇక్కడి ఆలయంలో మాత్రం స్వామి వారి విగ్రహాలు చెక్కతో చేయబడినవి. మరి విగ్రహాలు చెక్కతో తయారుచేయడం వెనుక కథ ఏంటి? జగన్నాథ రథయాత్ర ఎలా మొదలవుతుంది? ఇంకా ఇక్కడి ఆలయ విశేషాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

puri jagannathaఒడిశా రాష్ట్రము పూరి జిల్లాలో బంగాళాఖాతం తీరాన పూరి పట్టణంలో పూరీ జగన్నాథ దేవాలయం ఉంది. నీలాద్రి అనే పర్వతం పైన ఈ ఆలయం ఉంది. పూర్వము ఈ పూరీ ని పురుషోత్తమ క్షేత్రం అని, శ్రీ క్షేత్రం అని, దశావతార క్షేత్రం అని పిలిచేవారు. ఈ ఆలయం సుమారు 4,00,000 చదరపు అడుగుల భారీ వైశాల్యం కలిగి ఉండి చుట్టూరా ఎత్తైన ప్రకారం కలిగి ఉండి లోపల సుమారు 120 ఆలయాలు ఉన్నాయి.

ఈ ఆలయానికి సంబంధించి అతి ప్రధానమైన రెండు విశేషాలు ఉన్నాయి. మొదటిది నవ కళేబర ఉత్సవం, రెండవది ప్రపంచ ప్రసిద్ధి పొందిన రథోత్సవం. ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు చెక్కతో చేయబడినవి కనుక ఈ విగ్రహాలను దహనం చేసి కొత్తగా చేసిన విగ్రహాలను తిరిగి ప్రతిష్టిస్తారు. దీనినే “నవ కళేబర ఉత్సవం” అని అంటారు. అయితే చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు మూడేళ్ళ కొకసారి ఎదో ఒక నెలలో అధిక మాసం వస్తుంది. ఆలా ఆషాడ మాసం అధిక మాసంగా వచ్చిన సంవత్సరంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించే ఈ నవకళేబరోత్సవం జరుగుతుంది.

పూరీ నగరానికి సుమారు 60 మైళ్ళ దూరంలో ఉన్న ఒక నది ఒడ్డున ఉండే ఒక రకమైన వేపచెట్టు యొక్క కాండం నుండి ఈ విగ్రహాలను తయారుచేస్తారు. ఈ నవకళేబరోత్సవం రథయాత్ర జరిగే రోజుకు రెండు రోజుల ముందు జరుగుతుంది. అయితే అన్ని విగ్రహాలను మార్చిన, జగన్నాథుని నాభి పద్మాన్ని మాత్రం మార్చిక ఎప్పుడు ఒకటే ఉంచుతారు. ఎందుకంటే ఈ పద్మంలో గౌతమబుద్దిని దంతం ఉందని తెలియుచున్నది.

పురాణం విషయానికి వస్తే, ఇంద్రద్యుమ్నుడనే మహారాజుకు విష్ణుమూర్తి కలలో కనిపించి చాంకీ నదీ తీరానికి ఒక కొయ్య కొట్టుకు వస్తుందనీ దాన్ని విగ్రహాలుగా మలచమనీ ఆజ్ఞాపించాడట. కానీ అలా నదీతీరంలో లభ్యమైన దారువును విగ్రహాలుగా మలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదట. అప్పుడు దేవశిల్పి విశ్వకర్మ రాజు వద్దకు మారువేషంలో వచ్చి ఆ కొయ్యను తాను విగ్రహాలుగా మలచగలనన్నాడట. కానీ తాను తలుపులు మూసుకుని ఈ పని చేస్తానని తన పనికి మధ్యలో ఆటంకం కలిగించకూడదనీ షరతు పెడతాడు. ఆలా 15 రోజుల తర్వాత ఉత్సుకతను ఆపుకోలేని రాజు తలుపులు తెరిచి చూస్తాడు. అప్పుడు ఆ శిల్పి మాయం అయిపోతాడు. అయితే అప్పటికి విగ్రహాల నిర్మాణం పూర్తికాలేదు. దాంతో వాటిని అలాగే ప్రతిష్ఠించారనీ ఇప్పటికీ జగన్నాథుడు అదే రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నాడనీ స్థలపురాణం.

ఇక రథయాత్ర విషయానికి వస్తే, ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే… జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

జగన్నాథుడి రథాన్ని నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో నందిఘోషను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పద్మధ్వజం. ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు.

జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్రపేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది.

ఈవిధంగా జరిగే జగన్నాథ రథయాత్రలో పాల్గొనేందుకు భక్తులు లక్షల సంఖ్యల్లో హాజరవుతారు.

Exit mobile version