Editing is where movies are made or broken. Many a film has been saved and many a film has been ruined in the editing room – Joe Dante
ఒక సినిమాకి ఎడిటరు మొదటి ప్రేక్షకుడు..
ఎడిటింగు ఒక ధ్యానం.. ఒక్కో ఫ్రేమునీ ఎదురుగా స్క్రీన్ మీద చూస్తూనే మనసులో మరోలా చూస్తూ స్క్రీన్ మీది షాట్ల వరసని మార్చేసి, అనవసరమైన ఫ్రేములని తీసేసి భావాన్ని చెబుతూనే పట్టు, విడుపు ఉంచుతూ అందాన్ని చెదరనీయకుండా ఒక సినిమా హాల్లో అయిదొందలమంది మధ్య కూర్చుని ఈలలేస్తూ చూసే ప్రేక్షకుడే కాక తన హోం థియేటర్లో డిన్నర్ చేస్తూ ఫ్యామిలీతో కూర్చుని చూసే ప్రేక్షకుడు కూడా ఒకేలా రియాక్టవగలిగే కూర్పుని సమకూర్చేవాడు ఎడిటర్..
కెమెరామాన్ నీ మాట వినడం ఎంత అవసరమో ఎడిటర్ నీ విజన్లో చూడడమూ అంతే అవసరం.. డైరెక్టరుగా నువ్వో వందమంది యూనిట్ మెంబర్లందర్నీ ఒక్క తాటిమీదికి తీసుకొచ్చి యాభై రోజులపాటు షూటింగు చేసి యాక్టర్లను నవ్వించి ప్రొడ్యూసరుని ఏడిపించి తీసిన ఫిలిం మొత్తాన్ని ట్రాష్ అని తేల్చేస్తాడు ఎడిటరు.. నీకు అందులో ప్రతి ఫ్రేమూ ఇష్టమైనదే.. ప్రతి షాటూ ఏదో ఒక పర్పజ్ తోనే తీసి ఉంటావు.. ఎట్లీస్ట్ అనుకుంటావు.. తీసిన ఏ షాటూ తీసేయగూడదంటావు..
అందుకే ఒక రకమైన నిర్లక్ష్యపు నిర్లిప్తత కోసమే ఎడిటర్ని తీసుకుంటారు.. నీకిష్టమైన షాట్లను కాదు.. కథకు అవసరమైన షాట్లను మాత్రమే ఉంచుతాడు.. అసలు నువ్వు ఊహించని కోణంలో చూపిస్తాడు సినిమా మొత్తాన్ని.. అతనో కొత్త కథ రాస్తాడు..
అది నువ్వనుకున్నట్టే ఉంటే ఒక ఆనందం.. కానీ ఒక గొప్ప ఎడిటరు టేబుల్ మీద కూర్చుంటే సినిమా మొత్తం మారిపోతుంది.. అదీ డైరెక్టరుకి అసలు ఆనందం.. సచిన్ టెండూల్కర్ సెంచరీ కొడితే కెప్టెన్ ధోనీకి కలిగిన ఆనందం లాంటిదన్నమాట.. ఆ అనుభూతి చాలారోజులపాటు నీతోనే ఉండిపోతుంది..
శ్రీకర్ ప్రసాద్ గారు ఒక సీను రష్ చూశాక ఓ నాలుగైదు నిముషాలపాటు మౌనంగా కూర్చుని తరవాత పదినిముషాలలో షాట్ ఆర్డరు మార్చేసి నావైపు నవ్వుతూ చూశారోసారి.. అప్రతిభుడవడం అంటే ఏమిటో స్వయంగా ఫీలయాను.. ‘అలా ఎలా ఆలోచించగలిగారు..’
ఇహ ఫైనల్ ఎడిటింగు దగ్గర ఆయనను చూడాలి.. ఒకసారి ఒక వరదలా ముంచి తేల్చేసినట్టు ఒక రెండు మూడు సీన్లకు సీన్లు లేపేస్తే ఒక్కోసారి కెరటాలు ముద్దుగా పాదాలను తడిపి వెళ్తున్నట్టు షాట్లలోంచి మూడు నాలుగు ఫ్రేములను తీసేసేవారు.. పాతవి వెతికి పట్టుకొచ్చి మరీ మరమ్మత్తులు చేసేవారు..
ఎడిటింగునుంచే సౌండుకీ, వీడియోకీ, సీజీలకీ, ఆప్టికల్సుకీ రిఫరెన్సు వెళ్ళేది.. అంటే సినిమాలో ఒక ఫ్రేము తగ్గాలన్నా పెరగాలన్నా డైరెక్టరు నిర్ణయిస్తే సరిపోదు.. ఎడిటరు ఒప్పుకోవాలి..
ఒక మంచి షాటుకి సైలెంటుగా అభినందన ఇస్తాడు గానీ.. షాట్సులో జెర్కులను, ల్యాగులను, అనవసరమైన స్పీడుని, పిచ్చి పిచ్చి డచ్చాంగిళ్లని, అర్ధం లేని సీజీ ఫుటేజిని, విషయం లేని బిల్డప్పు షాట్లని సహించడు ఏ ఎడిటరు కూడా.. ఎడిటరు సహజంగా ఆర్గానిక్ ఆలోచనావిధానంతో ఉంటాడు..
అసిస్టెంట్ డైరెక్టర్లను బూతులు తిట్టే ఎడిటర్లను, పెద్దపెద్ద డైరెక్టర్లను లెక్కచేయని ఎడిటర్లను చూశాను.. కెమెరామన్ కంపోజిషన్లను, స్మూత్ కటింగుకి అవకాశమివ్వకుండా కట్ చెప్పే డైరెక్టర్లను ఆడుకునే ఎడిటర్లను చూశాను.. ప్రతి ఓకే అయిన టేకులోంచీ తప్పులు వెతికి కళ్లెదురుగా పెట్టి కొశ్చన్ చేసే ఎడిటర్లను చూశాను.. వాటికి జవాబు చెప్పలేక సిగరెట్ తాగే నెపంతో బైటికి వెళ్లిపోయిన డైరెక్టర్లనీ చూశాను..
ఎడిటరంటే లెంగ్తు ఎక్కువైతే కత్తిరించేవాడు కాదు.. అతనో శిల్పి.. ఒక సృష్టికర్త..
ఎడిటరు ఒక సినిమాకి మొదటి ప్రేక్షకుడే కాదు.. ఆఖరి దర్శకుడు కూడా..
– Raj Madiraju
So here’s the bottom line “EDITING IS CINEMA“