Home Unknown facts గర్భగుడిలో మాత్రం రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద దర్శనం ఇచ్చే ఆలయం

గర్భగుడిలో మాత్రం రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద దర్శనం ఇచ్చే ఆలయం

0

ప్రతి శివాలయంలో గర్భగుడిలో ఒక శివలింగాన్ని మనం చూస్తుంటాం. కానీ ఈ ఆలయ గర్భగుడిలో మాత్రం రెండు శివలింగాలు ఒకే పానవట్టం మీద దర్శనం ఇవ్వడం విశేషం. ఇంకా అద్భుతం ఏంటంటే ఈ జోడిలింగాలను శివపార్వతులుగా కొలుస్తారు. ఇక్కడే పూర్వం శివపార్వతులు బాలుని రూపంలో సంచరించారని పురాణం. ప్రతి రోజు ఉదయం సూర్యకిరణాలు ఈ జోడులింగాల పైన పడుతాయి. మరి ఈ శివాలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Shiva Parvatiఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాకి 20 కి.మీ. దూరంలో కూడేరు అనే గ్రామం ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం ఉంది. జోడిలింగాల ఆలయం అని పిలువబడే ఈ ఆలయం పదవ శతాబ్దానికి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఆలయానికి ఏంటో పౌరాణిక నేపథ్యం ఉన్నది. ఆలయ గాధను తెలిపే శిల శాసనాలు ఆలయ ప్రాంగణంలోనే ఉన్నాయి. ఇవి తెలుగు లిపిలో ఉండటం ఒక ప్రత్యేకత.

ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, శాలివాహన 1600 శతాబ్దంలో సిద్ధిప్ప నాయక అనే వ్యక్తి పశువులను తీసుకెళ్తు కూడేరు సంపిపంలో బస చేసాడని, పశువులను అక్కడే ఉంచి రెండు రాళ్ళూ ఉండగా మరో రాయిని జోడించి భోజనం చేయడానికి తయారవుతుండగా పెద్ద శబ్దం వచ్చి సిద్దప్ప నాయక్ తో పాటు తోటి పశువుల కాపరులకు కూడా కళ్ళు కనిపించకుండా పోయాయి. అప్పుడు వెంటనే బాలుని రూపంలో వచ్చిన పార్వతి పరమేశ్వరులు పుట్టు శిలలు ఉన్న చోట అన్నం వండరాని, అందుకే కళ్ళు పోయాయి అని ఆ కాపరికి చెప్పారు. అప్పుడు సిద్దప్ప నాయక్ ఇంకా మిగిలిన కాపరులు ఇప్పుడు ఏం చేయాలనీ బాలుని వేడుకొనగా బూడిదను కళ్ళకు పూసుకోవాలి చెప్పగా వారు బూడిదను తీసుకొని పూసుకొనగా అప్పుడు వారికీ కళ్ళు వస్తాయి. అలా కళ్ళు తిరిగి రాగానే వారు అక్కడ స్వామివారికి గుడి కట్టించారని ఆలయంలోని శాసనాల స్థలపురాణం చెప్పుతుంది.

ఇక్కడ గర్భాలయంలో శివపార్వతులు ఇద్దరు కూడా లింగరూపంలో దర్శనం ఇస్తారు. అర్ధనారీశ్వరుడు అన్న దానికి నిదర్శనంగా ఆది దంపతులు ఇద్దరు ఒకే పానవట్టం మీద లింగరూపులై అభిషేకాలు, పూజలు అందుకొంటున్నారు. ఆ లింగాన్ని దర్శించుకుంటే కోటి లింగాల దర్శన ఫలితం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఈ జోడు లింగాలు 182 అడుగుల నుండి ఉత్భవించినవని చెబుతారు. ఈ లింగాలకు మరో ప్రత్యేకత కూడా ఉంది. గర్భగుడిలో ఉన్న ఈ శివపార్వతుల లింగాలపై సూర్యకిరణాలు ఉదయాన్నే నేరుగా సోకుట జరుగుతుంది. ఇచట రాహు, కేతులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తుంటారు.

ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవం మరియు రధోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తారు.

Exit mobile version