Home Unknown facts Panchabhutalingala gurinchi meeku thelusa? Avi ekkada unnaye?

Panchabhutalingala gurinchi meeku thelusa? Avi ekkada unnaye?

0

శివుడు లింగరూపంలో భక్తులకి దర్శనమిస్తాడని అందరికి తెలిసిన విషయమే, అయితే శివుడు లింగ రూపంలో వెలసిన ఈ లింగాలను దర్శిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. మరి ఆ పంచభూతలింగాలు ఏంటి? అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయు లింగం వీటినే పంచభూతలింగాలు అని అంటారు.
పృథ్విలింగం:panchabhuthalaతమిళనాడులోని కంచి క్షేత్రంలో ఈ లింగం ఉంది. భారతదేశంలో అతి పెద్ద గోపురాలు గల ఆలయాలలో ఈ ఆలయం ఒకటి. ఈ లింగం పార్వతీదేవిచే ప్రతిష్టింపబడింది. ఇక్కడ ఏకాంబరేశ్వరుడు, కామాక్షీదేవి కొలువై ఉన్నారు. ఈ కామాక్షి అమ్మవారి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటిగా చెబుతారు. కంచి లోని శివలింగం మట్టితో చేసినది కాబట్టి లింగానికి అభిషేకము జరగదు. నూనెను మాత్రం పూయడం జరుగుతుంది.
ఆకాశలింగం:ఇది తమిళనాడులోని చిదంబర క్షేత్రంలో ఉన్నది. పరమ శివుడు ఆనందతాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి. అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు. ఈ ఆలయానికి 9 ద్వారాలు ఉంటాయి. ఇవి మనిషిలోని నవరంధ్రాలకు సూచికలుగా చెబుతారు. గర్భగుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం ఉంటుంది. దానికి తెర వేసి ఉంటుంది. ఆ గోడపై యంత్ర అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు బిల్వ పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటివైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగు, లోపలి వైపు జ్ఞానాన్నీ, ముక్తినీ సూచించే ఎరుపు రంగూ ఉంటుంది. పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలో మూలవిరాట్ ఉండాల్సిన స్థానంలో ఖాళీస్థలం ఉంటుంది. అందుకే ఈ ఆలయానికి చిదంబర రహస్యం అని పేరు వచ్చినది.
జలలింగం:తమిళనాడులోని తిరుచిరాపల్లిగా పిలిచే త్రిచికి 11 కి.మీ దూరంలో పంచభూత క్షేత్రాలలో ఒకటైన జంబుకేశ్వరాలయం ఉంది. పవిత్ర కావేరీ నది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం జలం ను సూచిస్తుంది. ఈ ఆలయానికి తిమేవకాయ్, తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ లింగం కింద ఎప్పుడూ నీటి ఊట ఉంటుంది. ఇక్కడి స్వామివారి పేరు జంబుకేశ్వరుడు, అమ్మవారు అఖిలాండేశ్వరి.
తేజోలింగం:తమిళనాడులోని అరుణాచలంలో తిరువన్నామలై క్షేత్రంలో పంచభూత లింగాలలో ఒకటైన తేజోలింగం ఉన్నది. అరుణాచల శిఖరాగ్రంపై అగ్నిశిఖ ఒకటి ఆవిర్భవించి తేజోలింగ రూపమయ్యాడు శివుడు. ఇక్కడ శివుడిని అరుణాచలేశ్వరుడు అని, అమ్మవారిని అరుణాచలేశ్వరి అని పిలుస్తారు.
వాయులింగం:శ్రీ కాళహస్తిలో వాయులింగం ఉంది. ఇక్కడ శివలింగాన్ని అభిషేకించేటపుడు ఎవరూ లింగాన్ని తాకరు. కేవలం లింగం యొక్క కింద భాగమైన పానవట్టాన్ని మాత్రమే తాకుతారు. స్వయంభువుగా వెలసిన ఇక్కడ శివలింగం నుంచి వచ్చే గాలికి ఎదురుగా ఉన్న దీపం రెపరెపలాడుతుంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణకాశీ అని అంటారు. ఇక్కడి స్వామి పేరు శ్రీకాళహస్తీశ్వరుడు, అమ్మవారి పేరు జ్ఞానప్రసూనాంబ.
ఇలా శివుడు ఈ ఆలయాలలో వెలసిన లింగాలను పంచభూతలింగాలని చెబుతారు.

Exit mobile version