Home Unknown facts నెమలి రూపంలో పార్వతీదేవి శివుడికి నిర్మించిన ఆలయం గురించి తెలుసా ?

నెమలి రూపంలో పార్వతీదేవి శివుడికి నిర్మించిన ఆలయం గురించి తెలుసా ?

0

శివుడు లింగ రూపంలో వెలసిన ఆలయాలు దేశంలో అనేకం ఉన్నాయి. అందులో అతి పెద్ద శివాలయాలలో ఈ ఆలయం ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే పార్వతి దేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం ఇది. మరి పార్వతీదేవి ఈ దేవాలయాన్ని ఎందుకు సృష్టించింది? ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

shivalayamతమిళనాడు రాష్ట్రం, నాగపట్నం జిల్లా, మైలాడుతురై అనే మాయవరం అనే పట్టణంలో మయూరనాథ దేవాలయం ఉంది. మాయవరం ను ప్రస్తుతం మైలాడుతురై అని పిలుస్తున్నారు. ఇది చాలా పురాతన ఆలయంగా ఎంతో విశిష్టతను కలిగి ఉంది. ఈ దేవాలయ రాజగోపురం 9 అంతస్థులలో నిర్మించబడింది. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివాలయాల్లో ఇది కూడా ఒకటి.

ఇక స్థల పురాణానికి వస్తే, దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని ఇక్కడ నిర్వహించ తలపెట్టి ఆ యజ్ఞానికి కూతురైన పార్వతీదేవిని, అల్లుడైన శివుడిని పిలువలేదు. కానీ ఆహ్వానం లేకున్నా తన తండ్రి ఇల్లే కదా అని, పార్వతి శివుడు వారిస్తున్నా వినకుండా యజ్ఞ వాటికకు చేరింది. అక్కడ దక్షుడు తననే కాకుండా శివుడిని కూడా అవమానించడంతో చింతిస్తూ అక్కడ కూర్చొని ఉండగా యజ్ఞగుండంలోని అగ్నికి బయపడి ఒక చిన్న నెమలి పిల్ల వచ్చి పార్వతి వొళ్ళో దాక్కుందట.

ఈలోగా పార్వతికి జరిగిన అవమానం తెలిసిన శివుడు వీరబద్రుడిని యజ్ఞబంగం చేసేందుకు పంపించాడు. అయితే వీరబద్రుడు యజ్ఞవాటికను కూల్చి వేస్తుండగా, పార్వతి విచారంలోకి వెళ్ళిపోయి, భర్తనేదిరించిన బారాలు అధికమై అందుకు శిక్షగా అగ్ని ప్రవేశం చేసింది. తనతో పాటు తన ఒళ్లోని నెమలి పిల్ల కూడా అగ్నికి ఆహుతైంది. ఆలా నెమలితో అగ్నికి ఆహుతి కావడంతో తర్వాత ఆమె నెమలి రూపంలో జన్మించి తన పాపాన్ని ప్రక్షాళన చేసుకోవాలనే ఉద్దేశంతో పార్వతి ఇక్కడ ఒక మందిరాన్ని సృష్టించి శివుని ప్రార్ధించి అతనిలో లీనమైపోయినట్లు స్థల పురాణం చెబుతుంది.

పార్వతీదేవి మయూర రూపంలో స్వయంగా సృష్టించిన దేవాలయం కాబట్టి ఈ ఆలయానికి మయూరనాథ దేవాలయం అని పేరు స్థిరపడిపోయింది. మయూరనాథుడే శివుడు. ఇంకా పార్వతీదేవిని అభయంబికా, అభయ ప్రదాంబిక అనే పేర్లతో భక్తులు కొలుస్తారు.

ఈ ఆలయంలో ఒక మర్రిచెట్టు ఉంది ఈ మర్రిచెట్టు కింద పార్వతి మయూర రూపంలో తపస్సు చేసిందని భక్తులు భావిస్తారు. ఇక్కడ కావేరి నది ప్రవహిస్తుంది. దీన్ని వృషభ తీర్థం అని పిలుస్తారు. ఇక్కడి ఈ కావేరి నదిలో ప్రతి పౌర్ణమి రోజున గంగ, యమునా తమతమ అంశలతో నదులు ఇక్కడికి వచ్చి జలాల్ని ఈ కావేరినదిలో జారవిడుస్తాయట. అందువలన ఈ ప్రాంతాన్ని దక్షిణ త్రివేణి సంగమం అని భక్తులు భావిస్తుంటారు.

Exit mobile version