Written By Aranya Krishna
భూమినడుగు చెబుతుంది
తన ఉమ్మనీరులో క్రిమిసంహారకాలు కూరిన
దుర్మార్గ శాస్త్రవేత్తెవ్వరో
ఆకాశాన్నడుగు చెబుతుంది
ఓజోన్ వలువని ఊడబెరికిన
సాంకేతిక దుశ్శాసనుడెవ్వరో
అడవినడుగు చెబుతుంది
చెట్లను నరికి భూసారాన్ని హత్యచేసే
ఆర్ధిక ఉగ్రవాది ఎవరో
తనని చిత్తుకాగితాలుగా చింపి ఫ్లోరింగ్ గా నేల కిందేసి తొక్కిన
ధూర్త నాగరీకుడెవ్వరో
నదినడుగు చెబుతుంది
నీటి గుండెలో గునపం దించుతూ ఇసుకని
దోచుకెళ్ళిన దొంగెవరో
అభివృద్ధికోసం వ్యాపారమైనా
ఆక్రమణ కోసం యుద్ధ విధ్వంసమైనా
ప్రకృతిని కొరుక్కుతినే చీడపురుగు మనిషేనని!